CBSE: ‘టెన్త్’ సైన్స్ ప్రిపరేషన్‌ను ఇలా ప్లాన్ చేసుకుంటే..!
ABN , First Publish Date - 2023-03-01T12:43:00+05:30 IST
పరీక్షలు తలుపు తట్టడమే కాదు, మన ముంగిటికి వచ్చేశాయి. చదివినవన్నీ వస్తాయా, రావా అన్న అనుమానం, ఆపై కొంత అయోమయం ఎంతటి వారికైనా సహజం
పరీక్షలు తలుపు తట్టడమే కాదు, మన ముంగిటికి వచ్చేశాయి. చదివినవన్నీ వస్తాయా, రావా అన్న అనుమానం, ఆపై కొంత అయోమయం ఎంతటి వారికైనా సహజం. ఈ నేపథ్యంలో సైన్స్ ప్రిపరేషన్‌ను ఎంత సులువుగా చేసుకోవచ్చో చూద్దాం.
పరీక్షలకు సంబంధించి మనకో టూల్ ఉంది. స్వాట్ (ఎస్‌డబ్ల్యుఒటి)... వివరంగా చెప్పాలంటే స్మార్ట్, వీక్‌నెస్, ఆపర్ట్యూనిటీ, థ్రెట్స్. ఈ టూల్ ప్రకారం తప్పనిసరిగా వస్తుందని అనుకొనే టాపిక్స్‌ను తీసుకోవాలి. పరీక్షలో తప్పనిసరిగా వాటిలో ప్రతి టాపిక్ నుంచి ప్రశ్న అడుగుతారని తెలుసు. అయినప్పటికీ కొన్ని టాపిక్స్ అంటే భయం. అలాంటప్పుడు ఏం చేయాలన్నదే ఇక్కడ ప్రశ్న. ఉదాహరణకు యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్‌ని సులువుగా గుర్తుంచుకోవచ్చు. ఒకరకంగా అది కంఫర్ట్ జోన్. అదే ఫార్ములాలు, డయాగ్రమ్స్ అలాగే రిప్రొడక్టివ్ సిస్టమ్ డయాగ్రమ్స్. జనటిక్స్ క్రాసెస్ కష్టంగా అనిపిస్తాయి. వాటి విషయంలో ప్రాక్టీస్ కీలకం. ఆ ప్రాక్టీసే వీక్‌నెస్ అనుకోండి. అక్కడ మైండ్‌సెట్ మార్చుకోవాలి. టాపిక్‌ను గుర్తుంచుకోవడానికి అనుగుణంగా విభజించుకుని ఒకదానికి ఒకటి లింక్ చేసుకుంటూ నేర్చుకోవాలి.
సైన్స్ అనగానే ఈ సబ్జెక్టులో ఎక్కువ మార్కులు తెచ్చుకునేందుకు మన వ్యూహం ఎలా ఉండాలన్న ప్రశ్న తప్పనిసరిగా తలెత్తుతుంది. పూర్తిగా లేబులింగ్‌తో డయాగ్రమ్, రీజనింగ్‌తో స్టెప్స్ వారీగా న్యూమరికల్స్ వేయడం ద్వారా మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. హార్డ్‌గా ఉన్న చోట కోల్పోయిన మార్కులను డయాగ్రమ్‌లు జాగ్రత్తగా గీయడం ద్వారా పొందవచ్చు. జవాబు నిడివి ఎక్కువ ఉన్న జవాబుల కంటే ప్రాసెస్ ఏదైనప్పటికీ ఫ్లో చార్టులు కూడా మార్కులు పెంచుకునేందుకు దోహదపడతాయి. ఉదాహరణకు డబుల్ సర్క్యులేషన్ లెంథీ ప్రాసెస్ కాదు. అయినప్పటికీ దానికి బదులుగా ఫ్లో చార్ట్‌ను అటెంప్ట్ చేస్తే సులువుగా అర్థమవుతుంది, మంచి మార్కులూ వస్తాయి. ఎంతబాగా ప్రిపేరైనప్పటికీ పరీక్ష రోజున ఎంతో కొంత ఆందోళన ఉంటుంది. అలాంటప్పుడు ప్రశాంతంగా ఉండేందుకు కింది వ్యూహం దోహదపడుతుంది.
ప్రశ్నపత్రం చేతిలోకి రాగానే ప్రశ్నలన్నింటినీ ఒకసారి లోతుగా పరిశీలించాలి. బాగా రాయగలం అని నమ్మకం కలిగించే వాటిని మొదట హైలైట్ చేసుకోవాలి. పాక్షికంగా తెలిసిన వాటిని సర్కిల్ చుట్టిపెట్టుకోవాలి. కచ్చితంగా తెలియని వాటిని క్రాస్ మార్కుతో గుర్తు పెట్టుకోవాలి. ఆపై బాగా రాయగలం అనుకున్న వాటితో సమాధానాలు రాయడాన్ని మొదలుపెట్టాలి. జవాబు పత్రం బాగా ఉండటానికి తోడు విద్యార్థికీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తరువాత పాక్షికంగా తెలిసిన వాటిని రాయాలి. అస్సలు తెలియవు అనుకున్నవాటిని చివర్లో అటెంప్ట్ చేయాలి. ఒక వేళ తెలియకున్నా రాసినప్పటికీ కరెక్ట్ అయినంత మేర మార్కులు వస్తాయి. అది తుది స్కోర్‌ను పెంచేందుకు ఉపయోగపడతాయి. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి. జవాబు రాయకుండా ఏ ప్రశ్నను వదిలిపెట్టకూడదు.
ముఖ్యంగా
జవాబు రాయడానికి ముందే అదెలా అన్నది మైండ్‌లో ఫ్రేమ్ చేసుకుని మొదలుపెట్టాలి. సైన్స్‌లో సమాధానాలు పాయింట్స్‌గా రాయాలి. పేరాగ్రాఫ్ ఫార్మేట్‌లో స్టోరీ రూపంలో రాస్తే ఎగ్జామినర్‌ను ఆకట్టుకోలేరు.
ఎంసీక్యూ ప్రశ్నలు ఆప్షన్ నంబర్‌కు తోడు ఆప్షన్స్‌లో ఇచ్చిన నంబర్ రాయాలి. ఉదాహరణకు ఒక ప్రశ్నకు సోడియం జవాబు, బి ఆప్షన్ అయినప్పుడు ఆ రెంటినీ ‘(బి) సోడియం’ అనిరాయాలి.
ఖాళీలు పూరించే విషయంలో ఫుల్ స్టేట్‌మెంట్‌తో కలిపి జవాబు రాయాలి. ఉదాహరణకు జవాబు ఫ్లోరిన్ అయినప్పటికీ ఆ స్టేట్‌మెం ట్ అంతా రాసి జవాబుగా బ్లాంక్ స్పేస్‌లో ఫ్లోరిన్‌ను జోడించాలి.
ఒక మార్కు వచ్చే జవాబులకు ఆన్సర్ ఒకటి రెండు లైన్లలో రాస్తే సరిపోతుంది. పేరాగ్రా్‌ఫలు రాస్తే మార్కులు రావడానికి బదులు తగ్గుతాయి. ఇక్కడ నవలలు రాయకూడదు. పాయింట్‌కు పరిమితం కావాలి.
జవాబు రాసే విషయంలో సాధారణ భాష ఉపయోగించాలి. కీలకమైన పదాలను మిస్ కాకూడదు. వాటిని అండర్‌లైన్ చేయాలి.
ప్రతి నిర్వచనానికి ఉదాహరణలు రాయాలి. ఎగ్జామినర్‌పై ఇది మంచి ప్రభావం చూపుతుంది.
డయాగ్రమ్స్, ఫ్లోచార్టులు, టేబుల్స్ అవసరమైన చోట వాటిని రాయాలి. లేబులింగ్ తప్పనిసరి. ఒక మార్కు జవాబు అయితే పాయింట్ సూటిగా ఉండాలి. అదే అయిదు మార్కుల ప్రశ్న అయితే మొదట డయాగ్రమ్ గీయాలి. అడగకున్నా గీసి లేబులింగ్ చేయడం మర్చిపోకూడదు. అవసరాన్ని బట్టి టేబుల్ వేసి తరవాత దానిని వివరిస్తూ రాయాలి.
న్యూమరికల్స్ విషయంలో వాల్యూస్ అన్నీ సక్రమంగా క్వాంటిటీ్‌సతో రాయాలి.
ఉదాహరణకు F = 20 N, S = 10m.
తదుపరి కాలిక్యులేషన్‌కు అవసరమైన ఫార్ములా రాయాలి. eg: W = F x S.
పైన పేర్కొన్న విషయాలకు మించి మరొకటి ఉంది. మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. రిలాక్స్‌డ్‌గా ఉండాలి. ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా సైన్స్ పరీక్ష రాసేందుకు వెళ్ళాలి. దానంతట అదే మంచి స్కోర్ వస్తుంది.
- బూస శషి కుమార్,
బైజూస్ అకడమిక్ సెంటర్ హెడ్,
నెల్లూరు, ఆంధ్రప్రదేశ్