Exam Special: మలిదశ తెలంగాణ ఉద్యమం గురించి..

ABN , First Publish Date - 2023-04-14T11:43:41+05:30 IST

భారతదేశ భౌగోళిక చిత్రపటంలో తెలంగాణ ప్రాంతం ఉత్తర దక్షిణ కూడలిలో విస్తరించిన వ్యూహాత్మక కేంద్రం. ఈ ప్రాంతం దార్వార్‌ సమూహానికి చెందిన అతి పురాతన శిలలతో

Exam Special: మలిదశ తెలంగాణ ఉద్యమం గురించి..
Exam Special

భారతదేశ భౌగోళిక చిత్రపటంలో తెలంగాణ ప్రాంతం ఉత్తర దక్షిణ కూడలిలో విస్తరించిన వ్యూహాత్మక కేంద్రం. ఈ ప్రాంతం దార్వార్‌ సమూహానికి చెందిన అతి పురాతన శిలలతో నిర్మితమైన భూభాగం. మొత్తం భారతదేశంలోనే అతి పురాతన పీఠభూమి ఇది. సమద్విబాహు త్రిభుజాకారంలో, అగ్ని, అవక్షేప, రూపాంతర శిలలతో ఏర్పడిన ఈ నేల తన రాజకీయ అస్తిత్వం కోసం, ప్రత్యేక రాష్ట్ర గుర్తింపు కోసం నిర్వహించిన అనేక పోరాటాల సమ్మేళనమే మలిదశ ఉద్యమం.

గ్రూప్స్‌ పరీక్షల కోసం ప్రిపేర్‌ అవుతున్న అభ్యర్థులకు తెలంగాణ భౌగోళిక, ఆర్థిక, రాజకీయ, సామాజిక, చారిత్రక, సాంస్కృతిక అంశాలపై సమగ్ర సమాచారం ఉం డాలి. మలిదశ ఉద్యమంలో కవులు, కళాకారులు, విద్యార్థులు, వృత్తిదారులు, మేధావులు, రాజకీయ నాయకులు నిర్వహించిన పాత్ర తెలంగాణలో సాంస్కృతిక పునరుజ్జీవాన్ని సాధించింది. మొత్తం తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రాష్ట్ర ఆవిర్భావ దశ అత్యంత కీలకమైంది. ప్రతి గ్రూప్‌ పరీక్షలో గాని, పోలీస్‌, ఉపాధ్యాయ, ఇతర పోటీ పరీక్షల్లో గాని అత్యధిక మార్కులు ఈ విభాగం నుంచే వచ్చే అవకాశం ఉంది.

మలిదశ ఉద్యమానికి తొలి అడుగులు

మలిదశ తెలంగాణ ఉద్యమం 1980 దశకంలో మొదలైంది. తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించిన తెలుగు జాతి భావనకు వ్యతిరేకంగా ఉద్భవించింది. ఈ ఉద్యమాన్ని ఆరంభించడంలో 1969 ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు కీలకమైన పాత్రను పోషించారు. వీరి తపనకు ఈ కింది అంశాలు తోడయ్యాయి.

  • 610 జీవో అమలు కోసం ఉద్యమకారులు, ప్రధానంగా ఎన్జీవోలు చేసిన పోరాటం

  • 1983లో ట్యాంక్‌బండ్‌పై ఎన్టీఆర్‌ ప్రభుత్వం తెలుగు వైతాళికులు అనే పేరుతో ఏర్పాటు చేసిన విగ్రహాలు. 1990లో ఢిల్లీలో నేషనల్‌ మూవ్‌మెంట్‌ ఫర్‌ స్టేట్స్‌ రీ ఆర్గనైజేషన్‌ సమావేశం

  • 1990 దశకంలో ఎల్‌పీజీ(లిబరలైజేషన్‌, ప్రైవేటైజేషన్‌, గ్లోబలైజేషన్‌) ప్రభావం వల్ల తెలంగాణ సమాజానికి జరిగిన నష్టం. రైతులు, చేతి వృత్తుల వారి ఆత్మహత్యలు

  • 1996 ఆగస్టు 15న అప్పటి ప్రధాని దేవెగౌడ ఉత్తరాఖండ్‌ కోసం చేసిన ప్రకటన

  • 1993లో తెలంగాణ విద్యార్థి వేదిక హైకోర్టులో నాన్‌లోకల్‌ సీట్ల భర్తీపై సాధించిన విజయం

  • హైదరాబాద్‌ నగరం పరాయీకరణ కావడంపై తెలంగాణ ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి

  • నక్సలైట్లపై తీవ్ర నిర్భందం.

  • అసెంబ్లీలో తెలంగాణ పదం వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేసిన స్పీకర్‌ యనమల వైఖరి

  • తెలుగు సినిమాలు, పుస్తకాల్లో తెలంగాణ భాష, యాస పట్ల

    అవహేళన

  • ఇ.వి.పద్మనాభం అనే తెలంగాణ జర్నలిస్టు తన పత్రిక ‘ఫ్లాష్‌ అండ్‌ ఫెల్లోమెన్‌’ ద్వారా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై ప్రజలను చైతన్యపర్చడం

  • తెలంగాణ రాజకీయవాదులకు అన్ని రాజకీయ పార్టీల్లో ప్రాతినిధ్యం కల్పించకపోవడం

మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉద్భవించిన సంస్థలు

తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ ట్రస్ట్‌

  • బసంత్‌ టాకీస్‌ సమావేశం మలిదశ తెలంగాణ ఉద్యమానికి ప్రేరణ కల్గించింది. 1989 జనవరిలో జరిగిన ఈ సమావేశానికి వెయ్యి మంది హాజరయ్యారు. ఇ.వి.పద్మనాభం, ప్రొఫెసర్‌ జయశంకర్‌, ప్రొఫెసర్‌ కేశవరావ్‌ జాదవ్‌, ప్రొఫెసర్‌ లక్ష్మణ్‌, ప్రొఫెసర్‌ హరినాథ్‌, తెలంగాణ ప్రభాకర్‌ మొదలైనవారు ఈ సమావేశంలో కీలక ఉపన్యాసం చేశారు.

  • ఫజల్‌ అలీ రిపోర్టును తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ ట్రస్ట్‌ తెలుగు, ఉర్దూభాషల్లో అనువదించి పంపిణీ చేసింది.

తెలంగాణ ఐక్య వేదిక

1997 సెప్టెంబరు 28న ఓయూ లైబ్రరీలో పోరాట సంస్థలన్నీ ఏకమయ్యాయి. తెలంగాణ ఐక్య వేదిక ఏర్పాటైంది.

  • ఈ తొలి కమిటీలో ప్రొఫెసర్‌ జయశంకర్‌, కేశవరావ్‌ జాదవ్‌, వి.ప్రకాశ్‌, బెల్లయ్యనాయక్‌, విజయప్రశాంత్‌, మురళీధర్‌రావు దేశ్‌పాండే, ప్రతాప్‌ కిశోర్‌, సంతపురి రఘువీరరావు ముఖ్యులు. ఈ ఐక్యవేదిక 1997 నవంబరు 1న విద్రోహ దినం పేరుతో భారీ ర్యాలీ నిర్వహించింది. నిజాం కాలేజీ నుంచి క్లాక్‌ టవర్‌ వరకు చేపట్టిన ఈ ర్యాలీలో మూడు వేల మంది పాల్గొన్నారు.

  • కొండ లక్ష్మణ్‌ బాపూజీ నివాస గృహమైన జలదృశ్యం ఐక్యవేదికకు కార్యాలయం. ఈ సంస్థ మొదట ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే పి.జనార్ధన్‌రెడ్డిని, మాజీ మంత్రి ఇంద్రా రెడ్డిని తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించాల్సిందిగా కోరింది. తరవాత కాలంలో కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమంలోకి రావడానికి ఈ సంస్థ కృషి చేసింది.

భువనగిరి సభ

ఫ 1997 మార్చి 8, 9 తేదీల్లో భువనగిరిలో రచయితలు, అధ్యాపకులు, జర్నలిస్టులు కలిసి ‘సాహితి మిత్రమండలి’ పేరుతో సభ నిర్వహించారు. ఈ సభావేదిక పేరు ‘దగా పడ్డ తెలంగాణ’.

  • ఈ సభలో కాళోజీ నారాయణరావు, ప్రొఫెసర్‌ జయశంకర్‌, కందూరి ఐలమ్మ, ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య, ప్రొఫెసర్‌ సింహాద్రి, ప్రొఫెసర్‌ విశ్వేశ్వరరావు మొదలైన వారు పాల్గొన్నారు.

  • ఈ సభలో బెల్లి లలిత గాయనిగా పరిచయం అయ్యింది.

  • ఈ సభ మూడు ప్రధానాంశాలపై చర్చించింది. అవి...తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన న్యాయమైన వాటా, ప్రత్యేక రాష్ట్ర అవసరం, ఉద్యమ నిర్మాణం.

సభ తీర్మానాలు: కరెంట్‌ కోతలను ఎత్తివేయాలి. ప్రవేశ పరీక్షలను ప్రాంతాల వారీగా నిర్వహించాలి. తెలంగాణ కోసం చేసిన ఒప్పందాలను అమలు చేయాలి. 1/70 చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేయాలి.

  • తెలంగాణ ఉద్యమాన్ని భవిష్యత్తులో ముందుకు నడిపించే అవకాశమున్న గద్దర్‌పై 1997 ఏప్రిల్‌ 6న హత్యా ప్రయత్నం జరిగింది.

  • మాజీ హోంమంత్రి ఇంద్రారెడ్డి 1997 సెప్టెంబరు 13, 14లో ‘జై తెలంగాణ పార్టీ’ని ఏర్పాటు చేశారు.

  • 1997 జూలై 12,13 తేదీల్లో జరిగిన సమావేశాల్లో రాపోలు ఆనంద భాస్కర్‌ ‘తెలంగాణ ప్రగతి వేదిక’ను ఏర్పాటు చేశారు.

తెలంగాణ జనసభ

1998 జూలై 5, 6 తేదీల్లో జరిగిన సమావేశాల్లో తెలంగాణ జనసభ ఏర్పడింది. ఈ సభ ద్వారానే తెలంగాణ ఉద్యమం గ్రామాల్లోకి విస్తరించింది. అనేక ప్రజా సమస్యలపై ఉద్యమాల కోసం పోరాటాలు నిర్వహించారు. అదేవిధంగా కాకతీయ కాలువ మరమ్మతుల కోసం, రైతు విముక్తి కోసం పోరాటాలు నిర్వహించారు.

  • 2000 సంవత్సరంలో వీరి ఆధ్వర్యంలో 500 గ్రామాల్లో ప్రజా చైతన్య యాత్రలు, పాద యాత్రలు నిర్వహించారు. తరవాత కాలంలో వీరిపై మావోయిస్టుల ప్రభావం ఉందనే అనుమానాలతో ప్రభుత్వం తీవ్ర నిర్భందాన్ని విధించింది. దీంతో ఈ సంస్థ కార్యక్రమాలు ఆగి పోయాయి.

  • 1998లో గాదె ఇన్నయ్య నేతృత్వంలో తెలంగాణ స్టడీ ఫోరం ఏర్పడింది.

తెలంగాణ మహాసభ

విద్యార్థి నాయకుడు మారోజు వీరన్న కృషి ఫలితంగా 1997 ఏప్రిల్‌లో సూర్యాపేటలో తెలంగాణవాదుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం తెలంగాణ మహాసభగా ఆవిర్భవించింది. ఈ క్రమంలో 1997 ఆగస్టు 11న సూర్యాపేటలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. దాదాపు 30 వేల మంది ప్రజలు హాజరయ్యారు. ఇది తెలంగాణ వాదుల్లో నూతన ఉత్తేజాన్ని కలుగజేసింది. ఈ సభ పేరు ‘ధోఖాతిన్న తెలంగాణ’.

  • సభలో వివిధ కుల వృత్తులను ప్రదర్శించారు. దీనికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్‌ జయశంకర్‌, ప్రొఫెసర్‌ బుర్రా రాములు, బెల్లయ్యనాయక్‌, జలసాధన సమితి అధ్యక్షుడు ముచ్చర్ల సత్యనారాయణ హాజరయ్యారు. ఈ మహాసభ అప్పటి పీడీఎ్‌సయూ రాష్ట్ర అధ్యక్షుడు మారోజు వీరన్న, డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ ఆధ్వర్యంలో జరిగింది.

సభ తీర్మానాలు: 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు చేయాలి. 1956-1997 వరకు జరిగిన ఖర్చులు - కేటాయింపులపై శ్వేతపత్రం విడుదల చేయాలి. పోలవరం ప్రాజెక్టును రద్దు చేయాలి. 1/70 చట్టాన్ని అమలు చేయాలి. ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు విడుదల చేయాలి. తెలంగాణ ఉద్యమానికి బహుజనుల నాయకత్వం కావాలి.

  • తెలంగాణ మహాసభ తరవాత కాలంలో అదే పేరుతో ఒక మాసపత్రికను నడిపింది. ఈ పత్రిక ఎడిటర్‌ వి.ప్రకాశ్‌.

వరంగల్‌ డిక్లరేషన్‌

  • అనేక ప్రజా సంఘాలు కలిసి 1997 డిసెంబరు 28న ‘అఖిల భారత ప్రజా ప్రతిఘటన వేదిక’ పేరుతో తొలి బహిరంగ సభను వరంగల్‌లో ఏర్పాటు చేశాయి. ఈ సభకు ప్రొఫెసర్‌ సాయిబాబా అధ్యక్షత వహించారు. రెండుల లక్షల మందికిపైగా ప్రజలు హాజరయ్యారు. సభలో 60 అంశాలపై తీర్మానం చేశారు.

మలిదశ తెలంగాణ ఉద్యమం 1980 దశకంలో మొదలైంది. తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించిన తెలుగు జాతి భావనకు వ్యతిరేకంగా ఉద్భవించింది.

ఈ ఉద్యమాన్ని ఆరంభించడంలో 1969 ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు కీలకమైన పాత్రను పోషించారు. వీరి తపనకు ఈ కింది అంశాలు తోడయ్యాయి.

rezza.jpg

-డాక్టర్‌ రియాజ్‌

సీనియర్‌ ఫ్యాకల్టీ, అకడమిక్‌ డైరెక్టర్‌,

5 మంత్ర కెరీర్‌ పాయింట్‌, హైదరాబాద్‌

Updated Date - 2023-04-14T11:43:41+05:30 IST