Dental care: ఆ భయంతో వెనకడుగు వేయొద్దు! సౌకర్యవంతమైన ట్రీట్‌మెంట్ వచ్చేసింది!

ABN , First Publish Date - 2023-07-25T13:24:16+05:30 IST

పంటి నొప్పి నరకాన్ని చూపిస్తే తప్ప డాక్టరును కలవం. చికిత్స సమయంలో కలిగే అసౌకర్యం, నొప్పిలకు భయపడి చికిత్సను వీలైనంత కాలం వాయిదా వేస్తూ ఉంటాం. ఇక దంతాల్లో అవకారాలుంటే, వాటిని దాచడం కోసం మనసారా నవ్వడానికి కూడా వెనకాడతాం! కానీ తాజాగా అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక దంత చికిత్సా విధానాలు

Dental care: ఆ భయంతో వెనకడుగు వేయొద్దు! సౌకర్యవంతమైన ట్రీట్‌మెంట్ వచ్చేసింది!

పంటి నొప్పి నరకాన్ని చూపిస్తే తప్ప డాక్టరును కలవం. చికిత్స సమయంలో కలిగే అసౌకర్యం, నొప్పిలకు భయపడి చికిత్సను వీలైనంత కాలం వాయిదా వేస్తూ ఉంటాం. ఇక దంతాల్లో అవకారాలుంటే, వాటిని దాచడం కోసం మనసారా నవ్వడానికి కూడా వెనకాడతాం! కానీ తాజాగా అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక దంత చికిత్సా విధానాలు, ఆర్టిఫిసియల్‌ ఇంటెలిజెన్స్‌లు దంత చికిత్సను సులభతరం, సౌకర్యవంతం, సౌందర్యవంతం చేశాయి అంటున్నారు వైద్యులు.

నిజానికి దంతాలు కూడా అకర్షణకు ప్రమాణాలే! మనసారా నవ్వాలన్నా, నోరారా తినాలన్నా దంతాలు దృఢంగా, ఆకర్షణీయంగా ఉండాలి. కానీ ఎత్తు పళ్లు, వంకర పళ్లు, పిప్పి పళ్లతో లోలోపలే మధనపడిపోతూ ఉంటాం! కాబట్టి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ఆ లోపాలను సరిదిద్దుకోవడానికి వెనకాడకూడదు.

డెంటల్‌ డిజిటలైజేషన్‌

సాధారణంగా పంటి నొప్పి చికిత్స ఎక్స్‌రేతో మొదలవుతుందనే విషయం మనందరికీ తెలిసిందే! నోట్లో పంటి వెనక ఫిల్మ్‌ను ఉంచి, ఎక్స్‌రే తీసే పద్ధతి అందరికీ అసౌకర్యంగానే ఉంటుంది. ఒక్కోసారి ఒకటికి రెండుసారు,్ల మూడు సార్లు ఎక్స్‌రే తీయవలసి వస్తుంది. అయినా ఫిల్మ్‌లో స్పష్టత లోపిస్తుంది. పైగా ఎక్కువ సమయం పాటు రేడియేషన్‌కు గురి కావలసి వస్తుంది. కానీ తాజా డిజిటలైజేషన్‌ విధానంలో (రేడియో విజియోగ్రఫీ) పోర్టబుల్‌ ఎక్స్‌రే మిషన్లను ఉపయోగిస్తున్నారు. చేత్తో పట్టుకోగలిగే వీలుండే వీటితో నోటిలోని ఏ దంతాన్నైనా సులువుగా, తక్కువ సమయంలో ఎక్స్‌రే తీయవచ్చు. కాబట్టి రేడియేషన్‌కు బహిర్గతమయ్యే సమయం కూడా బాగా తగ్గిపోయింది. స్ర్కీన్‌ మీద ఎన్‌లార్జ్‌ చేసి చూడగలిగే సౌలభ్యం వైద్యులకు దక్కుతోంది. ఇలా పూర్తి కంప్యూటరైజ్‌డ్‌ విధానం వల్ల డయాగ్నొసిస్‌ సులువైపోయింది. మరీ ముఖ్యంగా గర్భిణులకు ఈ విధానం ఎంతో సురక్షితమైనది.

అడ్డాన్స్‌డ్‌ లేజర్‌ టెక్నాలజీ

చిగుళ్ల సమస్యలు ఉన్నప్పుడు, ఆ ప్రాంతంలో కోత పెట్టి, శుభ్రం చేసి తిరిగి కుట్లు వేయడం చేసే వారు. దాంతో వాపు, నొప్పిలను కొంత కాలం పాటు భరించవలసి వచ్చేది. కానీ ఇప్పుడు లేజర్‌ చికిత్స అందుబాటులోకి వచ్చింది. ఈ చికిత్సలో రక్తస్రావం, నొప్పి తక్కువగా ఉంటాయి.

ఆర్టిఫిసియల్‌ ఇంటెలిజెన్స్‌

నోట్లో తెలుపు, ఎరుపు అల్సర్లు ఏర్పడుతూ ఉంటాయి. వీటిలో కొన్ని కేన్సర్‌గా పరిణామం చెందేవి కూడా ఉంటాయి. ఈ పుండ్లు కేన్సర్‌గా మారే అవకాశాన్ని కనిపెట్టడం కోసం పూర్వం బయాప్సీ తీసి పరీక్షించవలసి వచ్చేది. కానీ తాజా ఆర్టిఫిసియల్‌ ఇంటెలిజెన్స్‌ సాంకేతికతలో (వేలోస్కోప్‌) వెలుగును ప్రసరింపచేయడం ద్వారా, ఆ వెలుగులో అల్సర్లు ప్రతిఫలించే రంగు ఆధారంగా అవి కేన్సర్‌గా పరిణామం చెందే అవకాశాలనూ, అవి మెరుగ్గా స్పందించే చికిత్సలనూ ఆర్టిఫిసియల్‌ ఇంటెలిజన్స్‌ విశ్లేషించి, వైద్యులను గైడ్‌ చేస్తుంది.

గైడెడ్‌ ఇంప్లాంట్‌ సర్జరీ

ఎముకలో ఇంప్లాంట్‌ అమర్చేటప్పుడు దవడ ఎముక లోతు, పొడవు, వెడల్పు, ఇంప్లాంట్‌ అమరికల్లాంటి అంశాల్లో పూర్వం కొంత అయోమయం నెలకొని ఉండేది. తాజా గైడెడ్‌ ఇంప్లాంట్‌ సర్జరీల వల్ల సరైన పొజిషన్‌లో, నాడులకు తగినంత దూరంలో పొరపాటుకు ఏమాత్రం ఆస్కారం లేకుండా ఇంప్లాంట్‌ను అమర్చే వెసులుబాటు వైద్యులకు దక్కుతోంది. ఈ టెక్నాలజీతో దక్కే ఫలితాలు అటు వైద్యులకూ, ఇటు రోగులకూ సంతృప్తికరంగా ఉంటున్నాయి.

ELE.jpg

త్రీడి ప్రింటింగ్‌

కృత్రిమ దంతాలతో సంతృప్తి పడేవాళ్లను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. దంతాల నమూనా కోసం ఇప్పటివరకూ ట్రేలో తెల్లని పదార్థం నింపి, నోట్లో ఉంచి దంతాల ఇంప్రెషన్‌ తీసుకుని, కృత్రిమ దంతాలను తయారుచేసే పద్ధతినే అమలు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఈ పద్ధతిని ఉపయోగించిన తయారుచేసిన కృత్రిమ దంతాలు అమర్చేటప్పుడు, అవి పక్క దంతాలతో మ్యాచ్‌ అవకపోవడం, సక్రమంగా ఇమడకపోవడం, అందుకోసం పక్క దంతాలను అరగదీయడం లాంటి ఇబ్బందులు ఇంతకు ముందు ఉండేవి. కానీ త్రీడి పింటింగ్‌లో ఇలాంటి ఇబ్బందులేవీ ఉండవు. ఇంట్రా వోరల్‌ స్కానర్లు, సరిగ్గా ఇమిడిపోగలిగే పంటి క్యాప్‌ డిజిటల్‌ ఇమేజ్‌ను, క్షణాల్లో అందిస్తాయి. ఈ వివరాల ఆధారంగా నూరు శాతం కచ్చితత్వంతో కూడిన కృత్రిమ దంతాన్ని డిటిజల్‌ ప్రింటింగ్‌ చేస్తారు. ఈ సౌకర్యం వల్ల కృత్రిమ దంతాల తయారీలో పొరపాట్లకు ఆస్కారం ఉండదు. రెండు, మూడు గంటల్లోనే రూట్‌ కెనాల్‌, క్రౌన్‌ ఫిక్సింగ్‌ పూర్తయిపోతుంది.

ఎగుడు దిగుడు, ఎత్తు పళ్ల కోసం...

పూర్వం ఈ దంతాలను సరిచేయడం కోసం కొన్ని నెలల పాటు బ్రేసెస్‌ వాడుకోవలసి వచ్చేంది. కానీ ఇప్పుడు డిజిటల్‌ ఇంప్రెషన్‌ ద్వారా దంతాల వివరాలు సేకరించి, ఆర్టిఫిసియల్‌ ఇంటెలిజెన్స్‌కు అందిస్తే, అది ఆరు నెలల కాలంలో ఆ దంతాలను ఎలా సరిదిద్దవచ్చో, సరిదిద్దిన దంతాలు తర్వాత ఎలా ఉంటాయో విశ్లేషించి వైద్యులకు ఆ వివరాలను అందిస్తుంది. కాబట్టి ఎ.ఐ ద్వారా ఫలితాన్ని ముందుగానే చూడగలిగే అవకాశం దక్కుతుంది. అలాగే త్రీడి ప్రింటింగ్‌ ద్వారా పారదర్శకమైన అలైనర్లను తయారుచేసి, వాటిని 15 రోజులకోసారి మారుస్తూ, ఆరు నెలల్లో ఎగుడు దిగుడు లేదా ఎత్తు దంతాలను సరిదిద్దుకోవచ్చు.

కాస్మటిక్‌ స్మైల్‌ డిజైనింగ్‌

ముందు పళ్లు విరిగిపోవడం లేదా, ఫ్లోరోసిస్‌ వల్ల రంగు మారడం వల్ల దంతాల ఆకర్షణ తగ్గుతుంది. నవ్వినప్పుడు ఆ లోపాలు కనిపిస్తాయనే భావనతో నవ్విన ప్రతిసారీ చేతిని నోటికి అడ్డు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఫుల్‌ క్రౌన్‌ వెనీర్స్‌ సహాయంతో.. సైజ్‌, షేడ్‌, షేప్‌.... ఈ మూడు అంశాలు సంతృప్తికరంగా ఉండేలా వైద్యులు స్మైల్‌ డిజైనింగ్‌ చేయగలుగుతున్నారు. ముఖాకృతికి తగ్గట్టు సరైన పరిమాణంలోని దంతాలను డిజైన్‌ చేయగలగడం, డిజిటల్‌ స్మైల్‌ డిజైనింగ్‌లో ఉండే మరొక సౌలభ్యం.

THJ.jpg

వర్చువల్‌ రియాలిటీ

సర్జరీలో పొరపాట్లుకు ఏమాత్రం అవకాశం లేకుండా వైద్యులు సమర్థవంతంగా చికిత్స చేయడానికి వర్చువల్‌ రియాలిటీ తోడ్పడుతోంది. సర్జరీకి ముందు, రోగి డాటా ఆధారంగా వైద్య బృందం, లేదా వైద్య విద్యార్ధులు, వైద్యులు వర్చువల్‌/ఆగ్మెంటెడ్‌ సర్జరీని సాధన చేయడానికి ఈ సాంకేతికత తోడ్పడుతుంది. ఈ సౌలభ్యం భవిష్యత్తులో మున్ముందు అందుబాటులోకి రాబోతోంది.

నానో మెటీరియల్స్‌

పన్ను పుచ్చిపోయే మొదట్లో పంటి మీద నల్లని చుక్క ఏర్పడుతుంది. ఆ దశలో వైద్యులను కలిసినప్పుడు, కొంత కాలం ఆగిన తర్వాత రమ్మని చెప్పడం, లేదంటే పుచ్చిన ఆ భాగాన్ని పెద్దదిగా తొలిచి, దాన్లో సిమెంట్‌ నింపడం చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ చిన్న చుక్క ఏర్పడిన పుచ్చిన ప్రదేశాన్ని ఆ మేరకే తొలిచి, మరింత మన్నికైన, దృఢమైన నానో మెటీరియల్స్‌తో నింపే సదుపాయం అందుబాటులోకొచ్చింది.

dee.jpg

-డాక్టర్‌ సి. శరత్‌ బాబు

ప్రోస్థోడాంటిస్ట్‌- ఇంప్లాంటాలజిస్ట్‌,

మెడికవర్‌ హాస్పిటల్స్‌, హైదరాబాద్‌.

Updated Date - 2023-07-29T21:29:19+05:30 IST