Skin allergy: పెరుగుతున్న స్కిన్ ఎలర్జీ కేసులు.. ఈ జాగ్రత్తలు తీసుకోవాలంటున్న డాక్టర్లు!
ABN , First Publish Date - 2023-08-14T13:02:01+05:30 IST
గాలిలో తేమ తగ్గడం వంటి కారణాలతో చర్మం రక్షణ సన్నగిల్లుతూ.. స్కిన్ ఎలర్జీ కేసులు పెరుగుతున్నాయి. చర్మం తెల్లగా పొడిబారిపోవడం.. అరికాళ్లకు పగుళ్లు వంటివి ఈ కోవలోనివే. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చర్మ సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి.
ఫంగల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియానే కారణం
వైద్యుల వద్దకు రోజుకు 10-12 కేసులు
పరీక్ష చేస్తే డెంగీ నిర్ధారణ
స్టెరాయిడ్స్ క్రీమ్స్‌తో ముప్పు
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): గాలిలో తేమ తగ్గడం వంటి కారణాలతో చర్మం రక్షణ సన్నగిల్లుతూ.. స్కిన్ ఎలర్జీ కేసులు (Skin allergy) పెరుగుతున్నాయి. చర్మం తెల్లగా పొడిబారిపోవడం.. అరికాళ్లకు పగుళ్లు వంటివి ఈ కోవలోనివే. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చర్మ సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. ఒక్కో చర్మవ్యాధి నిపుణుడి వద్దకు స్కిన్ ఎలర్జీకి సంబంధించి రోజుకు 10-12 కేసులు వస్తున్నాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా, చర్మంపై సన్నటి ఎరుపురంగు కురుపులు, పాదాలకు ఇన్ఫెక్షన్ వంటి కారణాలతో నగరవాసులు స్కిన్ ఎలర్జీ బారిన పడుతున్నారు. ఇలా చర్మ సంబంధిత సమస్యలతో వచ్చేవారిని పరీక్షిస్తే.. డెంగీగా నిర్ధారణ అవుతోందని వైద్యులు చెబుతున్నారు.
స్టెరాయిడ్ క్రీమ్స్ వల్ల..
ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వారిలో చర్మ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్ బాధితులను ఎక్కువ కాలం వెంటాడుతుంటాయని చెబుతున్నారు. చాలామంది శరీరంపై దురద అనిపించగానే.. మెడికల్ షాపులకు వెళ్లి.. ఏవో మందులు తెచ్చుకుంటారు. వాటిని కొన్నాళ్లు వాడి, ఆపేస్తారు. ఆ తర్వాత సమస్య తగ్గకపోగా, మరింత పెరుగుతుందని వైద్యులు వివరించారు. బ్యాక్టీరియా సామర్థ్యం పెరగడమే ఇందుకు కారణమని చర్మవ్యాధి నిపుణులు డాక్టర్ సింధూర తెలిపారు. ఇది తగ్గడానికి కొందరికి 15 రోజులు, మరికొందరికి నెల, రెండు నెలల సమయం పడుతుందన్నారు. చాలా మంది బాధితులు తమకు తెలియకుండానే స్టెరాయిడ్స్ క్రీమ్స్ వినియోగించి ఇబ్బందుల పాలవుతున్నారని చెప్పారు. జిడ్డు చర్మంతో ఇబ్బందులు జిడ్డు చర్మం ఉన్నవారిలో వర్షాకాలం, చలికాలం ఈ ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ముఖంపై ఉండే జిడ్డును తొలగించడానికి బ్లాటింగ్ పేపర్‌ను ఎప్పుడూ వెంట ఉంచుకోవావాలని వైద్యులు సూచిస్తున్నారు. వర్షాకాలంలో చర్మాన్ని రక్షించడానికి ఉత్తమ మార్గం అన్ని నూనె ఆధారిత సీరమ్‌లు, హెవీ మాయిశ్చరైజర్‌లను నివారించాలని, ఎక్కువగా నీరు, జెల్ వంటి తేలికపాటి మాయిశ్చరైజర్లను వినియోగించడం వల్ల చర్మాన్ని తేమ లేకుండా ఉంచుతుంది, అదే సమయంలో చెమట, నూనెను తగ్గిస్తుందని చెప్పారు. విటమిన్ సీ సీరం వంటి వాటిని ఎలా, ఎప్పుడు ఉపయోగించాలో చర్మవ్యాధి నిపుణుల సలహా తీసుకోవాలని, ఇది ఒక శక్తిమంతమైన యాంటీ-ఆక్సిడెంట్‌గా పనిచేస్తుందని వివరిస్తున్నారు. ఇది రెటినోల్ కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. చర్మ రంధ్రాలను బిగుతుగా చేస్తుంది. ఇన్ఫెక్షన్, మంట, మొటిమల అవకాశాలను తగ్గిస్తుంది. వర్షాకాలంలో, తలలో సహజమైన తేమ, నూనె కంటెంట్ దెబ్బతింటుంది. ఇది చుండ్రు. శిలీంధ్రాల ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుంది, ఇది తలపై దురదను కలిగిస్తుందని, తలపై ముందుకు వెనుకకు గోకడం కదలికలు ఫోలికల్స్‌ను బలహీనపరుస్తాయని చెప్పారు. ఇది మంట పుట్టించి జుట్టు రాలడానికి దారితీస్తుందన్నారు. వారానికి రెండు మూడు సార్లు మంచి యాంటీ డాండ్రఫ్ షాంపూ ఉపయోగించాలని, ఐదు నుంచి పది నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు.
పరీక్ష చేస్తే డెంగీ
శరీరంపై దద్దుర్లు, దురుదలతో డాక్టర్ల వద్దకు వచ్చిన బాధితులకు పరీక్షలు చేస్తే.. డెంగీ తేలుతోంది. శరీరంపై ఎర్రగా ర్యాషెస్ రావడంతో మొదట వారు డెర్మాటాలజిస్టులను సంప్రందిస్తున్నారు. అక్కడ వారికి పలు రకాల పరీక్షలు చేసే సమయంలో డెంగీగా తేలుతోంది. దీంతో అటు వైరల్ ఇన్ఫెక్షన్, ఇటు ఫంగల్ ఇన్ఫెక్షన్ మందులను వినియోగించాల్సి ఉంటుందని వైద్యులు వివరించారు.
ఈ జాగ్రత్తలు పాటిస్తే..
రోడ్లపై ఉండే నీటిలో ఎక్కువగా నడవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశముంది.
వర్షపు నీటిలో చెప్పులు లేకుండా తిరగవద్దు. తడిసిన చెప్పులను శుభ్రంగా తుడిచి, వాడాలి.
ఇంటికి వచ్చిన తరువాత కడిగిన కాళ్లను పొడిబట్టతో శుభ్రంగా తుడవాలి.
ఈ సీజన్‌లో బహిరంగంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవద్దు.
వర్షంలో తడిసి, ఇంటికి వచ్చిన వాళ్లు వేడి నీటితో స్నానం చేయాలి. గోరువెచ్చని నీటిని తాగాలి. శానిటైజర్‌ను తప్పని సరిగా వినియోగించాలి. వేడి ఆహారం తీసుకోవాలి.
బలవర్థకమైన ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయాలు, పాలు, చపాతీలు ఎక్కువగా తీసుకోవాలి.
ఈగలు, దోమలు ముసిరే ప్రాంతాలను వెంటనే శుభ్రం చేసుకోవాలి.
నీటిలో క్లొరిన్‌బిళ్లలు వేసి, శుద్ధి చేయాలి.
జలుబు, దగ్గు, జ్వరం, నీరసం ఉంటే బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలి.