Israel-Palestine: ఇజ్రాయెల్‌పై దాడి ‘గర్వం’గా ఉందంటూ షాకిచ్చిన ఆ దేశం.. 200 దాటిన మృతుల సంఖ్య

ABN , First Publish Date - 2023-10-07T20:56:39+05:30 IST

శనివారం ఉదయం ఇజ్రాయెల్‌పై గాజా నుంచి హమాస్ (పాలస్తీనా ఉగ్రవాద సంస్థ) మెరుపుదాడి చేసిన విషయం తెలిసిందే. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే 5 వేల రాకెట్లను ప్రయోగించడంతో.. ఇజ్రాయెల్..

Israel-Palestine: ఇజ్రాయెల్‌పై దాడి ‘గర్వం’గా ఉందంటూ షాకిచ్చిన ఆ దేశం.. 200 దాటిన మృతుల సంఖ్య

శనివారం ఉదయం ఇజ్రాయెల్‌పై గాజా నుంచి హమాస్ (పాలస్తీనా ఉగ్రవాద సంస్థ) మెరుపుదాడి చేసిన విషయం తెలిసిందే. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే 5 వేల రాకెట్లను ప్రయోగించడంతో.. ఇజ్రాయెల్ అతలాకుతలమైంది. భారీ స్థాయిలో ఆస్తినష్టం, ప్రాణనష్టం జరిగింది. కేవలం రాకెట్లను ప్రయోగించడమే కాదు.. హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌లో చొరబడి, అక్కడి పౌరులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో ఇప్పటికే 200 మందికి పైగా మరణించినట్లు రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయి. అలాగే.. వందల సంఖ్యలో జనాలు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ నేపథ్యంలోనే ఈ ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. ఇప్పటికే దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ మాధ్యమంగా స్పందించారు. ఈ ఉగ్రదాడి వార్రత తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని.. ఈ క్లిష్ట సమయంలో ఇజ్రాయెల్‌కు భారత్ సంఘీభావంగా నిలుస్తుందని అన్నారు. యూకే ప్రధాని రిషి సునాక్‌తో పాటు ఫ్రాన్స్, అమెరికా దేశాలు సైతం ఈ దాడిని ఖండించాయి. అయితే.. ఇజ్రాయెల్‌కి శత్రు దేశమైన ఇరాన్ మాత్రం ఈ దాడికి మద్దతు తెలిపింది. ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన దాడిని చూసి గర్వంగా ఉందంటూ కుండబద్దలు కొట్టింది. దీనికి తాము మద్దతు తెలుపుతున్నామని చెప్పింది.


‘‘శనివారం ఇజ్రాయెల్‌పై హమాస్ ప్రారంభించిన ఆకస్మిక దాడికి మేము పూర్తి మద్దతు తెలుపుతున్నాం. ఇది నిజంగా గర్వించదగిన ఆపరేషన్. అల్-అక్సా ఫ్లడ్ ఒక గొప్ప ఆపరేషన్‌ని చేపట్టింది. ఈ ఆపరేషన్‌కి రెసిస్టంట్ ఫ్రంట్ కూడా పూర్తి మద్దతు తెలుపుతుందని మేము కోరుకుంటున్నాం’’ అంటూ రహీమ్ సఫానీ ఒక సమావేశంలో చెప్పారు. కాగా.. ఇరాన్‌, ఇజ్రాయెల్‌కు మధ్య ఎప్పటి నుంచో శత్రుత్వం ఉంది. అందుకే.. ఈ దాడి పట్ల ఇరాన్ సంతోషం వ్యక్తి చేసింది. తమ మద్దతు హమాస్‌కి తెలుపుతూ.. ఈ యుద్ధంలో పాలస్తీనా గెలవాలని బలంగా కోరుతోంది.

మరోవైపు.. తమపై మెరుపుదాడి చేయడంతో పాలస్తీనాపై ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించింది. తమ జోలికి వచ్చి పాలస్తీనా ఘోర తప్పిదం చేసిందని కూడా హెచ్చరించింది. ప్రస్తుతం తాము యుద్ధంలో ఉన్నామని.. హమాస్ క్రూరమైన మెరుపుదాడికి దిగిందని.. శత్రువులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తీవ్రంగా స్పందించారు. ఈ వార్‌లో తామే తప్పకుండా గెలిచి తీరుతామని కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2023-10-07T20:56:39+05:30 IST