South Africa Johannesburg: జోహన్స్‌బర్గ్‌లో విషాదం.. 63 మంది సజీవ దహనం..
ABN , First Publish Date - 2023-08-31T13:59:29+05:30 IST
దక్షిణాఫ్రికాలో అతి పెద్ద నగరమైన జోహన్స్‌బర్గ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. జోహన్స్‌బర్గ్‌లోని ఒక అతి పెద్ద రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 63 మంది సజీవ దహనం కావడం శోచనీయం. దాదాపు 40 మందికి పైగా గాయపడ్డారు.
దక్షిణాఫ్రికాలో అతి పెద్ద నగరమైన జోహన్స్‌బర్గ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. జోహన్స్‌బర్గ్‌లోని ఒక అతి పెద్ద రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 63 మంది సజీవ దహనం కావడం శోచనీయం. దాదాపు 40 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిసింది. ఈ అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. అగ్నిమాపక సిబ్బంది స్పాట్‌కు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
ఈ ఘటనపై సంబంధిత అధికారి రాబర్ట్ మాట్లాడుతూ.. ఆ బిల్డింగ్‌లో ఎలాంటి లీజ్ అగ్రిమెంట్స్ లేకుండా ఇల్లు లేని చాలా మంది ఉంటున్నారని, దీంతో ఎవరెవరు అక్కడ ఉంటున్నారో గుర్తించడం సవాల్‌గా మారిందని చెప్పారు. తన 20 ఏళ్ల సర్వీస్‌లో ఇంత ఘోర అగ్ని ప్రమాదాన్ని చూడలేదన్నారు. ఈ బిల్డింగ్‌లో దాదాపు 200 మందికి పైగానే నివాసం ఉంటున్నట్లు సమాచారం. చనిపోయిన వారిలో ఏడుగురు చిన్నారులు కూడా ఉన్నట్లు తెలిసింది. అత్యంత విషాదం ఏంటంటే.. ఒక సంవత్సరం వయసున్న పిల్లాడు కూడా మంటల్లో సజీవ దహనమైనట్లు దక్షిణాఫ్రికా మీడియా పేర్కొంది.
జోహన్స్‌బర్గ్ నగరానికే హృదయం లాంటి సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో ఈ ఘటన జరిగింది. అర్ధరాత్రి ఒంటి గంటకు ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో ఇలాంటి ఊరూపేరూ లేని బిల్డింగ్స్ చాలానే ఉన్నాయని, వాటిని సిటీ అధికార యంత్రాంగం ‘హైజాక్డ్ బిల్డింగ్స్’గా భావించి వదిలేస్తుందని స్థానిక మీడియా తెలిపింది. చలికి తట్టుకోలేక ఆ బిల్డింగ్‌లో ఎవరో ఒకరు మంట వేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.