Share News

Barack Obama: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకి వార్నింగ్ ఇచ్చిన ఒబామా.. ఆ చర్యలు బెడిసికొట్టొచ్చు

ABN , First Publish Date - 2023-10-24T20:17:48+05:30 IST

ఇజ్రాయెల్, హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) మధ్య యుద్ధం జరుగుతున్న వేళ.. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తాజాగా ఇజ్రాయెల్‌కు ఓ హెచ్చరిక జారీ చేశారు. ఈ పోరులో హమాస్‌ని పూర్తిగా నాశనం చేయాలన్న...

Barack Obama: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకి వార్నింగ్ ఇచ్చిన ఒబామా.. ఆ చర్యలు బెడిసికొట్టొచ్చు

ఇజ్రాయెల్, హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) మధ్య యుద్ధం జరుగుతున్న వేళ.. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తాజాగా ఇజ్రాయెల్‌కు ఓ హెచ్చరిక జారీ చేశారు. ఈ పోరులో హమాస్‌ని పూర్తిగా నాశనం చేయాలన్న లక్ష్యంతో గాజాలో ఇజ్రాయెల్ తీసుకుంటున్న చర్యలు.. చివరికి ఆ దేశానికే బెడిసికొట్టే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ యుద్ధంలో గాజా పౌరుల మానవతా కోణాన్ని ఇజ్రాయెల్ విస్మరిస్తే.. దాని పర్యవసానాల్ని చవిచూడాల్సి రావొచ్చని అభిప్రాయపడ్డారు. గాజాపై ఇజ్రాయెల్ ఇలాగే తన దాడుల్ని కొనసాగిస్తే.. ప్రపంచస్థాయిలో దాని మద్దతు బలహీనపడే ప్రమాదం ఉందని సూచించారు. అప్పుడు శత్రు దేశాలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడే ఛాన్స్ ఉందని తెలిపారు. ఆహారం, నీరు, విద్యుత్, ఇంధనం సరఫరాలపై నిషేధం విధించి గాజాను దిగ్బంధించడం.. పాలస్తీనీయుల ఆగ్రహాన్ని మరింత పెంచవచ్చని పేర్కొన్నారు.


‘‘గాజాలో పౌరులకు ఆహారం, నీరు, విద్యుత్తును నిలిపివేయాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. మానవతా సంక్షోభాన్ని దిగజార్చుతుంది. అంతేకాదు.. భవిష్యత్తు తరాలకు చెందిన పాలస్తీనా పౌరుల ఆగ్రహాన్ని మరింత పెంచుతుంది. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న ఈ దాడి.. ఆ ప్రాంతంలో (గాజా, ఇజ్రాయెల్ మధ్య వివాదం) శాంతి, స్థిరత్వం సాధించేందుకు ఇజ్రాయెల్ చేస్తున్న దీర్ఘకాలిక ప్రయత్నాలను బలహీనపరుస్తుంది. యుద్ధం ఎల్లప్పుడూ విషాదకరమైనది. సైనిక కార్యకలాపాలను ఎంత ప్రణాళికాబద్ధంగా లేదా జాగ్రత్తగా నిర్వహించినా.. అది పౌరులను ప్రమాదంలో పడేస్తాయి’’ అని ఒబామా చెప్పుకొచ్చారు. అయితే.. హమాస్ దాడుల్ని ఆయన ఖండించారు. అలాగే.. తనని తాను రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందంటూ ఆ దేశానికి తన మద్దతు తెలిపారు. కానీ.. ఇజ్రాయెల్ చేసే దాడుల్లో పౌర ప్రాణనష్టంపై హెచ్చరించారు. ప్రాణాలు పోకుండా చర్యలు తీసుకుంటే మంచిదని సలహా ఇచ్చారు.

ఇదిలావుండగా.. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ ఇజ్రాయెల్, హమాస్ మధ్య విభేదాలు తలెత్తాయి. అప్పుడు ఆయన మొదట్లో ఇజ్రాయెల్‌కు మద్దతు తెలిపినా.. పాలస్తీనీయుల ప్రాణనష్టం పెరగడంతో సంయమనం పాటించాలని ఆ దేశానికి సూచించారు. ఇరు వర్గాల మధ్య శాంతి ఒప్పందం కుదిర్చే ప్రయత్నం కూడా చేశారు కానీ విఫలమయ్యారు. అదే టైంలో ఇరాన్‌తో అణు ఒప్పందంపై చర్చలు జరపడంతో.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఒబామా సంబంధాలు కాస్త దెబ్బతిన్నాయి. అప్పుడు అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న బైడెన్.. ఒబామా, నెతన్యాహు మధ్య నెలకొన్న ఆ విభేదాల్ని తొలగించడంలో సక్సెస్‌ఫుల్ అయ్యారు.

Updated Date - 2023-10-24T20:17:48+05:30 IST