Israel-Hamas War: ఆ సమయంలో మీరంతా ఎక్కడున్నారు.. వారిని కడిగిపారేసిన ఇజ్రాయెల్ ప్రధాని
ABN , First Publish Date - 2023-12-06T20:15:10+05:30 IST
అక్టోబర్ 7వ తేదీన హమాస్ చేసిన ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాలో విస్తృత స్థాయిలో దాడులు నిర్వహిస్తోంది. వైమానిక దాడులతో పాటు గ్రౌండ్ ఆపరేసన్స్ నిర్వహిస్తోంది. అయితే.. ఈ దాడుల కారణంగా గాజాలోని అమాయక ప్రజలు ప్రాణాలు..
Benjamin Netanyahu On Hamas War: అక్టోబర్ 7వ తేదీన హమాస్ చేసిన ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాలో విస్తృత స్థాయిలో దాడులు నిర్వహిస్తోంది. వైమానిక దాడులతో పాటు గ్రౌండ్ ఆపరేసన్స్ నిర్వహిస్తోంది. అయితే.. ఈ దాడుల కారణంగా గాజాలోని అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా.. మహిళలు, చిన్న పిల్లలు మృత్యువాత పడుతున్నారు. దీంతో.. ఇజ్రాయెల్ దాడుల్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవ, మహిళా హక్కుల సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ దాడుల్ని తక్షణమే ఆపాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ఆయా సంస్థలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇజ్రాయెల్ మహిళలపై హమాస్ ఉగ్రవాదులు ఆత్యాచారాలకు పాల్పడినప్పుడు మీరంతా ఎక్కడున్నారని కడిగిపారేశారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక వీడియోని విడుదల చేశారు.
ఆ వీడియోలో బెంజిమన్ నెతన్యాహు మాట్లాడుతూ.. ‘‘మహిళా, మానవ హక్కుల సంఘాలకు నేను ఒక్కటే చెప్పదలచుకున్నా. హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ మహిళలపై అత్యాచారాలకు పాల్పడినప్పుడు.. వారిపై భౌతిక దాడులు జరిపినప్పుడు మీరంతా ఎక్కడున్నారు? ఆ ఘటనలపై మీరెందుకు మాట్లాడలేదు? ప్రపంచ దేశాల నాయకులు, ప్రభుత్వాలు ఈ దారుణాలకు వ్యతిరేకంగా గళమెత్తారు. శారీరక వేధింపులతో ఇజ్రాయెల్ మహిళలు చేసిన ఆక్రందనల గురించి.. తల్లిదండ్రులను కోల్పోయి భయంతో బతుకున్న చిన్నారుల గురించి ఏ హక్కుల సంస్థలూ మాట్లాడలేదు. కానీ.. ఇప్పుడేమో గాజాపై ఇజ్రాయెల్ దారుణాలకు పాల్పడుతోందని, యుద్ధాన్ని త్వరగా ముగించాలని సూచిస్తున్నారు. మీరు యుద్ధం ముగిసిపోవాలని నిజంగా కోరుకుంటే.. ఇజ్రాయెల్ పక్షాన నిలవండి. హమాస్‌ను అణచివేయడమే ఈ యుద్ధాన్ని ముగించేందుకు ఏకైక మార్గం’’ అని చెప్పుకొచ్చారు. అంటే.. హమాస్‌ని నాశనం చేసేదాకా తగ్గేదే లేదని నెతన్యాహు చెప్పకనే చెప్పేశారు.
ఇదిలావుండగా.. గాజాలో మానవతా సహాయం అందించేందుకు, బందీలను విడుదల చేసేందుకు గాను ఇటీవల హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరింది. తొలుత నాలుగు రోజులపాటే ఈ ఒప్పందం కుదరగా.. ఆ తర్వాత మరో మూడు రోజులు పొడిగించారు. అయితే.. డీల్ ముగిశాక హమాస్ తమపై దాడులు చేసిందని ఆరోపణలు చేస్తూ ఇజ్రాయెల్ తన దాడుల్ని తీవ్రతరం చేసింది. ఇరువర్గాలు మరోసారి బాంబుల వర్షం కురిపించుకుంటున్నాయి. దీంతో.. ఇజ్రాయెల్, హమాస్ మధ్య దీర్ఘకాల కాల్పుల విరమణ కోసం అమెరికా, ఖతార్, ఈజిప్టు చర్చలు జరుపుతున్నాయి. అటు.. హమాస్ సైతం శాశ్వత కాల్పుల విరమణకు అంగీకరిస్తేనే మిగిలిన బందీలను విడుదల చేస్తామని నిబంధన పెట్టింది. మరి.. ఈ చర్చలు ఎలా సాగుతాయో చూడాలి.