Share News

Benjamin Netanyahu: హమాస్‌తో యుద్ధంపై ఇజ్రాయెల్ ప్రధాని సంచలన ప్రకటన.. పెద్ద బాంబే పేల్చాడుగా!

ABN , Publish Date - Dec 31 , 2023 | 07:20 PM

ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల కారణంగా గాజాలో అమాయక ప్రజలు చనిపోతున్న తరుణంలో కాల్పుల విరమణకు పిలుపునివ్వాలని డిమాండ్లు వస్తున్నా.. ఇజ్రాయెల్ మాత్రం తగ్గడం లేదు. హమాస్‌ని అంతం చేయాలన్న లక్ష్యంతో వైమానిక దాడులు...

Benjamin Netanyahu: హమాస్‌తో యుద్ధంపై ఇజ్రాయెల్ ప్రధాని సంచలన ప్రకటన.. పెద్ద బాంబే పేల్చాడుగా!

Benjamin Netanyahu Warns Iran: ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల కారణంగా గాజాలో అమాయక ప్రజలు చనిపోతున్న తరుణంలో కాల్పుల విరమణకు పిలుపునివ్వాలని డిమాండ్లు వస్తున్నా.. ఇజ్రాయెల్ మాత్రం తగ్గడం లేదు. హమాస్‌ని అంతం చేయాలన్న లక్ష్యంతో వైమానిక దాడులు, గ్రౌండ్ ఆపరేషన్స్‌తో దూసుకుపోతోంది. ఇలాంటి తరుణంలో తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ఒక సంచలన ప్రకటన చేశారు. ఈ యుద్ధం ఇప్పుడప్పుడే ఆగదని, కొన్ని నెలలపాటు కొనసాగుతూనే ఉంటుందని కుండబద్దలు కొట్టారు. అంతేకాదు.. గాజా స్ట్రిప్, ఈజిప్ట్ మధ్య ఉన్న సరిహద్దు ప్రాంతం ఇజ్రాయెల్ నియంత్రణలోనే ఉండాలని ఆయన చెప్పారు.


‘‘ఫిలడెల్ఫీ కారిడార్, ఇంకా సరిగ్గా చెప్పాలంటే.. గాజాకు చెందిన దక్షిణాది స్టాపేజ్ పాయింట్ ఇజ్రాయెల్ చేతుల్లో ఉండాలి. అది పూర్తిగా మూసివేయబడాలి. గాజా స్ట్రిప్‌తో పాటు ఇతర ప్రాంతీయ సరిహద్దుల్లో ఈ యుద్ధం ఇంకా కొన్ని నెలలపాటు సాగే అవకాశం ఉంది’’ అని బెంజిమన్ నెతన్యాహు చెప్పారు. హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం 13వ వారంలోకి అడుగుపెట్టిన తరుణంలో.. ఓ మీడియా సమావేశంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. ఈ యుద్ధం తారాస్థాయికి చేరుకుందని, తాము అన్ని విధాలుగా పోరాడుతున్నామని ఆయన చెప్పారు. ఈ యుద్ధంలో విజయం సాధించేందుకు తమకు మరింత సమయం కావాలన్నారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ చెప్పినట్లు.. ఈ యుద్ధం కొన్ని నెలలు సాగుతుందని పేర్కొన్నారు.

ఇదే సమయంలో బెంజిమన్ నెతన్యాహు ప్రత్యక్షంగా ఇరాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ ఈ యుద్ధాన్ని హిజ్బుల్లా మరింత విస్తరింపజేస్తే, అది కలలో కూడా ఊహించని దెబ్బలను ఎదుర్కుంటుందని, ఇరాన్‌ని సైతం విడిచిపెట్టమని హెచ్చరించారు. హమాస్‌కి మద్దతుగా లెబనాన్‌లోని ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా ఇజ్రాయెల్‌పై బార్డర్‌లో దాడులు చేస్తున్న నేపథ్యంలో.. బెంజిమన్ ఈ వార్నింగ్ ఇచ్చారు. కాగా.. హిజ్బుల్లా, హమాస్‌కి ఇరాన్ ముందు నుంచే మద్దతు ఇస్తోంది. ఈ రెండు సంస్థలు చేస్తున్న దాడుల వెనుక ఇరాన్ ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Dec 31 , 2023 | 07:20 PM