Share News

Benjamin Netanyahu: హమాస్‌ను నాశనం చేసేదాకా ఇజ్రాయెల్ ఆగదు.. పుతిన్‌తో ఫోన్ కాల్‌లో చెప్పిన బెంజిమన్

ABN , First Publish Date - 2023-10-17T18:22:15+05:30 IST

హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) తమపై మెరుపుదాడులు చేసిన రోజే ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ఒక శపథం చేశారు. తమపై దాడి చేసిన శత్రు మూకలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని..

Benjamin Netanyahu: హమాస్‌ను నాశనం చేసేదాకా ఇజ్రాయెల్ ఆగదు.. పుతిన్‌తో ఫోన్ కాల్‌లో చెప్పిన బెంజిమన్

హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) తమపై మెరుపుదాడులు చేసిన రోజే ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ఒక శపథం చేశారు. తమపై దాడి చేసిన శత్రు మూకలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని.. ప్రస్తుతం తాము యుద్ధంలో ఉన్నామని.. హమాస్‌ని పూర్తిగా సర్వనాశనం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఇప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తోనూ ఆయన అదే మాట చెప్పారు. హమాస్‌ని శాశ్వతంగా నిర్మూలించడమే తమ లక్ష్యంగా ఆయన పేర్కొన్నారు.

మంగళవారం పుతిన్‌తో ఫోన్ కాల్‌లో మాట్లాడిన ఆయన.. హమాస్‌ని పూర్తిగా అంతమొందించేదాకా ఇజ్రాయెల్ వెనకడుగు వేయదని ఖరాఖండీగా తేల్చి చెప్పేశారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ట్విటర్ మాధ్యమంగా ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘ఇజ్రాయెల్‌పై క్రూరమైన, అసహస్యకరమైన హంతకులు దాడి చేశారు. దీంతో హమాస్‌తో ఇజ్రాయెల్ యుద్ధానికి దిగింది. హమాస్ సైనిక, పాలక సామర్థ్యాలను పూర్తిగా సర్వనాశనం చేసే వరకు ఇజ్రాయెల్ ఆగదని ప్రధాని బెంజిమన్ స్పష్టం చేశారు’’ అంటూ ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. హమాస్‌ను నిర్మూలించే వరకు ఇజ్రాయెల్ బలగాలు వెనకడుగు వేయరని పుతిన్‌కి నెతన్యాహు చెప్పినట్టు ఆ ట్వీట్‌లో స్పష్టం చేసింది.


అటు.. రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఈ ఫోన్ కాల్‌కి సంబంధించిన వివరాలను పంచుకుంది. బెంజిమన్‌తో పుతిన్ ఫోన్‌లో మాట్లాడారని, గాజా స్ట్రిప్‌లో రక్తపాతం మరింత పెరగకుండా రష్యా తీసుకుంటున్న చర్యలను హైలైట్ చేశారని తెలిపింది. ప్రస్తుత సంక్షోభం మీదే ఆ ఇద్దరి మధ్య సంభాషణ సాగినట్టు పేర్కొంది. పాలస్తీనా, ఈజిప్ట్, ఇరాన్, సిరియా నాయకులతోనూ ఫోన్‌లో మాట్లాడటం జరిగిందని.. ముఖ్యమైన విషయాలపై ఇజ్రాయెల్‌తో చర్చించడం జరిగిందని రష్యా వెల్లడించింది. ఇజ్రాయెల్‌లో మరణించిన వారికి పుతిన్ సానుభూతి వ్యక్తం చేశారని.. హింస మరింత పెరగకుండా సమస్యను పరిష్కరించే దిశగా రష్యా చర్యలు తీసుకుంటున్నట్టు బెంజిమన్‌కి తెలిపారని రష్యా వివరించింది.

అంతేకాదు.. రాజకీయ, దౌత్య మార్గాల ద్వారా ప్రస్తుత సంక్షోభానికి శాంతియుత పరిష్కారాన్ని సాధించాలన్న లక్ష్యాన్ని నెతన్యాహుకు పుతిన్ వివరించినట్టు రష్యా ఒక ప్రకటనలో తెలిపింది. గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ సైన్యం గ్రౌండ్ ఆపరేషన్స్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్న తరుణంలో.. బెంజిమన్‌తో పుతిన్ ఇలా ఫోన్‌లో సంభాషించారు. ఈ గ్రౌండ్ ఆపరేషన్స్ వల్ల గాజా స్ట్రిప్‌ మొత్తం రక్తంతో తడిసి ముద్దవుతుందని.. అలా జరగకుండా ఉండేందుకు తగిన పరిష్కార మార్గాలను అన్వేషిస్తామని ఇదివరకే పుతిన్ తెలిపారు. కానీ.. ఇజ్రాయెల్ మాత్రం హమాస్‌ని నామరూపాల్లేకుండా నాశనం చేయాలన్న లక్ష్యంతోనే దూసుకుపోతోంది.

Updated Date - 2023-10-17T18:22:44+05:30 IST