Afghanistan Blast: ఆప్ఘన్‌లో ఆత్మాహతి దాడి, ఆరుగురు మృతి

ABN , First Publish Date - 2023-03-27T17:23:03+05:30 IST

ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో సోమవారంనాడు ఆత్మాహుతి దాడి..

Afghanistan Blast: ఆప్ఘన్‌లో ఆత్మాహతి దాడి, ఆరుగురు మృతి

కాబూల్: ఆప్ఘనిస్థాన్ (Afghanistan) రాజధాని కాబూల్ (Kabul)లో సోమవారంనాడు ఆత్మాహుతి దాడి (Suicide attack) జరిగింది. భారీ పేలుడు సంభవించి సుమారు ఆరుగురు పౌరులు దుర్మరణం పాలయ్యారు, పలువురు గాయపడ్డారు. ఆప్ఘన్ విదేశాంగ కార్యాలయానికి సమీపంలో సెక్యూరిటీ చెక్‌పాయింట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. రంజాన్ పవిత్ర మాసం కావడంతో ప్రభుత్వ ఉద్యోగులు త్వరగా విధులు పూర్తి చేసుకుని బయటపడుతున్న తరుణంలో, జనంతో రద్దీగా ఉంటే లంచ్ సమయంలో ఈ ఆత్మాహుతి దాడి చోటుచేసుకున్నట్టు చెబుతున్నారు.

ఆత్మాహుతి బాంబర్ తన లక్ష్యం వైపు దూసుకువెళ్లుండగా మాలిక్ అష్ఘుర్ స్క్వేర్ వద్ద అతన్ని కాల్చిచంపామని, ఇదే సమయంలో అతను తనను తాను పేల్చేసుకున్నాడని కాబూల్ పోలీస్ ప్రతినిధి ఖలిద్ జడ్రాన్ తెలిపారు. ఈ పేలుడులో ముగ్గురు తాలిబన్ భద్రతా సిబ్బందితో సహా పలువురు గాయపడినట్టు చెప్పారు. అయితే, ఆత్మాహుతి బాంబర్ టార్గెట్ ఏమిటనేది ఆయన వెల్లడించలేదు. చెక్‌పాయింట్ సమీపంలో విదేశాంగ శాఖ కార్యాలయంతో పాటు పలు ప్రభుత్వ భవంతులు ఉన్నాయి. దీంతో విదేశాంగ కార్యాలయమే ఆత్మాహుతి బాంబర్ టార్గెట్ కావచ్చని భద్రతా సిబ్బంది అనుమానిస్తున్నారు. రెండు మృతదేహాలతో పాటు క్షతగ్రాతులను సమీపంలో ఇటాలియన్ ఎన్జీఏ ఎమర్జెన్సీ ఆసుపత్రికి తరలించారు.

కాగా, ఈ పేలుడుకు తామే బాధ్యులమని ఏ ఉగ్రవాద సంస్థ ఇంతవరకూ ప్రకటించ లేదు. అయితే ఇటీవల కాలంలో వరుస దాడులకు తెగబడుతున్న ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లే ఈ ఆత్మాహుతి దాడికి కారణమని తాలిబన్ సర్కార్ అనుమానిస్తోంది. గత జనవరిలో జరిగిన పేలుడులో ఐదుగురు దుర్మరణంపాలు కాగా, అప్పుడే విధులు పూర్తి చేసుకుని బయటకు వస్తున్న విదేశాంగ కార్యాలయ సిబ్బంది పలువురు గాయపడ్డారు.

Updated Date - 2023-03-27T17:23:03+05:30 IST