Share News

Chinese Millionaire: ఇదెక్కడి ప్రతీకారంరా మావా.. మాస్క్ వేసుకోమని చెప్పినందుకు ఆ పని చేయించిన మిలియనీర్

ABN , First Publish Date - 2023-10-28T21:36:37+05:30 IST

అవును.. గతంతో పోలిస్తే కొవిడ్ ప్రభావం చాలా తగ్గిపోయింది కానీ, పరిస్థితులు ఇంకా పూర్తిస్థాయిలో చక్కబడలేదు. కొన్ని చోట్ల ఈ వైరస్ ఇంకా కోరలు చాచుతూనే ఉంది. రకరకాల వేరియెంట్‌ల రూపంలో ప్రజల ప్రాణాల్ని..

Chinese Millionaire: ఇదెక్కడి ప్రతీకారంరా మావా.. మాస్క్ వేసుకోమని చెప్పినందుకు ఆ పని చేయించిన మిలియనీర్

అవును.. గతంతో పోలిస్తే కొవిడ్ ప్రభావం చాలా తగ్గిపోయింది కానీ, పరిస్థితులు ఇంకా పూర్తిస్థాయిలో చక్కబడలేదు. కొన్ని చోట్ల ఈ వైరస్ ఇంకా కోరలు చాచుతూనే ఉంది. రకరకాల వేరియెంట్‌ల రూపంలో ప్రజల ప్రాణాల్ని బలి తీసుకుంటోంది. చైనాలోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది. అక్కడ కరోనా వైరస్ భయం ఇంకా తగ్గలేదు. చాలా ప్రాంతాలు ఈ వైరస్ ప్రభావానికి గురవుతూనే ఉన్నాయి. అందుకే.. అక్కడ ఇప్పటికీ కరోనా నిబంధనలు పాటిస్తున్నారు. ముఖ్యంగా.. మాస్క్ ధరించడం అక్కడ అనివార్యం. ఒకవేళ ఎవరైనా మాస్క్ వేసుకోకపోతే.. మర్యాదపూర్వకంగానే మాస్క్ వేసుకోమని సూచిస్తారు. ఇలా ఓ మిలియనీర్‌కి సూచించిన పాపానికి.. అతడు ఓ బ్యాంక్ సిబ్బందిపై కనీవినీ ఎరుగని ప్రతీకారం తీర్చుకున్నాడు. పదండి.. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.


చైనా మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. సన్‌వేర్ అనే ఒక మిలియనీర్ ఓ పని నిమిత్తం బ్యాంక్ ఆఫ్ షాంఘై బ్రాంచ్‌కి వెళ్లాడు. అయితే.. అతడు మాస్క్ వేసుకోకుండానే రావడంతో, భద్రతా సిబ్బంది అతడ్ని అడ్డుకుంది. ప్రోటోకాల్ ప్రకారం.. మాస్క్ ధరించమని భద్రతా సిబ్బంది అతడ్ని కోరింది. సన్‌వేర్ ఓ మిలియనీర్ కావడంతో కాస్త అహంకారం ప్రదర్శించాడు. ఈ క్రమంలోనే అతనికి, ఆ బ్యాంక్ భద్రతా సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన సన్‌వేర్.. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంకేముంది.. ఐదు మిలియన్ల రెన్మిన్‌బీ (2021 మారకపు రేటు ప్రకారం $7,83,000)ను విత్ డ్రా చేశాడు. ఆ డబ్బులన్నింటిని బ్యాంక్ సిబ్బంది చేత ఒక్కో నోటు చొప్పున ‘చేతితో‘ లెక్కించాడు. ఇలా లెక్కించినందుకు గాను సిబ్బందికి రెండు గంటలకు పైగా సమయం పట్టింది. అనంతరం వాళ్లు డబ్బులను సూట్‌కేసులో పెట్టగా, అవి తీసుకొని సన్‌వేర్ అక్కడి నుంచి తాపీగా వెళ్లిపోయాడు.

ఈ ఘటనపై సదరు బ్యాంక్ స్పందిస్తూ.. సన్‌వేర్ ‘కొవిడ్’ ప్రోటోకాల్‌ని పాటించలేదని పేర్కొంది. మాస్క్ ధరించమని తమ భద్రతా సిబ్బంది చెప్పినందుకు అతడు వాగ్వాదానికి దిగాడని పేర్కొంది. కానీ.. సన్‌వేర్ మాత్రం ఆ బ్యాంక్ వాదనల్ని ఖండించాడు. తాను మాస్క్ తీసుకెళ్లడం మర్చిపోయానని, ఏదైనా మాస్క్ ఉంటే ఇవ్వమని భద్రతా సిబ్బందిని అడిగానని చెప్పాడు. తాను ఇప్పటికీ కొవిడ్-19 నిబంధనలకు కట్టుబడి ఉన్నానని, మాస్క్ ధరించడానికి తాను నిరాకరించలేదని పేర్కొన్నాడు. కాగా.. బ్యాంక్ నుంచి డబ్బులతో నిండిన సూట్‌కేసులను పట్టుకొని సన్‌వేర్ నడుచుకుంటూ వెళ్లే దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Updated Date - 2023-10-28T21:36:37+05:30 IST