China Earthquake: చైనాలో భారీ భూకంపం.. భవనాలు నేలమట్టం.. భయంతో పరుగులు తీసిన జనం
ABN , First Publish Date - 2023-08-06T18:21:29+05:30 IST
చైనాలో భారీ భూకంపం సంభవించింది. ఆదివారం అర్థరాత్రి 2:33 గంటల సమయంలో 5.5 తీవ్రతతో భూమి కంపించింది. ఈ దెబ్బకు భారీ విధ్వంసం జరిగింది. డజన్లకొద్దీ భవనాలు నేలమట్టం అయ్యాయి. పదుల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు.
చైనాలో భారీ భూకంపం సంభవించింది. ఆదివారం అర్థరాత్రి 2:33 గంటల సమయంలో 5.5 తీవ్రతతో భూమి కంపించింది. ఈ దెబ్బకు భారీ విధ్వంసం జరిగింది. డజన్లకొద్దీ భవనాలు నేలమట్టం అయ్యాయి. పదుల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు. షాండాంగ్ ప్రావిన్స్‌లోని డెజౌ నగరానికి 26 కీలోమీటర్ల దూరంలో.. 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం వచ్చినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ దశాబ్దంలో ఈ ప్రావిన్స్‌లో సంభవించిన ఇదే అతిపెద్ద భూంకపమని తేలింది. ఈ భూకంపానికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ఈ భూకంపం ధాటికి భవనాలు, సరిహద్దు గోడలు కుప్పకూలిపోవడంతో.. రోడ్లపై శిథిలాలు చెల్లాచెదురుగా పడ్డాయి. అటు.. ప్రజలు భయంతో పరుగులు తీయడంతో, ప్రాణనష్టం ఎక్కువగా జరగలేదు. శిథిలాల కింద కొందరు చిక్కుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సహాయక బృందాలు అక్కడికి చేరుకొని, సహాయ చర్యలు చేపట్టాయి. అలాగే.. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించారు. మరోవైపు.. భూకంప తీవ్రతను చూసి రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రహదారిపై కూడా తీవ్ర ప్రభావం పడింది. కొన్ని ప్రాంతాల్లో పైప్‌లైన్లు దెబ్బతినడంతో.. గ్యాస్ సరఫరా నిలిచింది. భూకంప కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల దిగువన ఉంది.
ఈ భూకంపం నేపథ్యంలోనే.. చైనా ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ మినిస్ట్రీ ‘లెవెల్-ఫోర్’ ఎమర్జెన్సీని ప్రకటించింది. సహాయక పనుల కోసం షాండాంగ్ ప్రావిన్స్‌కు ఒక ప్రత్యేక బృందాన్ని పంపించింది. జనావాసాలు లేని పాత భవనాలు మాత్రమే కుప్పకూలినట్టు తేలింది. అయితే.. భూకంపం సంభవించిన ప్రాంతంలో నీరు, సమాచార మౌలిక సదుపాయాలు సాధారణంగానే పని చేస్తున్నాయి. ప్రభావిత ప్రాంతాలని వీలైనంత త్వరగా సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.