Share News

Gaston Glock: గన్ సృష్టికర్త ఇక లేడు.. ఎలా మృతి చెందారంటే?

ABN , Publish Date - Dec 28 , 2023 | 06:06 PM

ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న చేతి తుపాకుల్లో ఒకదాన్ని సృష్టించిన గస్టన్ గ్లాక్ బుధవారం తుదిశ్వాస విడిచారు. ప్రముఖ ఇంజనీర్, వ్యాపారవేత్త అయిన ఆయన 94 ఏళ్ల వయసులో మృతి చెందారు.

Gaston Glock: గన్ సృష్టికర్త ఇక లేడు.. ఎలా మృతి చెందారంటే?

Gaston Glock: ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న చేతి తుపాకుల్లో ఒకదాన్ని సృష్టించిన గస్టన్ గ్లాక్ బుధవారం తుదిశ్వాస విడిచారు. ప్రముఖ ఇంజనీర్, వ్యాపారవేత్త అయిన ఆయన 94 ఏళ్ల వయసులో మృతి చెందారు. ఆయనది సహజ మరణంగా తేలింది. తన పేరుపై ఆయుధాలు కలిగి ఉన్న ఈ ఆస్ట్రియన్‌కు పోలీసులు, మిలిటరీలో ఎంతోమంది నమ్మకమైన అనుచరులు ఉన్నారు. 2021లో గస్టన్, అతని కుటుంబ సంపద $1.1 బిలియన్లు ఉందని ప్రముఖ ఫోర్బ్స్ మ్యాగజైన్ అంచనా వేసింది.

1980ల్లో ఆస్ట్రియన్ మిలిటరీ కొత్త, వినూత్నమైన ఆయుధం కోసం వెతుకుతున్నప్పుడు.. గస్టన్ గ్లాక్ ఎదుగుదల ప్రారంభమైంది. అప్పటి వరకు అతని కంపెనీ సైనిక కత్తులు, కర్టెన్ రాడ్‌లతో సహా వినియోగ వస్తువులను తయారు చేసింది. అయితే.. ఆ సమయంలో తుపాకుల వాడకం పెరగడం, దాని ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకొని.. తుపాకులు తయారు చేసే నిపుణుల బృందాన్ని సమీకరించాడు. ఆ బృందం సహకారంతో అతను ‘గ్లాక్ 17’ అనే తుపాకీని తయారు చేశాడు. ఎంతో తేలికైన ఈ సెమీ ఆటోమేటిక్ తుపాకీని గస్టన్ గ్లాక్ ఎక్కువగా ప్లాస్టిన్‌తో తయారు చేశాడు. ఈ తుపాకీ మార్కెట్‌లోకి రావడమే ఆలస్యం.. ఇతర కంపెనీలను వెనక్కు నెట్టేసి, గణనీయంగా అమ్ముడుపోయింది. అనతికాలంలోనే ఈ ఆయుధం ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైంది.


చాలామంది అమెరికా అధికారులు ఆ ఆయుధాన్ని వాడారు. సినిమాల్లోనూ ఆ తుపాకీ గురించి ప్రస్తావించారు. అంతెందుకు.. 2003లో ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ అండర్‌గ్రౌండ్‌లో ఒక చిన్న ప్రాంతంలో దాక్కున్నాడని ‘గ్లాక్’ ఆయుధంతోనే అమెరికా సైనికులు కనుగొన్నారు. ఆ తర్వాత ఈ ఆయుధాన్ని అప్పటి యూఎస్ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ. బుష్‌కి అందించినట్టు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అయితే.. గన్-నియంత్రణ న్యాయవాదులు మాత్రం శక్తివంతమైన తుపాకులను ప్రాచుర్యంలోకి తెచ్చినందుకు గాను గస్టన్ గ్లాక్‌ని విమర్శించారు. అయితే.. గస్టన్ తనపై వచ్చిన విమర్శలపై పెద్దగా స్పందించింది లేదు. 2000లో ఇతర సంస్థలతో కలిసి యూఎస్ ప్రభుత్వంతో స్వచ్ఛంద తుపాకీ నియంత్రణ ఒప్పందంపై సంతకం చేయడానికి కూడా నిరాకరించాడు.

గస్టన్ గ్లాక్‌కి 70 ఏళ్ల వయసు ఉన్నప్పుడు, అంటే 1994లో అతనిపై ఒక దాడి జరిగింది. అయితే.. దాన్నుంచి ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ దాడి చేయించింది మరెవ్వరో కాదు.. తన వద్ద పని చేసే చార్ల్స్ ఈవర్ట్ అనే బ్రోకర్. ఇతగాడు గస్టన్ గ్లాక్ ఆస్తులను నిర్వహిస్తుంటాడు. ఈవర్ట్‌పై అనుమానం రావడంతో, గస్టన్ అతడ్ని కోర్టుకీడ్చాడు. ఆ కోపంతోనే గస్టన్ గ్లాక్‌కు హతమార్చేందుకు జాక్స్ పీచర్ అనే ఒక మాజీ రెజ్లర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ మాజీ రెజ్లర్ ఒక రబ్బరు సుత్తితో దాడి చేసి, గస్టన్ గ్లాక్‌కు హతమార్చేందుకు ప్రయత్నం చేశాడు. అయితే.. అదృష్టవశాత్తూ గస్టన్ గ్లాక్ ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ కేసులో వాళ్లిద్దరికీ జైలుశిక్ష పడింది.

ఇక గస్టన్ గ్లాక్ వ్యక్తిగత జీవితానికొస్తే.. 49 ఏళ్ల సుదీర్ఘ వైవాహిక జీవితం అనంతరం హెల్గా గ్లాక్‌కు 2011లో విడాకులు ఇచ్చాడు. భరణం విషయంలో ఈ జంట సుదీర్ఘ న్యాయ పోరాటం చేసింది. అయితే.. గస్టన్ గ్లాక్ మాత్రం విడాకులు తీసుకున్న వెంటనే వయసులో తనకంటే 50 సంవత్సరాలు చిన్నదైన ఓ యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇతనికి కారింథియా ప్రావిన్స్‌లో ఒక లేక్‌ఫ్రంట్ మాన్షన్‌తో పాటు అత్యాధునిక ఈక్వెస్ట్రియన్ స్పోర్ట్స్ సెంటర్స్ ఉన్నాయి. ఇక్కడ సెలెబ్రిటీలు పార్టీలకు హాజరవుతుంటారు. ఇతనికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు.

Updated Date - Dec 28 , 2023 | 06:06 PM