Palestine - Israel: పాలస్తీనియన్లకు ఇజ్రాయెల్ వార్నింగ్.. 3 గంటల్లో ఇళ్లు విడిచి పోవాలి.. లేదంటే?
ABN , First Publish Date - 2023-10-15T16:15:49+05:30 IST
హమాస్ అంతమే లక్ష్యంగా పావులు కదుపుతున్న ఇజ్రాయెల్ పాలస్తీనియన్లు తమ ప్రాణాలు కాపాడుకోవాలంటూ హెచ్చరించింది. 3 గంటల్లో ఇళ్లు విడిచి వెళ్లిపోవాల్సిందింగా హెచ్చరించింది. ఇప్పటికే 30 వేలకు పైగా సైనికులను గాజా సరిహద్దు వెంట మోహరించిన ఇజ్రాయెల్ ఏ క్షణమైన ఆ ప్రాంతంపై మెరుపుదాడికి దిగే అవకాశం ఉంది.
జెరూసలెం: "కేవలం 3 గంటల టైం ఇస్తున్నాం.. ప్రాణాలు కాపాడుకోవాలంటే వెంటనే పారిపోండి" ఇదీ పాలస్తీనియన్లకు ఇజ్రాయెల్(Israel) ఇచ్చిన వార్నింగ్. వారంరోజులుగా జరుగుతున్న యుద్ధంలో రెండు వైపులా వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. అదే టైంలో హమాస్ అంతమే లక్ష్యంగా పావులు కదుపుతున్న ఇజ్రాయెల్ పాలస్తీనియన్లు తమ ప్రాణాలు కాపాడుకోవాలంటూ హెచ్చరించింది. 3 గంటల్లో ఇళ్లు విడిచి వెళ్లిపోవాల్సిందింగా హెచ్చరించింది. ఇప్పటికే 30 వేలకు పైగా సైనికులను గాజా సరిహద్దు వెంట మోహరించిన ఇజ్రాయెల్ ఏ క్షణమైన ఆ ప్రాంతంపై మెరుపుదాడికి దిగే అవకాశం ఉంది.
బహుముఖ దాడికి సిద్ధంగా ఉన్నామని రక్షణ దళం ప్రకటించింది. ఉత్తర గాజాలో 10 లక్షలకుపైగా పౌరులను దక్షిణం వైపు వెళ్లాలని ఇజ్రాయెల్ సూచించడంతో ఇప్పటికే పాలస్తీనియన్లు తమ ఇళ్లను విడిచిపెట్టారు. ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత ఆ ప్రాంతం "యాక్టివ్ కంబాట్ జోన్"గా మారుతుందని సీనియర్ ఆర్మీ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, శనివారం రాత్రి గాజాలో తమ వైమానిక దాడుల్లో హమాస్ ఎలైట్ మిలటరీ విభాగం నుఖ్బా ఫోర్స్ టాప్ కమాండర్ బిల్లాల్ అల్-ఖేద్రాను హతమైనట్లు సైన్యం ప్రకటించింది. ఇజ్రాయెల్ భూతల దాడి భయాలతో ఇప్పటికే పదివేల మంది పాలస్తీనియన్లు ఉత్తర గాజా నుండి పారిపోయారు. ఇప్పటిదాకా మొత్తం మృతుల సంఖ్య 3 వేల 600 దాటింది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ పిలుపు అందితే చాలు దాడులకు సిద్ధమంటున్నారు ఇజ్రాయెల్ సేనలు. అయితే దాడి ఎప్పుడు ప్రారంభమవుతుందో సైన్యం వెల్లడించలేదు. గాజా నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఇజ్రాయెల్ 10 వేల మంది సైనికులను పంపాలని యోచిస్తున్నట్లు సమాచారం.
భారీ దాడికి ప్లాన్..
ఇజ్రాయెల్ పై ఆకస్మిక మెరుపు దాడులకు దిగిన హమాస్ మిలిటెంట్లు వేల సంఖ్యలో ఇజ్రాయెలియన్లను హతమార్చారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ సైతం పాలస్తీనా(Palestine - Israel)పై మెరుపు దాడులకు దిగింది. అయితే ఇజ్రాయెల్ భారీ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. హమాస్ పై ప్రతీకారం తీర్చుకోవడానికి పూర్తి స్థాయిలో సైన్యాన్ని మోహరిస్తున్నట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. హమాస్(Hamas) మిలిటెంట్లను తుడిచిపెట్టాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్ ఉన్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. అదే టైంలో విపరీతమైన భూతల దాడులతో గాజా నగరాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకురావడానికి చూస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా హమాస్ చెరలో ఉన్న బందీలను విడిపించడం, హమాస్ నాయకత్వాన్ని తుదముట్టించడం, గాజాను స్వాధీనం చేసుకోవడం.. ఇలా త్రిశూల వ్యూహంతో ఇజ్రాయెల్ సాగుతోంది. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే గాజాపై భూ, వాయు, సముద్ర మార్గాల ద్వారా ఏకకాలంలో దాడులు చేసేందుకు సిద్ధం అవుతోంది. 2006 తరువాత ఇజ్రాయెల్ చేస్తున్న భారీ ఆపరేషన్ ఇదే. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) మూడు మార్గాల్లో దాడికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. ఆ దేశ సైన్యం గాజా సరిహద్దు వెంట పెద్ద సంఖ్యలో సైనికులను మోహరించి, చివరి కమాండ్ ఆదేశాల కోసం ఎదురు చేస్తోంది. హమాస్ ను నాశనం చేయడం, వారి చేతిలో మరణించిన ప్రతి ప్రాణానికి వడ్డీతో సహా తిరిగి ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఐడీఎఫ్ ప్రధాన ప్రతినిధి డేనయల్ హగారి స్పష్టం చేశారు. హమాస్ లకు కంచుకోటగా ఉన్న గాజాను తొలుత బాంబులతో దెబ్బ తీసి హమాస్ టెర్రరిస్టులను మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా దెబ్బతీసేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ ఇజ్రాయెల్‌లోని గాజా సరిహద్దులో 30 వేల మంది సైనికులను మోహరించింది. వారు ముఖ్యమైన గ్రౌండ్ ఆపరేషన్‌కి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే 10వేల మంది సైనికులు గాజాలోకి అడుగుపెట్టారు.