Google: ఉద్యోగార్థిని ఇంటర్వ్యూ చేస్తుండగా గూగుల్ హెచ్‌ఆర్‌కు దిమ్మతిరిగే షాక్..
ABN , First Publish Date - 2023-01-27T22:17:00+05:30 IST
గూగుల్‌లో ఉద్యోగుల తొలగింపులు ఎంత కఠినంగా ఉంటాయో తెలియజెప్పే ఘటన ఇది.
ఇంటర్నెట్ డెస్క్: గూగుల్‌లో(Google) ఉద్యోగుల తొలగింపులు(Layoffs) ఎంత కఠినంగా ఉంటాయో తెలియజెప్పే ఘటన ఇది. అనేక మంది అనూహ్య రీతిలో ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. తాజాగా గూగుల్ హెచ్‌ఆర్ శాఖలోని ఓ ఉద్యోగికి ఇటువంటి అనుభవమే ఎదురైంది. డాన్ లానిగన్ రయాన్ అనే వ్యక్తి ఇటీవల ఓ అభ్యర్థిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు తన ఉద్యోగాన్నే కోల్పోయారు. తొలుత ఇంటర్వ్యూ జరుగుతుండగా వీడియో కాల్ అకస్మాత్తుగా కాల్ కట్ అయ్యింది. ఆ తరువాత ఆయన.. కంపెనీ అంతర్గత వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించినా ప్రయోజం లేకపోయింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లగా ఏదో సాంకేతిక సమస్య కారణంగా ఇది జరిగుంటుందని కొట్టిపారేశారు. కొద్ది రోజుల తరువాత డాన్ ఉద్యోగం కోల్పోయినట్టు సంస్థ నుంచి ఈమెయిల్ అందింది. ఈ ఊహించని పరిణామానికి అతడి దిమ్మతిరిగి పోయింది. తొలగింపుల వ్యవహారంలో అత్యంత పకడ్బందీగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. ఎవరిని ఎప్పుడు తొలగిస్తారనే అంశంపై మానవనరుల శాఖ వద్ద కూడా పూర్తి సమాచారం అందుబాటులో లేదని ఉద్యోగులు పేర్కొన్నారు.