Hamas vs Israel: టచ్ చేసి చూడు.. బందీల విషయంలో ఇజ్రాయెల్, హమాస్ పరస్పర హెచ్చరికలు

ABN , First Publish Date - 2023-10-10T18:04:45+05:30 IST

భూమి, వాయు, జల, మార్గాల ద్వారా ఇజ్రాయెల్‌లోకి చొరబడి ఊహించని దాడులు చేసిన హమాస్ ఉగ్రవాదులు.. కొందరు ఇజ్రాయెల్ పౌరుల్ని గాజాకు తీసుకెళ్లి, అక్కడ బందీలుగా ఉంచుకున్నారు. ఈ బందీల విషయంలో..

Hamas vs Israel: టచ్ చేసి చూడు.. బందీల విషయంలో ఇజ్రాయెల్, హమాస్ పరస్పర హెచ్చరికలు

భూమి, వాయు, జల, మార్గాల ద్వారా ఇజ్రాయెల్‌లోకి చొరబడి ఊహించని దాడులు చేసిన హమాస్ ఉగ్రవాదులు.. కొందరు ఇజ్రాయెల్ పౌరుల్ని గాజాకు తీసుకెళ్లి, అక్కడ బందీలుగా ఉంచుకున్నారు. ఈ బందీల విషయంలో హమాస్‌కు తాజాగా ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. బందీలుగా తీసుకెళ్లిన తమ పౌరులకు ఏమైనా జరిగితే, హమాస్ పరిస్థితి మరింత దిగజారుతుందని వార్నింగ్ ఇచ్చింది. చిన్న పిల్లాడికైనా హాని కలిగిస్తే.. హమాస్‌ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని హెచ్చరించింది.


ఈ విషయంపై ఇజ్రాయెల్‌ దళాల ప్రతినిధి రిచర్డ్‌ మాట్లాడుతూ.. ‘‘బందీలుగా ఉన్నవారిలో వృద్ధురాలికైనా, పసికందుకైనా హాని కలిగిస్తే హమాస్‌ని విడిచిపెట్టం. వారి పరిస్థితి మరింత దిగజారుస్తాం. ఇది వారికి కూడా తెలుసు’’ అని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. తాము ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకుండా బాంబింగ్‌ చేయమని హామీ ఇచ్చారు. దాడికి ముందు సోషల్ మీడియాలో పోస్టు చేయడమో లేదా వార్నింగ్ షాట్స్ పేల్చడం ద్వారానో ఐడీఎఫ్ హెచ్చరికలు జారీ చేస్తుందని క్లారిటీ ఇచ్చారు. గాజాలో సామాన్య ప్రజలుండే భవానాల్లో హమాస్ నాయకులు దాక్కొంటున్నారని, ఆయుధాలు సైతం వాళ్ల ఇంట్లోనే ఉంచుతున్నారని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోనే.. సామాన్య ప్రజలు ఆ ప్రదేశాల్ని ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందిగా రిచర్డ్ సూచించారు.

మరోవైపు.. ఇజ్రాయెల్‌ దళాలు గాజాపై నియంత్రణ సాధించే దిశగా అడుగు వేస్తుండటం, బందీల విషయంలో ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో హమాస్ కూడా ఓ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తాము బందీలుగా ఉంచిన ఇజ్రాయెల్ పౌరులందరినీ ఇస్లాం మతం ప్రకారం సురక్షితంగా ఉంచామని హమాస్ ప్రతినిధి అబు ఉబైదా పేర్కొన్నాడు. ఒకవేళ ఇజ్రాయెల్ తమ గాజాపై బాంబుల వర్షం కురిపిస్తే.. ఒక్కో బాంబ్‌కి ఒక్కో పౌరుడ్ని చొప్పున హత్య చేస్తామని బెదరించాడు. ఎలాంటి హెచ్చరికలు లేకుండా బాంబు దాడులు చేస్తూ.. గాజాలోని సామాన్య ప్రజల్ని చంపుతున్నారని ఆరోపించారు. ఈ బాంబుల వర్షాన్ని ఆపాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవంటూ అబు ఉబైదా పేర్కొన్నాడు.

Updated Date - 2023-10-10T18:04:45+05:30 IST