Share News

Israel Hamas War: చివరి నిమిషంలో ప్లాన్ మార్చేసిన హమాస్.. కమాండర్ బయటపెట్టిన చీకటి రహస్యాలు

ABN , First Publish Date - 2023-11-06T21:20:03+05:30 IST

ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న తరుణంలో.. హమాస్ సైనిక కమాండర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తమ సంస్థకు చెందిన కొన్ని చీకటి రహస్యాలను బట్టబయలు చేశాడు. ఇజ్రాయెల్ పౌరుల్ని చంపడం తమ ప్లాన్‌లో...

Israel Hamas War: చివరి నిమిషంలో ప్లాన్ మార్చేసిన హమాస్.. కమాండర్ బయటపెట్టిన చీకటి రహస్యాలు

ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న తరుణంలో.. హమాస్ సైనిక కమాండర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తమ సంస్థకు చెందిన కొన్ని చీకటి రహస్యాలను బట్టబయలు చేశాడు. ఇజ్రాయెల్ పౌరుల్ని చంపడం తమ ప్లాన్‌లో భాగం కాదని.. కేవలం సైనికుల్ని మాత్రమే అపహరించాలని మొదట ప్రణాళికలు రచించారని.. కానీ చివరి నిమిషంలో తమ నాయకత్వం మొత్తం ప్లాన్ మార్చేసిందని కుండబద్దలు కొట్టాడు. అసలు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని తాము ఏమాత్రం ఊహించలేదని పేర్కొన్నాడు.


డైలీ మెయిల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ హమాస్ కమాండ్ మాట్లాడుతూ.. తన ‘కోడ్ నేమ్’ అబూ మహమ్మద్ అని తెలిపాడు. 400 మంది హమాస్ యోధులతో కూడిన బెటాలియన్‌కు తాను అధిపతినని.. అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై దాడికి ప్లాన్ చేసిన వ్యక్తుల్లో తానూ ఒకడినని చెప్పాడు. ముందుగా వేసిన తమ ప్రణాళికలో ఇజ్రాయెల్ పౌరుల్ని కిడ్నాప్ చేయడం లేదని స్పష్టం చేశాడు. కేవలం సైనికులను మాత్రమే బందీలుగా పట్టుకోవాలని వ్యూహం రచించామన్నాడు. సైనికులకు బదులుగా ఇజ్రాయెల్‌లో ఖైదు చేయబడిన పాలస్తీనియన్లను విడుదల చేయాలని ఇజ్రాయెల్ ముందు డిమాండ్ పెట్టాలనుకున్నామని వెల్లడించాడు. కానీ.. చివరి నిమిషంలో ‘మీకు ఏది కావాలంటే అది చేయండి’ అని హమాస్ నాయకత్వం తమ యోధులకు ఆదేశాలు జారీ చేసిందని.. ఫలితంగా ఈ దుస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చాడు.

ఇదే సమయంలో హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్‌పై కమాండర్ అబూ మహమ్మద్ తారాస్థాయిలో విరుచుకుపడ్డాడు. ఇజ్రాయెల్‌పై దాడి చేయమని హమాస్ యోధులకు ఆదేశాలు జారీ చేసిన తమ నాయకులు గాజాలో లేరని, వాళ్లు ఇజ్రాయెల్ ప్రతీకారాన్ని ఎదుర్కోవడం లేదని నిప్పులు చెరిగాడు. తమ నాయకత్వం కారణంగానే ఇప్పుడు గాజాపై బాంబులు వేయబడుతున్నాయని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. తన నాయకత్వంతో తాను సంప్రదింపులు తెంపుకున్నానని, తన వద్ద ఆహార పదార్థాలు కూడా అయిపోయాయని చెప్పాడు. తాను కేవలం ఖర్జూరం, ఆలివ్ ఆయిల్ తింటూ బుతకుతున్నానని తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఒక స్ట్రీట్ ఫైటర్‌లా తాను పని చేయాలనుకున్నానని, కానీ హమాస్ నాయకత్వం కారణంగా తన జీవితం సర్వనాశనం అయ్యిందని, ఇలా జరుగుతుందని అనుకోలేదని రోధించాడు.


గాజాలో 10 వేలు దాటిన మరణాల సంఖ్య

మరోవైపు.. హమాస్ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ చేపట్టిన ప్రతీకార చర్యల కారణంగా గాజాలో సామాన్య పౌరుల మరణాల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకూ ఈ యుద్ధంలో 10,022 మంది పాలస్తీనా పౌరులు మరణించారని.. పాలస్తీనా ఆరోగ్య అధికారులను ఉటంకిస్తూ అల్ జజీరా నివేదిక పేర్కొంది. వీరిలో 4104 మంది చిన్నారులు ఉన్నారు. అంతేకాదు.. ఇంకా చాలామంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. కనీసం 2,000 మంది శిథిలాల కింద ఇంకా చిక్కుకుపోయారని.. భారీ పరికరాలు, యంత్రాలు లేకపోవడం వల్ల వాళ్లు బయటకు రావడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆ నివేదిక తెలిపింది. ఇజ్రాయెల్ ముట్టడి కారణంగా.. గాజా ప్రజలు ఇంధనం, ఆహారం, విద్యుత్ వంటి నిత్యావసర వస్తువులను పొందలేకపోతున్నారు.

Updated Date - 2023-11-06T21:20:05+05:30 IST