Israel-Hamas war: హమాస్ టాప్ కమాండర్ హతం
ABN , First Publish Date - 2023-11-26T17:42:51+05:30 IST
ఉత్తర గాజా ఇన్‌చార్జిగా ఉన్న తమ టాప్ కమాండర్ అహ్మద్ అల్-ఘండౌర్ ఇజ్రాయెల్‌తో యుద్ధంలో హతమైనట్టు మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఆదివారంనాడు ప్రకటించింది. హమాస్ ఆయుధ విభాగం టాప్-ర్యాంకింగ్ సభ్యుడిగా ఘండౌర్ ఉన్నాడు. ఘండౌర్ ఎప్పడు, ఎక్కడ హతమయ్యాడనేది మాత్రం హమాస్ ప్రకటించలేదు.
గాజా: ఉత్తర గాజా ఇన్‌చార్జిగా ఉన్న తమ టాప్ కమాండర్ అహ్మద్ అల్-ఘండౌర్ (Ahmed al-GAndour) ఇజ్రాయెల్‌తో యుద్ధంలో హతమైనట్టు మిలిటెంట్ గ్రూప్ హమాస్ (Hamas) ఆదివారంనాడు ప్రకటించింది. హమాస్ ఆయుధ విభాగం టాప్-ర్యాంకింగ్ సభ్యుడిగా ఘండౌర్ ఉన్నాడు. ఘండౌర్ ఎప్పడు, ఎక్కడ హతమయ్యాడనేది మాత్రం హమాస్ ప్రకటించలేదు. కాగా, 2002లో ఘండౌర్‌ను చంపేందుకు ఇజ్రాయెల్ మూడుసార్లు ప్రయత్నించినప్పటికీ అతను తప్పించుకున్నట్టు వాషింగ్టన్‌కు చెందిన తీవ్రవాద నిరోధక ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు.
13 మంది ఇజ్రాయెల్ బందీల విడుదల
కాగా, తమ బందీలుగా ఉన్న 13 మంది ఇజ్రాయెల్ ప్రజలను, నలుగురు విదేశీయులను హమాస్ ఆదివారంనాడు విడిచిపెట్టింది. ఇందుకు ప్రతిగా 39 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టింది. తమ మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తోందంటూ రెండో విడత బందీల విడుదలకు హమాస్ జాప్యం చేయడంతో ఖతార్, ఈజిప్ట్ మధ్యవర్తలు ఒక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ చెరలో ఉన్న 39 ఖైదీల విడుదలకు ప్రతిగా, 13 మంది ఇజ్రాయెల్ బందీలు, నలుగురు విదేశీయులను విడుదల చేసేందుకు హమాస్ అంగీకరించినట్టు తెలిపారు. మొత్తం 20 మంది బందీలను రెడ్ క్రాస్ అంతర్జాతీయ కమిటీకి అప్పగించినట్టు శనివారం అర్ధరాత్రి హమాస్ ప్రకటించింది. కాగా, ఇరువర్గాలకు చెందిన బందీల మార్పిడిపై కొంత అనిశ్చితి తలెత్తినప్పటికీ బందీల విడుదల ప్రక్రియ మొదలుకావడంతో ప్రాణాలతో బయటపడిన వారి కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తోంది.
కాల్పుల విరణ తొలిరోజు హమాస్ తమ వద్ద ఉన్న సుమారు 240 మంది బందీల్లో 24 మందిని విడుదల చేసింది. ఇజ్రాయెల్ 39 మంది పాలస్తీనా ప్రజలను జైలు నుంచి విడిచిపెట్టింది. హమాల్ విడుదల చేసిన బందీల్లో 13 మంది ఇజ్రాయెల్ ప్రజలు, 10 థాయ్, ఒక ఫిలిప్పీన్ పౌరుడు ఉన్నారు. మొత్తం మీద నాలుగు రోజుల తాత్కాలిక ఒప్పంద కాలంలో హమాస్ 50 మంది ఇజ్రాయెల్ పౌరులను, ఇజ్రాయెల్ 150 మంది పాలస్తీనా ఖైదీలకు విముక్తి కల్పిస్తోంది. 10 మంది బందీలకు ఒక్కో రోజు చొప్పున కాల్పుల విరమణ పొడిగిస్తామని ఇజ్రాయెల్ చెబుతోంది.