Israel-Hamas:ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హమాస్ సీనియర్ కమాండర్ మృతి
ABN , First Publish Date - 2023-10-14T13:26:13+05:30 IST
ఇజ్రాయెల్-పాలస్థీనా(Israeil-Palestine) యుద్ధంలో హమాస్(Hamas) సీనియర్ కమాండర్ మృతి చెందినట్లు ఆ ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. గాజా స్ట్రిప్(Gaza Strip)లో జరిగిన వైమానిక దాడిలో హమాస్ టెర్రర్ గ్రూప్‌లోని సీనియర్ సభ్యుడు మురాద్ అబూ మురాద్‌ని హతమార్చినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(Israeil Defence Force) వెల్లడించింది.
జెరూసలెం: ఇజ్రాయెల్-పాలస్థీనా(Israeil-Palestine) యుద్ధంలో హమాస్(Hamas) సీనియర్ కమాండర్ మృతి చెందినట్లు ఆ ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. గాజా స్ట్రిప్(Gaza Strip)లో జరిగిన వైమానిక దాడిలో హమాస్ టెర్రర్ గ్రూప్‌లోని సీనియర్ సభ్యుడు మురాద్ అబూ మురాద్‌ని హతమార్చినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(Israeil Defence Force) వెల్లడించింది. అబూ మురాద్ గత వారం ఇజ్రాయెల్ ప్రజలను ఊచకోత కోసిన టైంలో ఉగ్రవాదుల(Terrorists)కు దిశానిర్దేశం చేయడంలో పెద్ద పాత్ర పోషించాడు. అతన్ని లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్ మట్టుబెట్టింది.
అయితే హమాస్ శనివారం కూడా ఇజ్రాయెల్‌పై దాడులను కొనసాగించింది. ఈ దాడుల్లో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటివరకు ఇజ్రాయెల్‌లో 13 వందలకుపైగా మరణించగా.. ఇజ్రాయెల్ ఎదురు దాడుల్లో గాజాలో 15 వందలకు పైగా మృతి చెందారు. ఇజ్రాయెల్‌లో దాదాపు 15 వందల మంది హమాస్ మిలిటెంట్లు హతమయ్యారని ఇజ్రాయెల్ పేర్కొంది.
తీవ్రరూపం దాలుస్తోన్న యుద్ధం..
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చుతోంది. హమాస్ పాలనలో ఉన్న గాజాపై ఇప్పటికే బాంబుల వర్షం కురిపించి అనేక భవనాలను నేలమట్టం చేసిన ఇజ్రాయెల్ సైన్యం దాడిని మరింత ఉద్ధృతం చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఉత్తర గాజాలోని దాదాపు 11 లక్షల మంది పాలస్తీనీయులను 24 గంటల్లోగా ఆ ప్రాంతం ఖాళీ చేసి వెళ్లిపోవాలని శుక్రవారం ఆదేశించింది. హమాస్ ఉగ్రవాదులను పూర్తిగా ఏరివేయటానికి వీలుగా భూతల యుద్ధానికి దిగటం కోసమే ఈ హెచ్చరిక జారీ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. అంతమంది ఒక్కసారిగా తరలివెళ్లటం అసాధ్యమని, మానవ సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొంది. ఇప్పటికే నెలకొన్న విషాదాన్ని పెను విపత్తుగా మార్చవద్దని, ఆ ఆదేశాల్ని ఉపసంహరించుకోవాలని ఇజ్రాయెల్‌ను కోరింది. మరోవైపు, మానసిక యుద్ధంలో భాగంగానే ఇజ్రాయెల్ ఇటువంటి హెచ్చరికలకు పాల్పడుతున్నదని, ఎవరూ ఉత్తర గాజాను వదిలివెళ్లవద్దని పౌరులకు హమాస్ పిలుపునిచ్చింది. సాధారణ ప్రజానీకం మాత్రం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని భారీసంఖ్యలో వెళ్లిపోతున్నారు. ఇలా వెళ్లిపోతున్నవారిపైన కూడా ఇజ్రాయెల్ దాడులు చేసిందని, 70 మంది చనిపోయారని హమాస్ ఆరోపించింది.