Syria Earthquake: శిథిలాల కింద అద్భుతం.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృత్యుంజయులు
ABN , First Publish Date - 2023-02-12T16:35:56+05:30 IST
డమాస్కస్: పెను భూకంపాలతో అతలాకుతలమైన టర్కీ, సిరియాల్లో వేలాది మంది రెస్క్యూ సిబ్బంది రేయింబవళ్లు సహాయక చర్యల్లో తలమునకలవుతున్నారు. శిథిలాల కింద నుంచి బయట పడుతున్న మృతదేహాలతో..
డమాస్కస్: పెను భూకంపాలతో అతలాకుతలమైన టర్కీ, సిరియాల్లో వేలాది మంది రెస్క్యూ సిబ్బంది రేయింబవళ్లు సహాయక చర్యల్లో తలమునకలవుతున్నారు. శిథిలాల కింద నుంచి బయట పడుతున్న మృతదేహాలతో ఉగ్విగ్న వాతావరణం అన్నిచోట్లా కనిపిస్తోంది. ఇదే సమయంలో కొందరు శిథిలాల కింద నుంచి మృత్యుంజయులుగా బయటపడుతుండంతో సహాయక సిబ్బందికి, వారి బంధువులకు ఒకింత ఉపశమనం కలుగుతోంది. అద్భుత రీతిలో 10 రోజుల శిశువు తల్లితో సహా బయటపడటం, 90 గంటల తర్వాత అప్పుడే జన్మించిన శిశువు బయటపడగా, ఆ శిశువుకు జన్మనిచ్చిన తల్లి మరణించడం వంటి పలు ఘటనలు ఇటీవల చోటుచేసుకున్నాయి. తాజాగా సిరియాలో మరో ఉద్విగ్న వీడియో బయటకు వచ్చింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులను రెస్క్యూ సిబ్బంది అత్యంత చాకచక్యంగా బయటకు తీసుకువచ్చి ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు పిల్లలు, ఇద్దరు పెద్దవాళ్లు ఉన్నారు. ఫిబ్రవరి 7న పశ్చిమ ఇడ్లిబ్లోని బిస్నియా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
''ఇది నిజంగానే అద్భుతం. మా ఆనందానికి పట్టపగ్గాలు లేవు. సంతోషం అవధులు దాటింది. కుప్పకూలిన భవనం శిథిలాల నుంచి ఒకే కుటుంబానికి చెందిన ఐగురునికి సురక్షితంగా బయటకు తీసుకు వచ్చాం'' అని సిరియా సివిల్ డిఫెన్స్‌కు చెందిన వైట్ హెల్మెట్స్ ఓ ట్వీట్లో తెలిపింది.
కాగా, టర్కీ, సిరియాలను కుదిపేసిన భూకంపంలో శనివారం మధ్యాహ్నం వరకూ 28,192 మంది మృత్యువాత పడినట్టు సీఎన్ఎన్ తెలిపింది. టర్కీలో 24,617 మంది మృతి చెందినట్టు టర్కీ ఉపాధ్యక్షుడు ఫుఅత్ ఓకటే తెలిపారు. సిరియాలో 3,575 మంది మృత్యువాత పడినట్టు ధ్రువీకరించారు. మరో 1.408 మంది ప్రభుత్వ అధీన ప్రాంతాల్లో మృతిచెందినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖను ఉటంకిస్తూ సిరియా స్టేట్ మీడియా తెలిపింది.