Share News

Israel Hamas War: ఇజ్రాయెల్‌కు భారీ షాకిచ్చిన హెజ్‌బొల్లా.. ఐరన్ డోమ్ ధ్వంసం

ABN , Publish Date - Dec 19 , 2023 | 04:22 PM

హమాస్ దాడులకు ప్రతీకారంగా గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌‌కు తాజాగా ఊహించని షాక్ తగిలింది. హమాస్‌కు మద్దతుగా లెబనాన్‌కు చెందిన ‘హెజ్‌బొల్లా’ అనే ఉగ్రవాద సంస్థ రంగంలోకి దిగి.. ఇజ్రాయెల్‌పై ఎదురుదాడులు చేస్తోంది.

Israel Hamas War: ఇజ్రాయెల్‌కు భారీ షాకిచ్చిన హెజ్‌బొల్లా.. ఐరన్ డోమ్ ధ్వంసం

Hezbollah Attacks On Israel Iron Dome: హమాస్ దాడులకు ప్రతీకారంగా గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌‌కు తాజాగా ఊహించని షాక్ తగిలింది. హమాస్‌కు మద్దతుగా లెబనాన్‌కు చెందిన ‘హెజ్‌బొల్లా’ అనే ఉగ్రవాద సంస్థ రంగంలోకి దిగి.. ఇజ్రాయెల్‌పై ఎదురుదాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐరన్‌ డోమ్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసింది. ఈ విషయాన్ని స్వయంగా హెజ్‌బొల్లానే ప్రకటించింది. ఉత్తర ఇజ్రాయెల్‌లోని కబ్రి ప్రాంతంలో ఉన్న రెండు ఐరన్‌ డోమ్‌ వ్యవస్థలపై దాడి చేశామని, దీంతో రెండు లాంచింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొంది. అయితే.. దీనిపై ఇజ్రాయెల్ సైన్యం నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.

మరోవైపు.. హమాస్‌తో జరుగుతున్న యుద్ధంలో జోక్యం చేసుకోవద్దని తాము గతంలోనే వార్నింగ్ ఇచ్చినప్పటికీ, దాన్ని లెక్క చేయకుండా హెజ్‌బొల్లా తమపై దాడులు చేయడంతో ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగినట్లు తెలుస్తోంది. హెజ్‌బొల్లాను లక్ష్యం చేసుకొని.. దాని స్థావరాలు ఉన్న దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ సైన్యం క్షిపణి దాడులు చేసినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అయితే.. ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఇదివరకే హెజ్‌బొల్లా రాకెట్లు, మోర్టార్‌ షెల్స్‌ను ప్రయోగించగా.. వాటిని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తిప్పికొట్టింది. ఒకవేళ హెజ్‌బొల్లా ఇలాగే దాడులు కొనసాగిస్తే.. లెబనాన్‌ను మరో గాజాలాగా మార్చేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ప్రస్తుతం ఇజ్రాయెల్, లెబనాన్ సరిహద్దుల్లోనూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


ఇంతకీ ఐరన్ డోమ్ వ్యవస్థ ఏమిటి?

ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ గగనతల రక్షణ వ్యవస్థల్లో ఈ ఐరన్ డోమ్ ఒకటి. ఇజ్రాయెల్‌కు చెందిన రఫేల్‌ సంస్థ దీన్ని అభివృద్ధి చేయగా.. అమెరికా కూడా తనవంతు సహాయం అందించింది. ఈ ఐరన్ డోమ్‌లను ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాల్లో అమర్చింది. ఒకవేళ శత్రువులు అకస్మాత్తుగా ఇజ్రాయెల్‌పై రాకెట్లు ప్రయోగిస్తే.. ఐరన్‌ డోమ్‌లోని డిటెక్షన్‌ అండ్‌ ట్రాకింగ్‌ రాడార్‌ దానిని పసిగడుతుంది. దాని గమనానికి చెందిన సంబంధించిన సమాచారాన్ని ఆయుధ నియంత్రణ వ్యవస్థకు చేరవేస్తుంది. అప్పుడు ఆ వ్యవస్థ క్షిపణని ప్రయోగించి.. గాల్లోనే ప్రత్యర్థి ప్రయోగించిన రాకెట్లను ధ్వంసం చేస్తుంది. 2011లో ఇజ్రాయెల్ ఈ ఐరన్ డోమ్‌ని వినియోగంలోకి తీసుకురావడం జరిగింది.

Updated Date - Dec 19 , 2023 | 04:22 PM