Houthi: ‘హౌతీ’లు ఎవరు? ఆ రవాణా నౌకని ఎందుకు హైజాక్ చేశారు? వారికి, ఇజ్రాయెల్‌కి లింక్ ఏంటి?
ABN , First Publish Date - 2023-11-20T22:33:33+05:30 IST
ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో.. టర్కీ నుంచి భారత్‌కు రావాల్సిన ఓ రవాణా నౌక ఎర్ర సముద్రంలో హైజాక్‌కి గురి కావడం సంచలనంగా మారింది. గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా..
Houthi History: ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో.. టర్కీ నుంచి భారత్‌కు రావాల్సిన ఓ రవాణా నౌక ఎర్ర సముద్రంలో హైజాక్‌కి గురి కావడం సంచలనంగా మారింది. గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా.. హౌతీ తిరుగుబాటుదారులు ఈ చర్యకు పాల్పడ్డారు. ఈ నౌకలో ఉన్న 25 మంది సిబ్బందిని సైతం బంధించారు. బంధీలలో ఉక్రెయిన్, బల్గేరియా, ఫిలిప్పీన్స్, మెక్సికోతో పాటు ఇతర దేశాలకు చెందిన వారు ఉన్నారు. దీంతో.. ఈ చర్యని ఇజ్రాయెల్, జపాన్, అమెరికా దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఇజ్రాయెల్ అయితే.. ఈ హైజాక్ వెనుక ఇరాన్ ఉందని కుండబద్దలు కొట్టింది.
ఇంతకీ ఈ హౌతీలు ఎవరు?
ఈ రవాణా నౌకని హైజాక్ చేసింది హతీ తిరుగుబాటుదారులని తెలియగానే.. వాళ్ల చరిత్ర ఏంటనే విషయంపై చర్చ నడుస్తోంది. వీళ్లు మరెవ్వరో కాదు.. యెమెన్ అనే ఇస్లామిక్ దేశానికి చెందినవారు. ఈ దేశంలో షియాలు, సున్నీలు నివసిస్తుంటారు. యెమెన్‌లో ఉన్న మొత్తం జనాభాలో 60 శాతం మంది సున్నీ ముస్లింలు కాగా.. 35 శాతం షియా ముస్లింలు ఉన్నారు. ఈ రెండు వర్గాల మధ్య కొన్ని శతాబ్దాల నుంచి వివాదం నడుస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే షియాలను మరింత బలోపేతం చేసేందుకు, సున్నీలపై ఆధిపత్యం చెలాయించేందుకు గాను.. 1990ల కాలంలో షియా ముస్లింలు ‘హౌతీ’ అనే తిరుగుబాటు సంస్థను ఏర్పాటు చేశారు.
ఈ హౌతీ సంస్థ హుస్సేన్ బద్రుద్దీన్ అల్-హౌతీ నాయకత్వంలో.. అప్పటి అధ్యక్షుడు అలీ అబ్దుల్లా సలేహ్ & యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసింది. కొంతకాలం పాటు ఈ పోరు సాగింది. అయితే.. 2004లో యెమెన్ సైన్యం హౌతీ సంస్థ నాయకుడు హుస్సేన్ బద్రుద్దీన్ హతమార్చింది. అప్పుడు ఆ సంస్థ కాస్త బలహీనపడింది. కానీ.. క్రమంగా తన బలాన్ని పెంచుకుంటూ, 10 ఏళ్లలో శక్తివంతంగా తయారైంది. ఈ క్రమంలోనే 2014లో ఈ సంస్థ మరోసారి పోరాటం చేసింది. ఈ పోరాటంలో హౌతీనే విజయం సాధించి, యెమెన్ రాజధాని సనాను స్వాధీనం చేసుకుంది. అప్పటి నుండి ఇది హౌతీ నియంత్రణలోనే ఉంది.
ఈ హౌతీలో ఉన్న షియా ముస్లింలు.. ఇరాన్‌కి వైపు మొగ్గు చూపుతారు. ఇరాన్ ప్రస్తుతం ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో హమాస్‌కి మద్దతు తెలుపుతోంది. అందుకే.. ఇరాన్ బాటలోనే హైతీ తిరుగుబాటుదారులు నడుచుకుంటూ.. హమాస్‌కి మద్దతుగా ఇజ్రాయెల్‌కి వ్యతిరేకంగా చర్యలకు పాల్పడుతున్నారు. ఇందులో భాగంగానే.. తాజాగా ఇజ్రాయెల్‌కి చెందిన కార్గో షిప్‌ని హైజాక్ చేయడం జరిగింది. ఈ ఓడ పేరు గెలాక్సీ లీడర్. ఎర్ర సముద్రం గుండా ఇజ్రాయెల్ నౌకలు వెళ్తే.. దాడులు చేస్తామని హౌతీలు ఇదివరకే ప్రకటించారు. వాళ్లు చెప్పినట్లుగానే.. గెలాక్సీ లీడర్ నౌకను హైజాక్ చేశారు.
కథలో ఊహించని ట్విస్ట్
అయితే.. ఈ మొత్తం తతంగంలో ఒక ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది. హౌతీలు ఏ నౌకనైతే హైజాక్ చేశారో, దానికి ఇజ్రాయెల్‌తో ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయాన్ని స్వయంగా ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. ఇది బ్రిటీష్ కంపెనీకి చెందిన ఓడ. కాకపోతే.. ఇందులో ఇజ్రాయెల్ కంపెనీ ‘అబ్రహం ఉంగార్’కు కొంత వాటా ఉంది. ఈ ఓడని జపాన్ కంపెనీకి లీజుకు ఇవ్వడం జరిగింది. అందుకే.. ఇది హైజాక్‌కి గురయ్యిందన్న విషయం తెలిసి, జపాన్ వెంటనే ఖండించింది. అయితే.. ఇది ఇజ్రాయెల్‌కు చెందింది కాదని తెలిసినా, హౌతీ ఇంతవరకు విడుదల చేయకపోవడం గమనార్హం.