Share News

Israel-Hamas War: ఇజ్రాయెల్‌కు ఇరాన్ సుప్రీం లీడర్ అల్టిమేటం.. పాలస్తీనియన్లపై మారణహోమాన్ని ఆపకపోతే..

ABN , First Publish Date - 2023-10-17T19:08:48+05:30 IST

అక్టోబర్ 7వ తేదీ నుంచి హమాస్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. తొలుత హమాస్ మెరుపుదాడులు చేసి ఈ యుద్ధానికి శంఖం పూరిస్తే.. ఇజ్రాయెల్ అందుకు ప్రతీకారం తీర్చుకుంటోంది. యావత్ హమాస్ సంస్థనే...

Israel-Hamas War: ఇజ్రాయెల్‌కు ఇరాన్ సుప్రీం లీడర్ అల్టిమేటం.. పాలస్తీనియన్లపై మారణహోమాన్ని ఆపకపోతే..

అక్టోబర్ 7వ తేదీ నుంచి హమాస్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. తొలుత హమాస్ మెరుపుదాడులు చేసి ఈ యుద్ధానికి శంఖం పూరిస్తే.. ఇజ్రాయెల్ అందుకు ప్రతీకారం తీర్చుకుంటోంది. యావత్ హమాస్ సంస్థనే అంతం చేయాలన్న లక్ష్యంతో.. గాజా స్ట్రిప్‌లోని వారి రహస్య స్థావరాలపై బాంబుల వర్షం కురిపించేసింది. ఇప్పుడు పంటల్లో చీడపురుగుల్లా హమాస్ ఉగ్రవాదుల్ని ఏరి ఏరి చంపాలని నిర్ణయించుకొని.. గ్రౌండ్ ఆపరేషన్స్ కోసం సిద్ధమవుతోంది.

ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇజ్రాయెల్‌కు ఒక అల్టిమేటం జారీ చేశారు. గాజా స్ట్రిప్‌లో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ చేస్తున్న మారణహోమాన్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ‘‘పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ నేరాలు కొనసాగితే.. ముస్లిములను, వారి ప్రతిఘటన శక్తులను ఏ ఒక్కరూ ఎదుర్కోలేరు. కాబట్టి.. గాజాపై జరుగుతున్న బాంబు దాడుల్ని వెంటనే ఆపేయాలి’’ అని టెహ్రాన్‌లోని స్టూడెంట్ గ్రూప్స్‌కి ఖమేనీ చెప్పారు.


‘డెత్ టు ఇజ్రాయెల్’ అనే నినాదంతో.. గాజా స్ట్రిప్‌లో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ సృష్టిస్తోన్న మారణహోమాన్ని యావత్ ప్రపంచం చూస్తోందని చెప్పుకొచ్చారు. ప్రస్తుత సంక్షోభంపై మనమంతా స్పందించాలని ఖమేనీ పిలుపునిచ్చారు. గాజాలో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ చేస్తున్న అరాచకాలపై మనం ప్రతిస్పందించాలని అన్నారు. గాజాలో పాలస్తీనియన్లపై చేసిన నేరాలకు గాను ఇజ్రాయెల్ అధికారులు విచారనను ఎదుర్కోవాలని తెలిపారు.

ఇదిలావుండగా.. 1979 విప్లవం నుండి పాలస్తీనా వాదానికి ఇరాన్ మద్దతు ఇస్తోంది. షియా-ఆధిపత్య దేశమైన ఇరాన్.. తనని తాను ముస్లిం ప్రపంచానికి నాయకుడిగా ప్రకటించుకుంది. ఒకవైపు ఇరాన్ ‘హమాస్’ గ్రూపుకు నైతిక, ఆర్థిక మద్దతు ఇస్తున్నామని చెప్తుంటే.. మరోవైపు ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ మతాధికారుల పాలకులు హమాస్‌కు ఆయుధాలు సరఫరా చేసి, హింసను ప్రేరేపించారని చాలా కాలంగా ఆరోపిస్తూ వస్తోంది.

మరోవైపు.. ఇజ్రాయెల్ వైమానిక దళాలు గాజా స్ట్రిప్‌పై కురిపించిన బాంబుల వర్షం కారణంగా 2,800 మంది పాలస్తీనియన్లు మరణించారు. వారిలో నాలుగింట ఒక వంతు మంది పిల్లలు ఉన్నారు. గాజాలో మొత్తం 2.3 మిలియన్ జనాభా ఉండగా.. వారిలో నుంచి సగం మందిని గాజా నుంచి తరిమికొట్టారు. అంతేకాదు.. ఆహార, ఇంధన, విద్యుత్ సరఫరాలపై నిషేధం విధించి గాజాను దిగ్బంధించింది కూడా!

Updated Date - 2023-10-17T19:08:48+05:30 IST