Israel-Hamas War: పాలస్తీనియన్లకు ఇజ్రాయెల్ అల్టిమేటం.. గాజా నుంచి వెళ్లకపోతే..
ABN , First Publish Date - 2023-10-22T17:04:17+05:30 IST
ఇజ్రాయెల్, హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) మధ్య యుద్ధం 16వ రోజుకి చేరుకుంది. తొలుత 5 వేలకు పైగా రాకెట్ల దాడితో హమాస్ ఈ యుద్ధానికి శంఖం పూరించింది. భూమి, జల, వాయు మార్గాల్లో ఇజ్రాయెల్‌లోకి చొరబడి..
ఇజ్రాయెల్, హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) మధ్య యుద్ధం 16వ రోజుకి చేరుకుంది. తొలుత 5 వేలకు పైగా రాకెట్ల దాడితో హమాస్ ఈ యుద్ధానికి శంఖం పూరించింది. భూమి, జల, వాయు మార్గాల్లో ఇజ్రాయెల్‌లోకి చొరబడి.. సైనికులతో పాటు కొందరు ఇజ్రాయిలీ దేశస్థుల్ని చంపేశారు. వందలాది మందిని అపహరించుకుపోయారు. ఈ చర్యతో తీవ్రంగా మండిపడ్డ ఇజ్రాయెల్.. హమాస్‌తో యుద్ధం ప్రకటించింది. ఎదురుదాడులకు దిగి తన ప్రతీకారం తీర్చుకుంటోంది. హమాస్‌ని పూర్తిగా నాశనం చేయాలన్న లక్ష్యంతో దూసుకుపోతోంది. గాజా స్ట్రిప్‌పై దాడులను ముమ్మరం చేసింది. ఆ ప్రాంతంలో హమాస్ రహస్య స్థావరాలు ఎక్కడెక్కడున్నాయో గుర్తించి.. వైమానిక దాడులకు పాల్పడుతోంది.
ఈ నేపథ్యంలో.. గాజాలో ఉన్న పౌరులకు పెద్దగా నష్టం జరగకుండా ఉండేందుకు గాను ఉత్తర గాజాలో ఉంటున్న పాలస్తీనియన్లను అక్కడి నుంచి వెళ్లిపోవాలని తాజాగా కొత్త హెచ్చరిక జారీ చేసింది. ఉత్తర గాజాను వీడి, వెంటనే దక్షిణం వైపుకు వెళ్లాలని కోరింది. ఒకవేళ అలా చేయకపోతే మాత్రం.. ఉగ్రవాద సంస్థ (హమాస్) సహాయకులుగా (ఉగ్రవాదులుగా) పరిగణిస్తామని ఆ హెచ్చరికలో స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ సైన్యం జారీ చేసిన ఈ హెచ్చరిక కార్డుపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ లోగో గుర్తించబడింది. కేవలం ఈ హెచ్చరిక మాత్రమే కాదు.. మొబైల్ ఫోన్లలోనూ ఆడియో సందేశాల ద్వారా ఇటువంటి హెచ్చరికలు పంపిణీ చేయబడినట్టు తేలింది. గాజాలోని పాలస్తీనియన్ల ఇళ్లల్లో ఉగ్రవాదులు తలదాచుకుంటున్నారు. వారిని బయటకు తీసుకురావాలంటే, అక్కడుంటున్న ప్రజల్ని అక్కడి నుంచి పంపించాలని ఇజ్రాయెల్ నిర్ణయించుకుంది. అందుకే.. ఈ కొత్త హెచ్చరికను జారీ చేసినట్లు తెలిసింది.
ఇదే సమయంలో.. హమాస్‌తో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని దాడి చేయాలన్న ఉద్దేశం తమకు లేదని ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది. హమాస్ ఉగ్రవాదుల్ని అంతం చేయడమే తమ లక్ష్యంగా పేర్కొంది. అయితే.. వైమానిక దాడుల మధ్య ఉత్తర గాజాలో ఉన్న పాలస్తీనియన్లకు దక్షిణం వైపు వెళ్లడం ప్రమాదకరంగా మారింది. దీంతో.. ఏం చేయాలో పాలుపోక ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. మరోవైపు.. దక్షిణ గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 50 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఈ దాడుల్లో తాము ఎంతోమంది బంధువుల్ని కోల్పోయామంటూ పాలస్తీనియన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.