Israel vs Hamas: హమాస్‌తో ‘చివరి యుద్ధా’నికి ఇజ్రాయెల్ సిద్ధం.. రంగంలోకి లక్ష మంది సైనికులు.. గాజా కథ ముగిసినట్టేనా?

ABN , First Publish Date - 2023-10-09T17:34:29+05:30 IST

హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) తాను తీసిన గోతిలో తానే పడబోతోందా? అనవసరంగా ఇజ్రాయెల్‌తో కయ్యానికి కాలు దువ్విందా? తన అధీనంలో ఉన్న గాజాను చేజేతులా ఇజ్రాయెల్‌కు అప్పనంగా అప్పగించబోతోందా?

Israel vs Hamas: హమాస్‌తో ‘చివరి యుద్ధా’నికి ఇజ్రాయెల్ సిద్ధం.. రంగంలోకి లక్ష మంది సైనికులు.. గాజా కథ ముగిసినట్టేనా?

హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) తాను తీసిన గోతిలో తానే పడబోతోందా? అనవసరంగా ఇజ్రాయెల్‌తో కయ్యానికి కాలు దువ్విందా? తన అధీనంలో ఉన్న గాజాను చేజేతులా ఇజ్రాయెల్‌కు అప్పనంగా అప్పగించబోతోందా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. ఆ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తొలుత హమాస్ మెరుపుదాడి చేసి ఇజ్రాయెల్‌కు పెద్ద ఝలకే ఇచ్చింది కానీ, ఇప్పుడు ఇజ్రాయెల్ వేగంగా పుంజుకుంటోంది. అమెరికా సహకారంతో ఇది గాజాపై విజృంభిస్తోంది. యుద్ధం మొదైలన మూడు రోజుల వ్యవధిలోనే ఇది హమాస్ ఆక్రమించిన భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు మొత్తం గాజానే ఆక్రమించేందుకు సన్నద్ధమవుతోంది. ఇందుకోసం ఏకంగా ఒక లక్ష మంది సైనికుల్ని రంగంలోకి దింపింది.

అంతేకాదు.. గాజాపై పూర్తి దిగ్బంధనం విధించబోతున్నట్టు ఇజ్రాయెల్ సోమవారం ప్రకటించింది. ఆల్రెడీ గాజాకు విద్యుత్ సరఫరాను నిలిపివేసిన ఇజ్రాయెల్.. ఇప్పుడు ఆహార, ఇంధర సరఫరాలపై కూడా నిషేధం విధించింది. ఈ విషయంపై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ మాట్లాడుతూ.. ‘‘గాజా స్ట్రిప్‌ను పూర్తిగా సీజ్ చేయాలని నేను ఆదేశాలు జారీ చేశాను. ఇప్పుడు గాజాకు కరెంటు, తిండి, ఇంధనం సరఫరాలు ఉండవు. అన్ని మూసివేయడం జరిగింది. జంతువుల రూపంలో ఉన్న మనుషులతో మేము పోరాడుతున్నాం. కాబట్టి.. అందుకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది’’ అని చెప్పుకొచ్చారు. ఇజ్రాయెల్ తీసుకున్న ఈ నిర్ణయంతో గాజా ఊహించని సంక్షోభంలో పడిపోతుంది. ఓవైపు యుద్ధం, మరోవైపు సంక్షోభం మధ్య గాజా విలవిల్లాడటం ఖాయం.


దీనికితోడు.. లక్ష మంది సైనికులను బరిలోకి దిగి, హమాస్‌తో ఇజ్రాయెల్ చివరి యుద్ధానికి రెడీ అవుతోంది. అంటే.. హమాస్ అధీనంలో ఉన్న గాజాను సైతం పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఇప్పటికే తాము హమాస్ రహస్య స్థావరాల్ని పూర్తిగా ధ్వంసం చేస్తామంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హమాస్ గ్రూపు లేకుండా పూర్తిగా సర్వనాశనం చేసి, గాజాని కూడా ఆక్రమించాలని ఇజ్రాయెల్ పన్నాగం పన్నింది. మరి.. ఈ కుట్రని హమాస్ ఎదుర్కుంటుందా? లేకపోతు ఇజ్రాయెల్ ముందు లొంగిపోతుందా? అనేది తెలియాలంటే మాత్రం వేచి చూడాల్సిందే. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంలో భాగంగా.. ఇరువైపులా భారీగానే ప్రాణనష్టంతో పాటు ఆస్తినష్టం చవిచూడాల్సి వస్తోంది.

ఇదిలావుండగా.. ఇజ్రాయెల్ దేశం ఏర్పడినప్పటి నుంచి పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతూ వస్తోంది. చాలా అంశాల్లో ఈ రెండు దేశాల మధ్య సఖ్యత కుదరని పక్షంలో.. యుద్ధాలకు తలపడుతున్నాయి. అయితే.. యుద్ధం జరిగిన ప్రతీసారి ఇజ్రాయెల్ పైచేయి సాధిస్తూ వస్తోంది. క్రమంగా భూభాగాలను ఆక్రమిస్తూ.. తిరుగులేని దేశంగా అవతరిస్తూ వస్తోంది. తాజాగా హమాస్ మెరుపుదాడికి దిగడంతో.. ఆ మిలిటెంట్ గ్రూపు ఉనికే లేకుండా చేయాలని నిర్ణయించింది. అదే జరిగితే.. గాజా కథ కూడా దాదాపు ముగిసినట్టే అవుతుంది. అంటే.. అది కూడా ఇజ్రాయెల్‌లో కలిసిపోయే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2023-10-09T17:34:29+05:30 IST