Hamas-Israel War: హమాస్ నుంచి పలు భూభాగాల్ని తిరిగి స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్.. మూడు రోజుల్లో 1100 మందికి పైగా మృతి

ABN , First Publish Date - 2023-10-09T16:53:26+05:30 IST

శనివారం ఉదయం గాజా నుంచి హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ సంస్థ) చేసిన మెరుపుదాడితో ఇజ్రాయెల్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కేవలం 20 నిమిషాల వ్యవధిలో 5 వేలకు పైగా రాకెట్లను ప్రయోగించడంతో..

Hamas-Israel War: హమాస్ నుంచి పలు భూభాగాల్ని తిరిగి స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్.. మూడు రోజుల్లో 1100 మందికి పైగా మృతి

శనివారం ఉదయం గాజా నుంచి హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ సంస్థ) చేసిన మెరుపుదాడితో ఇజ్రాయెల్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కేవలం 20 నిమిషాల వ్యవధిలో 5 వేలకు పైగా రాకెట్లను ప్రయోగించడంతో.. ఇజ్రాయెల్ అతలాకుతలమైంది. అంతేకాదు.. భూమి, వాయు, జల మార్గాల్లో ముప్పేట దాడి చేయడంతో ఆ దేశం ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఈ క్రమంలోనే హమాస్ కొంత భూభాగాన్ని ఆక్రమించారు. ఇప్పుడు ఆ భూభాగాల్ని ఇజ్రాయెల్ సైన్యం తిరిగి స్వాధీనం చేసుకుంది. హమాస్ మెరుపుదాడితో ఖంగుతిన్న ఇజ్రాయెల్.. ఆ వెంటనే తిరిగి కోలుకొని ఎదురుదాడులకి దిగింది. ఈ నేపథ్యంలోనే.. హమాస్ మిలిటెంట్లను దెబ్బకొట్టి, వాళ్లు ఆక్రమించిన భూబాగాలపై తిరిగి నియంత్రణ సాధించగలిగారు.

అయితే.. మూడు రోజుల పోరాటంలో మాత్రం ఇరువైపులా 1,100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్‌లో 44 మంది సైనికులతో సహా 700 మందికి పైగా మరణించగా.. మిగతా మృతులు గాజాకు చెందిన పాలస్తీనవాళ్లు ఉన్నారు. తమపై హమాస్ దాడి చేసిన నేపథ్యంలో.. తొలుత ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆ మిలిటెంట్ గ్రూపుపై యుద్ధం ప్రకటించారు. అంతేకాదు.. హమాస్‌కు చెందిన రహస్య స్థావరాల్ని ధ్వంసం చేస్తానని ప్రతిజ్ఞ కూడా చేశారు. అటు.. ఆదివారం ఇజ్రాయెల్ సైతం హమాస్‌పై యుద్ధాన్ని అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం హమాస్, ఇజ్రాయెల్ సైన్యం మధ్య భీకర పోరు సాగుతోంది. ఆదివారం ఇజ్రాయెల్ వైమానిక దళాలు చేసిన దాడుల్లో.. గాజాలో కనీసం 493 మంది మృతి చెంది ఉంటారని అధికారులు నివేదించారు.


ఇదిలావుండగా.. ఆదివారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని అనేక మంది సభ్యులు ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని ఖండించారు. అయితే.. ఏకాభిప్రాయం లేకపోవడంపై అమెరికా విచారం వ్యక్తం చేసింది. ఈ అత్యవసర సమావేశంలో భాగంగా.. అమెరికా, ఇజ్రాయెల్ రెండూ పాలస్తీనా ఇస్లామిస్టులను ఖండించాల్సిందిగా పిలుపునిచ్చాయి. అటు.. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ‘హమాస్ చేసిన ఈ ఆకస్మిక దాడి నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు అదనపు మద్దతుని ఆదేశించారు. ఇప్పటికే రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్.. తూర్పు మధ్యధరా ప్రాంతంలో ఉన్న USS గెరాల్డ్ R ఫోర్డ్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్, యుద్ధనౌకల గ్రూపుకు ఇజ్రాయెల్‌కు సహాయం చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రాంతంలో యుద్ధ విమాన స్క్వాడ్రన్‌లను పెంచుతున్నట్లు కూడా తెలిపారు.

మరోవైపు.. ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడులను నిర్వహించడంలో ఇరాన్ కీలక పాత్ర పోషించినట్లు హమాస్, హిజ్బుల్లాకు చెందిన సీనియర్ అధికారులు పేర్కొన్నారు. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) అధికారులు, గాజాలోని హమాస్, హిజ్బుల్లాతో పాటు ఇరాన్ మద్దతు కలిగిన ఇతర మిలిటెంట్ గ్రూపుల ప్రతినిధులు.. ఇజ్రాయెల్‌పై దాడులకు సంబంధించి సమగ్ర చర్చలు జరిపినట్టు తేలింది. అయితే.. తమ మధ్య ఉన్న సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిందిగా పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశాలను రష్యా, చైనాలు సూచించాయి. అటు.. అమెరికా మాత్రం ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఆయుధాలను పంపుతోంది. చూస్తుంటే.. హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఇప్పుడప్పుడే ఆగిపోయేలా కనిపించడం లేదు.

ఈ యుద్ధానికి కారణం ఏంటి?

తూర్పు వెస్ట్ బ్యాంక్‌లోని జెరూసెలంలో ఉన్న అల్ అక్సా మసీదు ఇస్లాం మతస్తుల వారికి ఎంతో పవిత్రమైంది. మక్కా, మదీనా తర్వాత ఈ అల్ అక్సాను ముస్లిములు ఎంతో గౌరవప్రదంగా భావిస్తారు. అయితే.. ఈ అల్ అక్సా విషయంలో ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య సఖ్యత కుదరడం లేదు. దీంతో పాటు ఇతర అనేక అంశాల్లోనూ ఈ రెండు దేశాల మధ్య వివాదం కొనసాగుతోంది. అందుకే.. ఇరుదేశాల మధ్య చిన్నవిగానో, పెద్దవిగానో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు హమాస్ చేసిన మెరుపుదాడులకు కూడా అదే కారణమని తెలుస్తోంది. 2021లోనూ హమాస్, ఇజ్రాయెల్ మధ్య 11 రోజుల పాటు భీకర యుద్ధం కొనసాగింది. ప్రస్తుత యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో కాలమే సమాధానం చెప్పాలి.

Updated Date - 2023-10-09T16:53:26+05:30 IST