Israel-Hamas War: హమాస్‌తో యుద్ధం వేళ.. భారత్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన ఇజ్రాయెల్ రాయబారి
ABN , First Publish Date - 2023-10-17T17:48:57+05:30 IST
హమాస్‌తో యుద్ధం జరుగుతున్న వేళ ఇజ్రాయెల్‌కు భారతదేశం మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. ఇజ్రాయెల్ అధికారులు, నటీనటులు సైతం భారత్‌పై ప్రశంసలు కురిపిస్తూ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా...
హమాస్‌తో యుద్ధం జరుగుతున్న వేళ ఇజ్రాయెల్‌కు భారతదేశం మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. ఇజ్రాయెల్ అధికారులు, నటీనటులు సైతం భారత్‌పై ప్రశంసలు కురిపిస్తూ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా భారత్‌లో ఉన్న ఇజ్రాయెల్ రాయబారి నౌర్ గిలోన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతదేశాన్ని ఇజ్రాయెల్ విశ్వసిస్తుందని, దానికి చాలా విశ్వసనీయత ఉందని ఫేర్కొన్నారు. హమాస్ ఉగ్రదాడులు చేసిన వెంటనే భారత్ దాన్ని ఖండించి.. ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరించే విషయంలో అది టేబుల్‌లో చోటు సంపాదించిందని అన్నారు. అక్టోబర్ 7వ తేదీన ప్రారంభమైన ఈ యుద్ధంలో ఇప్పటివరకూ 4వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. దీనంతటికీ ఇరాన్ కారణమని ఆయన నిందించారు.
పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య దశాబ్దాల నుంచి కొనసాగుతున్న సమస్యను పరిష్కరించడం అంత సులువు కాదని.. అయితే ప్రస్తుత సంక్షోభాన్ని మాత్రం వెంటనే పరిష్కరించుకోవాల్సి ఉందని గిలోన్ అభిప్రాయపడ్డారు. కొన్ని దశాబ్దాల నుంచి భారత్, ఇజ్రాయెల్ మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయని.. ఈ క్రమంలోనే భారత్ విశ్వసనీయతను సంపాదించుకుందని తాను విశ్వసిస్తున్నానని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీకి ఇజ్రాయెల్‌లో మంచి గౌరవం ఉందని చెప్పారు. ఇటీవల తాను కొన్ని సర్వేలు చూశానని.. వాటి ఆధారంగా ఇజ్రాయిలీలు భారత్ పట్ల అత్యంత సానుకూల దృక్పథాన్ని కలిగి ఉన్నారని తాను గుర్తించానని అన్నారు. హమాస్‌తో యుద్ధం జరుగుతున్న వేళ.. భారతదేశం వెంటనే అద్భుతమైన ఎమోషనల్ సపోర్ట్ అందించిందని కొనియాడారు.
హమాస్ దాడులు చేసిన మొదట్లో చాలామంది వీటిని ఖండించలేదని.. కానీ ప్రధాని మోదీ, భారతదేశం మాత్రం వెంటనే ఈ దాడుల్ని ఖండిస్తూ తమకు మద్దతు తెలిపారని గిలోన్ వ్యాఖ్యానించారు. దీంతో వాళ్లు ఇజ్రాయెల్ విశ్వసనీయతను మరింత చూరగొన్నారని.. అక్కడి పరిస్థితిని వెంటనే అర్థం చేసుకోగలిగారని వెల్లడించారు. భారతదేశాన్ని ఇజ్రాయెల్ కచ్ఛితంగా విశ్వసిస్తుందని.. ప్రస్తుత సంక్షోభంలో భారత్ జోక్యం చేసుకోవడం తమకేమీ సమస్య కాదని అన్నారు. తాము భారత్‌ని పూర్తిగా నమ్ముతున్నామని బల్లగుద్ది మరీ చెప్పారు. అంటే.. హమాస్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందన్న అభిప్రాయాన్ని గిలోన్ చెప్పకనే చెప్పేశారు. పరోక్షంగా భారత్ మద్దతు కోరుతున్నారు.
ఇదే సమయంలో.. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఇజ్రాయెల్ నుంచి 1000 మంది భారతీయులను తాము సురక్షితంగా తరలించామని గిలోన్ వివరించారు. ఇంకా 20 వేల మంది అక్కడే ఉన్నారని, అయితే వాళ్లు ఇజ్రాయెల్ విడిచి వెళ్లడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదని చెప్పుకొచ్చారు. ఎవరైతే అక్కడి నుంచి తిరిగిరావాలని అనుకుంటున్నారో, వారిని క్షేమంగా తరలించడంలో తమవంతు కృషి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. అటు.. ఆపరేషన్ అజయ్‌లో భాగంగా భారత ప్రభుత్వం ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయుల్ని క్షేమంగా తిరిగి భారత్‌కి తీసుకొస్తున్న విషయం తెలిసిందే.