Share News

World War 3: ఆ పని చేయకపోతే మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది.. ఇజ్రాయెల్ రచయిత హెచ్చరిక

ABN , First Publish Date - 2023-10-16T20:40:56+05:30 IST

అటు రష్యా-ఉక్రెయిన్, ఇటు హమాస్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధాలు జరుగుతున్న తరుణంలో.. ఇజ్రాయెల్ రచయిత, చరిత్రకారుడు యువల్ నోహ్ హరారీ ఒక హెచ్చరిక జారీ చేశాడు. ఉక్రెయిన్‌లో యుద్ధం జరుగుతున్న తరుణంలో...

World War 3: ఆ పని చేయకపోతే మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది.. ఇజ్రాయెల్ రచయిత హెచ్చరిక

అటు రష్యా-ఉక్రెయిన్, ఇటు హమాస్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధాలు జరుగుతున్న తరుణంలో.. ఇజ్రాయెల్ రచయిత, చరిత్రకారుడు యువల్ నోహ్ హరారీ ఒక హెచ్చరిక జారీ చేశాడు. ఉక్రెయిన్‌లో యుద్ధం జరుగుతున్న తరుణంలో హమాస్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం విస్తృత ప్రాంతీయ సంఘర్షణగా మారవచ్చని, ఇది ఇతర దేశాల్ని ఇందులోకి లాగే ప్రమాదం ఉందని అన్నాడు. తద్వారా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగిపోయి.. మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉందని సూచించాడు. కరోనా మహమ్మారి, ఉక్రెయిన్‌లో యుద్ధం, ఇప్పుడు ఇజ్రాయెల్-గాజా యుద్ధం తర్వాత గ్లోబల్ అస్థిరత ఎక్కువగా ఉందని.. ఇది మరిన్ని దేశాలను దానిలోకి లాగొచ్చని.. చివరికి ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయొచ్చని పేర్కొన్నాడు.

ఒక ఇంటర్వ్యూలో హరారీ మాట్లాడుతూ.. ‘‘గత ఐదు, పది సంవత్సరాల నుంచి పరిస్థితుల్ని గమనిస్తే ఒక ఆర్డర్ కుప్పకూలుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. దాంతో మొత్తం గందరగోళ వాతావరణం క్రమంగా నెలకొంటూ వస్తోంది. ఇందులో కరోనా మహమ్మారి కూడా ఒక భాగమే. అలాగే.. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధమూ ఒక భాగమే’’ అని అన్నాడు. ఇప్పుడు తాజాగా ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య నెలకొన్న సంఘర్షణ సైతం అందులో భాగమేనని తెలిపాడు. ఒకవేళ మనం ఆ ఆర్డర్‌ని తిరిగి పునర్నిర్మించకపోతే.. పరిస్థితులు మరింత దారుణంగా తయారవుతాయని హెచ్చరించాడు. అప్పుడది క్రమంగా ప్రపంచమంతా వ్యాప్తి చెంది, మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే ఛాన్స్ ఉందని చెప్పాడు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక ఆయుధాలు, సాంకేతికత రోజుల్లో మూడో ప్రపంచ యుద్ధం జరిగితే.. అది మానవజాతి వినాశనానికి దారితీస్తుందని చెప్పుకొచ్చాడు.


ఇదిలావుండగా.. అక్టోబర్ 7వ తేదీన పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు హమాస్ 5వేల రాకెట్లతో ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేయడంతో హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం మొదలైంది. తొలుత హమాస్ ఇచ్చిన ఝలక్‌కు కాస్త వెనక్కు తగ్గిన ఇజ్రాయెల్.. ఆ వెంటనే తేరుకొని హమాస్‌ని నిర్మూలించడమే లక్ష్యంగా దూసుకుపోతోంది. ఇందులో భాగంగానే గాజా‌‌ని దిగ్బంధించింది. ఆహారం, విద్యుత్, ఇంధన సరఫరాలపై నిషేధం విధించడమే కాదు.. ఎలాంటి మానవతా సహకారం అందించమని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది. హమాస్ రహస్య స్థావరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. గ్రౌండ్ ఆపరేషన్స్ కూడా నిర్వహిస్తోంది. అటు.. హమాస్ కూడా తగ్గేదే లేదన్నట్టుగా పోరాటం కొనసాగిస్తోంది. అయితే.. ఈ యుద్ధంలో ఇరువైపులా వేలాదిమంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.

Updated Date - 2023-10-16T20:40:56+05:30 IST