Israel Hamas War: 60 మంది హమాస్ యోధుల్ని చంపి 250 మంది బందీలను రక్షించిన ఇజ్రాయెల్ సైనికులు.. వీడియో వైరల్
ABN , First Publish Date - 2023-10-13T17:11:09+05:30 IST
శనివారం తమపై మెరుపుదాడులు చేయడం, లోనికి చొరబడి కొందరు పౌరుల్ని అపహరించుకుపోవడంతో.. హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు)పై ఇజ్రాయెల్ ప్రతీకారదాడులకు ఎగబడింది. గాజాలోని..
శనివారం తమపై మెరుపుదాడులు చేయడం, లోనికి చొరబడి కొందరు పౌరుల్ని అపహరించుకుపోవడంతో.. హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు)పై ఇజ్రాయెల్ ప్రతీకారదాడులకు ఎగబడింది. గాజాలోని హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకొని, బాంబుల వర్షం కురిపిస్తోంది. గాజాలో తలదాచుకున్న హమాస్ ఉగ్రవాదుల్ని వెతికి మరీ వారిని హతమారుస్తోంది. అలాగే.. బందీలుగా ఉంచుకున్న తమ ఇజ్రాయెల్ పౌరుల్ని రక్షించే పనిలో నిమగ్నమైంది.
ఇందులో భాగంగానే తాజాగా నిర్వహించిన ఒక ఆపరేషన్‌లో.. ఇజ్రాయెల్ దళాలు (ఐడీఎఫ్) 250 బందీలను సురక్షితంగా రక్షించడంలో విజయవంతం అయ్యారు. ఈ సమయంలోనే వాళ్లు 60 మంది హమాస్ యోధుల్ని కూడా చంపేశారు. తాము హమాస్ బారి నుండి 250 మంది బందీలను సజీవంగా రక్షించామంటూ ట్విటర్ మాధ్యమంగా పోస్ట్ చేస్తూ.. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోని షేర్ చేశారు. ‘‘అక్టోబర్ 7వ తేదీన సుఫా మిలిటరీ పోస్ట్‌పై నియంత్రణ సాధించేందుకు ఉమ్మడి ప్రయత్నాల్లో భాగంగా ఫ్లోటిల్లా 13 స్పెషల్ యూనిట్‌ను గాజా భద్రతా కంచె చుట్టూ ఉన్న ప్రాంతానికి మోహరించారు. దాదాపు 250 మంది బందీలను రక్షించడం జరిగింది. ఈ ఆపరేషన్‌లో 60 మందికి పైగా హమాస్ యోధులు మరణించగా, 26 మంది సజీవంగా పట్టుబడ్డారు’’ అంటూ రాసుకొచ్చారు.
పట్టుబడిన ఉగ్రవాదుల్లో హమాస్ సదరన్ నావల్ డివిజన్ డిప్యూటీ కమాండర్ ముహమ్మద్ అబు అలీ కూడా ఉన్నాడు. దాదాపు ఒక నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో కాల్పుల మధ్య ఇజ్రాయెల్ భద్రతా దళాలు ప్రతీకారం తీర్చుకోవడం చూడవచ్చు. ఇజ్రాయెల్ సైనికుల బృందం ఒక భవనంలోకి వెళ్లడం.. బంకర్‌లోకి ప్రవేశించి అక్కడున్న బందీలను కాపాడటం మనం చూడొచ్చు. కాగా.. ఇజ్రాయెల్ బాంబు దాడిలో ఇప్పటివరకు 1500 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. అటు.. హమాస్ దాడుల్లో 1,300 మందికి పైగా ఇజ్రాయిలీలు మరణించారు.