4 Idiots: పరువు తీసిన 4 ఇడియట్స్.. ఏకంగా దేశమే దిగొచ్చింది.. అసలేమైందంటే?

ABN , First Publish Date - 2023-08-20T21:02:11+05:30 IST

కొన్ని ఘటనలు చూడ్డానికి చాలా చిన్నవిగా అనిపించినా.. వాటి ప్రభావం మాత్రం తారాస్థాయిలో ఉంటుంది. ఏకంగా దేశమే దిగిరావాల్సిన పరిస్థితి కూడా ఏర్పడొచ్చు. ఇందుకు తాజా ఉదంతాన్నే ఉదాహరణగా...

4 Idiots: పరువు తీసిన 4 ఇడియట్స్.. ఏకంగా దేశమే దిగొచ్చింది.. అసలేమైందంటే?

కొన్ని ఘటనలు చూడ్డానికి చాలా చిన్నవిగా అనిపించినా.. వాటి ప్రభావం మాత్రం తారాస్థాయిలో ఉంటుంది. ఏకంగా దేశమే దిగిరావాల్సిన పరిస్థితి కూడా ఏర్పడొచ్చు. ఇందుకు తాజా ఉదంతాన్నే ఉదాహరణగా తీసుకోవచ్చు. నలుగురు ఇడియట్స్ కలిసి చేసిన ఒక చెత్త పని కారణంగా.. దేశం పరువే పోయింది. రెస్టారెంట్ బిల్లు కట్టనందుకు.. ఏకంగా దేశమే దిగి రావాల్సి వచ్చింది. ఆ ఇడియట్స్ చేసిన తప్పుని సరిదిద్ది.. తన పరువు కాపాడుకుంది. పదండి.. యావత్ ప్రపంచాన్నే సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిన ఈ సంఘటన వివరాలేంటో తెలుసుకుందాం..

ఇటలీకి చెందిన నలుగురు స్నేహితులు.. పర్యాటక ప్రాంతాలకు ప్రసిద్ధి చెందిన అల్బేనియా దేశాన్ని సందర్శించడానికి వెళ్లారు. అక్కడ కొన్ని ప్రాంతాల్ని సందర్శించిన వాళ్లు.. ఒక రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ తమకు ఇష్టమైన వంటకాల్ని భుజించారు. కడుపునిండా తిన్న తర్వాత భోజనం చాలా బాగుందని రెస్టారెంట్ యాజమాన్యాన్ని అభినందించారు కూడా! కానీ.. బిల్లు మాత్రం కట్టకుండా అక్కడి పరారయ్యారు. ఇప్పుడే వస్తామని చెప్పి బయటకు వెళ్లిన వాళ్లు.. అక్కడి నుంచి అటే వెళ్లిపోయారు. మళ్లీ వెనక్కు తిరిగి రాలేదు. ఇది ఎప్పుడు జరిగిందో తెలీదు కానీ, వాళ్లు పారిపోయే దృశ్యాలు మాత్రం సెక్యూరిటీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.


అసలే బిల్లు కట్టలేదన్న కోపంలో ఉన్న యాజమాన్యం.. ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బిల్లు కట్టకుండా నలుగురు ఇటాలియన్లు పారిపోయారని ఆ వీడియోకి క్యాప్షన్ పెట్టింది. దీంతో.. ఆ వీడియో నెట్టింట్లో బాగా వైరల్ అయ్యింది. ఈ వ్యవహారాన్ని ‘డైన్ అండ్ డ్యాష్’గా పరిగణించారు. ఈ ఘటనపై రెస్టారెంట్ యజమాని కూడా ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. నలుగురు ఇటాలియన్లు తమ రెస్టారెంట్‌లో భోజనం చేసి, బిల్లు కట్టకుండా వెళ్లిపోయాడన్నారు. తమ రెస్టారెంట్‌లో భోజనం చేసి, బిల్లు కట్టకుండా వెళ్లిపోవడం ఇదే మొదటిసారి అని ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

ఈ డైన్ అండ్ డ్యాష్ ఇష్యూ ఎంత వైరల్ అయ్యిందంటే.. ఇది అల్బేనియా ప్రధాని ఎడి రామా దాకా వెళ్లింది. ఈ నేపథ్యంలోనే.. అల్బేనియా పర్యటనకు ఇటాలియన్ ప్రధాని జార్జియా మెలోని వెళ్లినప్పుడు, ఈ డైన్ అండ్ డ్యాష్ వ్యవహారాని ఎడి రామా ప్రస్తావించారు. దీంతో అవమానంగా భావించిన మెలోని.. ఇటాలియన్ రాయబారిని బిల్లు కట్టాల్సిందిగా ఆదేశించారు. ‘‘ఆ ఇడియట్స్ కోసం బిల్లు కట్టండి’’ అని ఆమె చెప్పారు. దీంతో.. వెంటనే ఇటాలియన్ రాయబారి ఆ బిల్లు కట్టేశారు. ఇంతకీ ఆ రెస్టారెంట్ బిల్లు ఎంతో తెలుసా.. మన ఇండియన్ కరెన్సీలో కేవలం రూ.7,245 మాత్రమే!

బిల్లు కట్టేసిన అనంతరం ఇటాలియన్ రాయబారి ఒక స్టేట్‌మెంట్ విడుదల చేసింది. ఇటాలియన్లు నిబంధనల్ని గౌరవిస్తారని, తమ రుణాల్ని వెంటనే చెల్లిస్తారని అందులో పేర్కొంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కావన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. అలాగే.. మెలోనితో పాటు అల్బేనియా పర్యటనకు వెళ్లిన ఇటలీ వ్యవసాయ మంత్రి కూడా ఈ ఘటనపై స్పందించారు. బిల్లును చెల్లించడం గర్వించదగ్గ విషయమని, కొంతమంది నిజాయితీ లేని వ్యక్తులు తమ దేశ పరువుని తీయలేరని పేర్కొన్నారు.

Updated Date - 2023-08-20T21:49:05+05:30 IST