Giorgia Meloni: ఇస్లాం మతంపై ఇటలీ ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు.. వీడియో వైరల్
ABN , Publish Date - Dec 18 , 2023 | 04:06 PM
ఇస్లాం మతంపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇస్లాం సంస్కృతి యూరోపియన్ హక్కులు, విలువలకు సమానంగా లేదని.. ఆ రెండింటికీ చాలా తేడాలు ఉన్నాయని...
Italy PM Giorgia Meloni On Islam: ఇస్లాం మతంపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇస్లాం సంస్కృతి యూరోపియన్ హక్కులు, విలువలకు సమానంగా లేదని.. ఆ రెండింటికీ చాలా తేడాలు ఉన్నాయని ఆ వీడియోలో ఆమె పేర్కొన్నారు. తమ నాగరికత చాలా భిన్నమైనదని, అందుకే యూరోప్‌లో ఇస్లాంకు చోటు లేదని, ఇటలీలో షరియా చట్టాన్ని అమలు చేయకూడదని చెప్పుకొచ్చారు.
‘‘ఇస్లామిక్ సంస్కృతికి.. మా యూరోపియన్ నాగరికత విలువలు, హక్కులకి చాలా తేడాలు ఉన్నాయి. ఇటలీలో షరియా చట్టాన్ని అమలు చేయడానికి ఏమాత్రం అనుమతించం. మా నాగరికత విలువలు చాలా భిన్నమైవని’’ అని ఆ వీడియోలో జార్జియా మెలోనీ అన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ.. ఇటలీలో ఉన్న చాలా ఇస్లామిక్ సాంస్కృతిక కేంద్రాలకు సౌదీ అరేబియా నిధులు సమకూరుస్తోందని ఆరోపించారు. ఇది తప్పని, ఈ విషయంలో తనకు మంచి అభిప్రాయం లేదని అన్నారు. ఇదే సమయంలో సౌదీ అరేబియాలో అమలు చేస్తున్న కఠినమైన షరియా చట్టాన్ని కూడా ఆమె విమర్శించారు.
సౌదీ అరేబియా అత్యంత కఠినమైన షరియా చట్టాన్ని అమలు చేస్తోందని.. ఈ చట్టంలో మతభ్రష్టత్వం, స్వలింగసంపర్కం వంటి వాటిని తీవ్ర నేరాలకు పరిగణిస్తున్నారని.. వ్యభిచారానికి కూడా కఠిన శిక్షలు విధిస్తున్నారని జార్జియా మెలోనీ చెప్పారు. ఇందుకు వ్యతిరేకంగా గళమెత్తాల్సిన అవసరం ఉందని తాను నమ్ముతున్నానన్నారు. ఐరోపా నాగరికత విలువలకు ఇస్లాం చాలా దూరంగా ఉందని.. ఈ విధంగా సారూప్యత సమస్య తలెత్తుతోందని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.