Share News

Israel-Hamas War: పిల్లల్ని చంపడం ఆపాలన్న జస్టిన్ ట్రూడో.. ఘాటుగా స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని

ABN , First Publish Date - 2023-11-15T15:02:26+05:30 IST

హమాస్ దాడులకు ప్రతీకారంగా గాజాలో ఇజ్రాయెల్ కురిపిస్తున్న బాంబులు, చేపట్టిన కఠిన చర్యల కారణంగా.. ఆ ప్రాంతంలోని సామన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా.. అభంశుభం తెలియని చిన్నపిల్లలు, మహిళలు బలి అవుతున్నారు.

Israel-Hamas War: పిల్లల్ని చంపడం ఆపాలన్న జస్టిన్ ట్రూడో.. ఘాటుగా స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని

Israel-Hamas War: హమాస్ దాడులకు ప్రతీకారంగా గాజాలో ఇజ్రాయెల్ కురిపిస్తున్న బాంబులు, చేపట్టిన కఠిన చర్యల కారణంగా.. ఆ ప్రాంతంలోని సామన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా.. అభంశుభం తెలియని చిన్నపిల్లలు, మహిళలు బలి అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఈ యుద్ధాన్ని ఆపాలని, ఇరువర్గాలు కాల్పుల విరమణకు పిలుపునివ్వాలని ప్రపంచ దేశాలు కోరుతున్నారు. తాజాగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా అదే అభ్యర్థన చేశారు. యుద్ధం కారణంగా గాజాలోని మహిళలు, చిన్నపిల్లలు అన్యాయంగా చనిపోతున్నారని.. ఇజ్రాయెల్ సంయమనం పాటించాలని అన్నారు. స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్ని ప్రపంచమంతా చూస్తోంది. ఈ యుద్ధం కారణంగా ఎంతోమంది అన్యాయంగా చనిపోతున్నారు. మహిళలు, చిన్నారులు సైతం హత్యలకు గురవుతున్నారు. ఈ చర్యల్ని తక్షణమే ఆపాలి’’ అని ట్రూడో చెప్పుకొచ్చారు. గాజాలో సామాన్య పౌరుల మరణాలకు ఇజ్రాయెల్ చర్యలే కారణమన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో.. హమాస్‌ని ఉద్దేశించి కూడా ట్రూడో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌పై దాడులు జరిపినప్పుడు అక్కడి ప్రజల్ని బందీలుగా తీసుకెళ్లిన హమాస్.. ఈ యుద్ధంలో వారిని అడ్డం పెట్టుకొని రక్షణ పొందడం ఏమాత్రం సబబు కాదన్నారు. బందీలుగా ఉంచుకున్న ఇజ్రాయెల్ పౌరుల్ని వెంటనే విడిచిపెట్టాలని చెప్పారు.


ఈ విధంగా ట్రూడో చేసిన వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఘాటుగా స్పందించారు. గాజాలో సామాన్య పౌరుల మరణాలకు హమాస్‌దే బాధ్యత అని, ఇజ్రాయెల్‌కి కాదని తేల్చి చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే హమాస్ సామాన్య పౌరులను ఇబ్బందులకు గురి చేస్తోందని, ఊచకోత కోస్తోందని పేర్కొన్నారు. పౌరులకు హాని కలిగించకుండా ఉండేందుకు ఇజ్రాయెల్ ప్రతీదీ చేస్తోందని, కానీ హమాస్ మాత్రం అందుకు భిన్నంగా పౌరులకు హాని కలిగిస్తోందని ఆరోపించారు. సేఫ్ జోన్లలో ఉన్న గాజా పౌరులకు ఇజ్రాయెల్ ‘మానవతా కారిడార్లు’ అందిస్తుంటే.. హమాస్ వాటిని అడ్డుకుంటోందని తూర్పారపట్టారు. హమాస్‌ని ఓడించేందుకు ప్రపంచదేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతివ్వాలని కోరారు.

ఇదిలావుండగా.. అక్టోబర్ 7వ తేదీన హమాస్ చేసిన మెరుపుదాడుల కారణంగా ఈ యుద్ధం ప్రారంభమైంది. భూమి, వాయు, జల మార్గాల ద్వారా ఇజ్రాయెల్‌లోకి చొరబడి.. పౌరుల్ని చంపడంతో పాటు వందలాది మందిని అపహరించుకుపోయారు. ఇందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాపై విరుచుకుపడుతోంది. హమాస్‌ని పూర్తిగా తుడిచిపెట్టేయాలన్న లక్ష్యంతో.. వైమానిక దాడులు, గ్రౌండ్ ఆపరేషన్స్ నిర్వహిస్తోంది. ప్రస్తుతం గాజాలోని అతిపెద్ద ఆసుపత్రి ‘అల్-షిఫా’ కేంద్రంగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర పోరు సాగుతోంది.

Updated Date - 2023-11-15T15:02:28+05:30 IST