Share News

Kim Jong Un: జననాల రేటు తగ్గుదలపై కిమ్ ఆందోళన.. తల్లులు ఆ పని చేయాలంటూ సూచన

ABN , First Publish Date - 2023-12-04T22:59:24+05:30 IST

జననాల రేటు గణనీయంగా పడిపోతున్న దేశాల్లో ఉత్తర కొరియా ఒకటి. ఆర్థిక సమస్యలు, కుటుంబ పోషణ భారం, పెళ్లిళ్లపై యువత ఆసక్తి కోల్పోవడం వంటి కారణాల వల్ల.. ఆ దేశంలో జనన రేటు క్రమంగా క్షీణిస్తూ వస్తోంది.

Kim Jong Un: జననాల రేటు తగ్గుదలపై కిమ్ ఆందోళన.. తల్లులు ఆ పని చేయాలంటూ సూచన

Kim Jong Un On Birth Rate: జననాల రేటు గణనీయంగా పడిపోతున్న దేశాల్లో ఉత్తర కొరియా ఒకటి. ఆర్థిక సమస్యలు, కుటుంబ పోషణ భారం, పెళ్లిళ్లపై యువత ఆసక్తి కోల్పోవడం వంటి కారణాల వల్ల.. ఆ దేశంలో జనన రేటు క్రమంగా క్షీణిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే.. జనన రేటుని పెంపొందించేందుకు ఉత్తర కొరియా తనదైన ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ రంగంలోకి దిగి.. జనన రేటు పెంచాలని దేశ ప్రజలకు కిమ్‌ పిలుపునిచ్చారు. ప్యాంగాంగ్‌లో తల్లుల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈమేరకు ఆయన సూచనలు ఇచ్చారు.


కొన్నేళ్లుగా జనాభా రేటు క్షీణిస్తుండడంపై ఆందోళన వ్యక్తం చేసిన కిమ్ జోంగ్ ఉన్.. ఇది కేవలం దేశ సమస్య మాత్రమే కాదని, ప్రతి ఒక్కరి ఇంటి సమస్య అని పేర్కొన్నారు. జనన క్షీణతను నిలువరించడం ఎంతో ముఖ్యమని.. ఇప్పుడు జననాల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఇదే సమయంలో.. పిల్లల పెంపకంపై తల్లులకు పలు సూచనలు ఇచ్చారు. పిల్లల్ని సరైన రీతిలో పెంచాలని.. వారి సంరక్షణ తల్లుల బాధ్యత అని పేర్కొన్నారు. అలాగే.. జాతీయ శక్తిని మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న తల్లులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీతో పాటు దేశ కార్య‌క‌లాపాల్లో ఇబ్బందులు ఎదురైనప్పుడు.. తాను కూడా తల్లుల గురించి ఆలోచిస్తానని కిమ్ జోంగ్ ఉన్ అన్నారు.

కాగా.. ఈ ఏడాదిలో ఉత్తర కొరియాలో సగటు జనన రేటు 1.8 శాతంగా ఉందని యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ నివేదించింది. ఈ లెక్కన.. ఆ దేశంలోని తల్లులు కేవలం ఒకరు లేదా ఇద్దరు పిల్లల్ని మాత్రమే కంటున్నారు. గతంతో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువ అని తేలింది. దాదాపు 25 మిలియన్ల జనాభా ఉన్న ఉత్తర కొరియా.. ఇటీవలి దశాబ్దాల్లో తీవ్రమైన ఆహార కొరతతో పోరాడవలసి వస్తోంది. 1990ల కాలంలో వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. దాంతో ఆ దేశంలో తీవ్ర కరువు సంభవించింది. జనన రేటు క్షీణతకు ఇది కూడా ఒక కారణమే!

Updated Date - 2023-12-04T22:59:26+05:30 IST