Kabul: మిలటరీ ఎయిర్‌పోర్టు బయట పేలుడు.. పలువురి మృతి
ABN , First Publish Date - 2023-01-01T18:44:14+05:30 IST
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్(Kabul) మరోమారు పేలుళ్లతో దద్దరిల్లింది. మిలటరీ విమానాశ్రయం బయట జరిగిన భారీ బాంబు పేలుడులో పలువురు ప్రాణాలు కోల్పోయారు.
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్(Kabul) మరోమారు పేలుళ్లతో దద్దరిల్లింది. మిలటరీ విమానాశ్రయం బయట జరిగిన భారీ బాంబు పేలుడులో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఉదయం పేలుడు సంభవించినట్టు అధికారులు తెలిపారు. ఈ పేలుడులో పలువురు పౌరులు ప్రాణాలు కోల్పోయినట్టు చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతున్నట్టు వివరించారు. పేలుడుకు గల కారణాలు తెలియరాలేదు.
ఉదయం 8 గంటల సమయంలో మిలిటరీ వైపున భారీ శబ్దంతో బాంబు పేలుడు సంభవించినట్టు ‘రాయిటర్స్’ పేర్కొంది. వెంటనే ఆ ప్రాంతాన్ని దిగ్బంధించిన భద్రతా దళాలు అన్ని రోడ్లను మూసివేశాయి. గతేడాది డిసెంబరు12న గుర్తు తెలియని సాయుధుడు.. చైనా వ్యాపారవేత్తలకు ప్రసిద్ధి చెందిన లాంగాన్ హోటల్‌పై దాడిచేశాడు. ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan)ను తాలిబన్లు(Taliban) స్వాధీనం చేసుకున్న తర్వాత భద్రతను కట్టుదిట్టం చేశామని చెబుతున్నప్పటికీ బాంబు పేలుళ్లు, దాడులు సర్వసాధారణంగా మారాయి. వీటిలో చాలా వరకు తమ పనేనని స్థానిక ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ప్రకటించుకుంటోంది.