Turkey Earthquake: టర్కీలో మృత్యుఘంటికలు.. భారీ భూకంపంలో 50 మందికి పైగా మృతి
ABN , First Publish Date - 2023-02-06T10:44:12+05:30 IST
టర్కీని భారీ భూకంపం కుదిపేసింది. దక్షిణ టర్కీలోని గజియాన్‌టెప్ సమీపంలో శక్తివంతమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.8గా నమోదైంది. పలు భవానాలు..
అంకారా: టర్కీ (Turkey)ని భారీ భూకంపం (Earthquake) కుదిపేసింది. దక్షిణ టర్కీలోని గజియాన్‌టెప్ సమీపంలో శక్తివంతమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.8గా నమోదైంది. పలు భవానాలు కుప్పకూలడంతో సుమారు 50 మంది మరణించినట్టు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. విధ్వంస తీవ్రత ఆధారంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం తెల్లవారుజామున 4.17 గంటల సమయంలో భూప్రకంపనలు సంభవించాయి. నరుద్గీకి 23 కిలోమీటర్ల దూరంలో, భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించినట్టు యూజి జియాలాజికల్ సర్వే తెలిపింది.
భూకంప తీవ్రతకు పలు ప్రాంతాల్లో భవనాలు, అపార్ట్‌మెంట్లు కూలిపోయాయని, భారీ ఆస్తినష్టం జరిగినట్టు వార్తలు వెలువడ్డాయి. ప్రజలు హాహాకారాలు చేస్తూ రోడ్లపైకి పరుగులు తీశారు. భారీ భూకంపం తర్వాత హైఅలర్ట్ ప్రకటించినట్టు టర్కీ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. సిప్రస్, టర్కీ, గ్రీస్, జోర్డాన్, లెబనాన్, సిరియా, యూకే, ఐరాక్, జార్జియాలోనూ భూకంపం సంభవించింది. ఉత్తర నగరం అలెప్పో, సెంట్రల్ సిటీ హమాలో కొన్ని భవనాలు కుప్పకూలినట్లు సిరియా ప్రభుత్వ మీడియా పేర్కొంది. ప్రాణనష్టంపై ఎలాంటి సమాచారం లేదు. బీరూట్, డమాస్కస్‌లలో అపార్ట్‌మెంట్లు, భవనాలు కంపించడంతో స్థానిక ప్రజలు భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. మృతుల వివరాలు వెంటనే తెలియలేదు. టర్కీలో భౌగోళిక పరిస్థితుల రీత్యా తరచు భూకంపలు సంభవిస్తుంటారు. టర్కీలో గత మూడేళ్లలో 18 మంది భూకంపాల కారణంగా మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈశాన్య టర్కీలో 1999లో సంభవించిన భారీ భూకంపంలో 17,000 మందికి పైగా మరణించారు.
టర్కీలోని 10 నగరాలపై భూకంప ప్రభావం ఉన్నట్టు టర్నీ దేశీయాంగ మంత్రి సులేమాన్ సోయిల్ తెలిపారు. గజియాన్‌టెప్, కహ్రమాన్‌మరస్, హటాయ్, ఒస్మానియె, అడియమన్, మలట్య, అడన, కిలిస్ తదితర సిటీలపై ఈ ప్రబావం ఎక్కువగా ఉందన్నారు. గజియాన్‌టెప్‌లోని షాపింగ్ మాల్ కుప్పకూలినట్టు బీబీసీ టర్కీ కరస్పాండెంట్ తెలిపారు. తాను ఉంటున్న భవనం సుమారు 45 నిమిషాలు కుదుపులకు గురైందని బీబీసీ ప్రొడ్యూసర్ రుష్ది అబ్దాలాఫ్ తెలిపారు. భూకంపం తీవ్రత 7.4గా టర్కీ భూకంప నమోదు నిపుణులు అంచనా వేశారు.