Nikki Haley: అమెరికాను ద్వేషించే దేశాలకు సాయం కట్.. పాక్-చైనాకు నిక్కీ హేలీ హెచ్చరిక

ABN , First Publish Date - 2023-02-26T15:15:11+05:30 IST

అమెరికాకు వ్యతిరేకంగా ఉండే దేశాలకు నిధులను ఇచ్చేది లేదని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ఇటీవల ప్రకటించిన భారతసంతతికి..

Nikki Haley: అమెరికాను ద్వేషించే దేశాలకు సాయం కట్.. పాక్-చైనాకు నిక్కీ హేలీ హెచ్చరిక

వాషింగ్టన్: అమెరికాకు వ్యతిరేకంగా ఉండే దేశాలకు నిధులను ఇచ్చేది లేదని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ఇటీవల ప్రకటించిన భారతసంతతికి చెందిన నిక్కీ హేలీ (Nikki Haley) స్పష్టం చేశారు. 2024 అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి ఈనెల 15న శ్రీకారం చుట్టిన నిక్కీహేలీ.. న్యూయార్క్ పోస్ట్‌లో ఇచ్చిన ఓపెన్ అడ్వర్‌టైట్‌మెంట్‌లో ఈ విషయం బలంగా నొక్కిచెప్పారు.

''నేను అధికారంలోకి వస్తే అమెరికాను ద్వేషించే దేశాలకు విదేశీ సాయాన్ని నిలిపివేస్తాను. చెడ్డ దేశాలకు నిధులివ్వరాదు. అమెరికా ప్రజల కష్టార్జితాన్ని వృథా కానివ్వం. మన పక్షాన నిలబడే మిత్రదేశాలకు మాత్రమే సాయం అందిస్తాం'' అని నిక్కీ హేలీ అన్నారు. పన్ను చెల్లించుదారులకు ఆ సొమ్ము ఎక్కడికి వెళ్తోందో తెలుసుకునే హక్కు ఉంటుందన్నారు. అమెరికా గత ఏడాది విదేశీ సాయం పేరుతో 46 బిలియన్ డాలర్లు ఖర్చు చేసిందని, ఇందులో ఎక్కువ మొత్తం అమెరికా వ్యతిరేక దేశాలకు వెళ్తోందని తెలిసి పన్ను చెల్లింపుదారులు విభ్రాంతికి గురవుతున్నారని అన్నారు.

''చైనా నుంచి అమెరికన్లకు ముప్పు పొంచి ఉన్నప్పటికీ అమెరికా పన్ను చెల్లింపుదారుల సొమ్మును పర్యావరణ కార్యక్రమాల కోసం ఇప్పటికీ కమ్యూనిస్టు చైనాకు ఇస్తున్నారు. రష్యా నియంత వ్లాడిమిర్ పుతిన్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే బెలారస్‌కు నిధులు ఇస్తున్నారు. టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తోందంటూ అమెరికానే స్వయంగా చెబుతూ వస్తున్న కమ్యూనిస్టు క్యూబాకు కూడా నిధులు ఇస్తున్నాం. ఒక్క జో బైడెన్ మాత్రమే కాదు, ఇరు పార్టీల అధ్యక్షుల హయాంలోనూ దశాబ్దాలుగా ఇది జరుగుతోంది'' అని నిక్కీ హేలీ అన్నారు.

పాకిస్థాన్‌కు అమెరికా సాయం గురించి ప్రస్తావిస్తూ, పాకిస్థాన్‌కు మిలటరీ సాయాన్ని బైడెన్ ప్రభుత్వం పునరుద్ధరించిందని, డజనుకు పైగా తీవ్రవాద సంస్థలకు నిలయంగా పాకిస్థాన్ ఉందని ఆమె ఆరోపించారు. అమెరికా మిత్రదేశమైన ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పాలస్తీనాకు సైతం దేశ నిధులు వెళ్తున్నాయన్నారు. అమెరికాపై దాడులు చేస్తామని బెదరిస్తున్న ఇరాన్‌కు సైతం 2 బిలియన్ల డాలర్ల సాయం అమెరికా అందించిందని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే ఇలాంటివి నిలిపివేస్తామని ఆమె హామీ ఇచ్చారు.

Updated Date - 2023-02-26T15:15:13+05:30 IST