Nepal Plane Crash: నేపాల్ విమాన ప్రమాదం.. యతి ఎయిర్‌లైన్స్ యజమాని కూడా..
ABN , First Publish Date - 2023-01-16T20:10:35+05:30 IST
నేపాల్‌లో ఆదివారం జరిగిన ఘోర విమాన ప్రమాదం(Nepal Plane Crash)లో అందులో ప్రయాణిస్తున్న 72 మందీ ప్రాణాలు కోల్పోయారు. నేపాల్‌లో జరిగిన
న్యూఢిల్లీ: నేపాల్‌లో ఆదివారం జరిగిన ఘోర విమాన ప్రమాదం(Nepal Plane Crash)లో అందులో ప్రయాణిస్తున్న 72 మందీ ప్రాణాలు కోల్పోయారు. నేపాల్‌లో జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదాల్లో ఇదొకటి. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 68 మంది మృతదేహాలను వెలికి తీశారు. మరో నాలుగు మృతదేహం కోసం గాలిస్తున్నారు. మృతుల్లో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు.
యతి ఎయిర్‌లైన్స్ (Yeti airlines)కు చెందిన ఏటీఆర్-72 విమానం నిన్న 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో కఠ్మాండు (Kathmandu) నుంచి పోఖరా(Pokhara) బయలుదేరింది. పోఖరాలో విమానం ల్యాండ్ కావడానికి కొన్ని నిమిషాల ముందు అకస్మాత్తుగా కుప్పకూలింది.
యతి ఎయిర్‌లైన్స్ యజమాని, ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన అంగ్ టిషిరింగ్ షేర్పా(Ang Tshiring Sherpa) కూడా ఇలాంటి ప్రమాదంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఫిబ్రవరి 2019లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మృతి చెందారు. టెర్తుమ్‌లో కొత్త విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు అప్పటి విమానయాన మంత్రి రవీంద్ర అధికారి, మరికొందరు మంత్రులు హెలికాప్టర్‌లో వెళ్లారు. వారి వెంట అంగ్ టిషిరింగ్ కూడా ఉన్నారు.
ఆరుగురితో కలిసి ఆ రోజు ఉదయం 6 గంటలకు హెలికాప్టర్ బయలుదేరింది. తిరిగి వస్తున్న సమయంలో ఓ కొండపై హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్ సహా అందులో ఉన్నవారందరూ ప్రాణాలు కోల్పోయారు. విచిత్రం ఏంటంటే ఐదు సీట్లున్న ఆ హెలికాప్టర్‌లో ఆరుగురు ప్రయాణించడం.
పతిభరా జిల్లాలోని టప్లేజుంగ్‌లో మధ్యాహ్నం 1.30 గంట సమయంలో హెలికాప్టర్ కూలిపోయింది. ఇది ఎయిర్ డైనస్టీ హెలి సర్వీసెస్‌కు చెందిన హెలికాప్టర్. నేపాల్‌లోని అత్యంత పురాతన హెలికాప్టర్ రెస్క్యూ కంపెనీ ఇది. ఆ ప్రమాదంలో అంగ్ టి షిరింగ్‌తో పాటు పౌర విమానయాన మంత్రి, ఆయన పీఎస్ఓ, సివిల్ ఏవియేషన్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, మంత్రిత్వశాఖ డైరెక్టర్, డిప్యూటీ సెక్రటరీ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.