Nepal: నేపాల్ అధ్యక్షుడిగా రామ్ చంద్ర పౌడెల్ ప్రమాణస్వీకారం
ABN , First Publish Date - 2023-03-13T14:36:54+05:30 IST
నేపాల్ కాంగ్రెస్ నేత రామ్ చంద్ర పౌడెల్ ఆ దేశ మూడవ అధ్యక్షుడిగా సోమవారంనాడు..
ఖాట్మండు: నేపాల్ (Nepal) కాంగ్రెస్ నేత రామ్ చంద్ర పౌడెల్ (Ram Chandra Paudel) దేశ మూడవ అధ్యక్షుడిగా సోమవారంనాడు ప్రమాణస్వీకారం చేశారు. ఖాట్మండులోని అధ్యక్ష భవనం సీతల్ నివాస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో 78 ఏళ్ల రామ్ చంద్ర పౌడెల్ చేత యాక్టింగ్ చీఫ్ జస్టిస్ హరి కృష్ణ కార్కి ప్రమాణస్వీకారం చేయించారు. ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్, స్పీకర్ దేవ్ రాజ్ ఘిమిరె, నేషనల్ అసెంబ్లీ చైర్మన్ గణేష్ ప్రసాద్, పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
నేపాల్ కాంగ్రెస్ సీనియర్ నేత అయిన పౌడెల్ దేశ మూడవ అధ్యక్షుడిగా గత గురువారంనాడు ఎన్నికయ్యారు. సీపీఎన్-యూఎంఎల్ నేత సుభాష్ చంద్రను ఓడించారు. మొత్తం 52,628 వెయిటేజ్ బేస్డ్ ఓట్లలో పౌడెల్‌కు 33,802 ఓట్లు పోల్ కాగా, సుభాష్ చంద్రకు 15,518 ఓట్లు వచ్చాయి. పౌడెల్‌ను ప్రజాప్రతినిధులు ఎన్నుకోవడంతో ప్రధానమంత్రి ప్రచండ ఆధ్వర్యంలోని సంకీర్ణ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. అధికార సంకీర్ణ కూటమి అభ్యర్థి రామచంద్ర ఎన్నిక కోసం ప్రచండం తెరవెనుక వ్యూహం సాగించారు. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి అధ్యక్షుడిగా గెలిస్తే నేపాల్ ప్రభుత్వంపై ఆ ప్రభావం పడే అవకాశాలు లేకపోలేదు. పలు సార్లు మంత్రిగా, మాజీ స్పీకర్‌గా పౌడెల్‌కు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది.