Israel-Hamas War: గాజాపై ఆ పిచ్చి దాడుల్ని ఆపేయండి.. ఇజ్రాయెల్‌ను సూచించిన టర్కీ ప్రధాని
ABN , First Publish Date - 2023-10-28T19:09:29+05:30 IST
హమాస్ చేసిన మెరుపుదాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఆ పాలస్టీనా మిలిటెంట్ గ్రూపుని పూర్తిగా సర్వనాశనం చేయాలన్న లక్ష్యంతో.. ఇజ్రాయెల్ భద్రతా దళాలు గాజాలో...
హమాస్ చేసిన మెరుపుదాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఆ పాలస్టీనా మిలిటెంట్ గ్రూపుని పూర్తిగా సర్వనాశనం చేయాలన్న లక్ష్యంతో.. ఇజ్రాయెల్ భద్రతా దళాలు గాజాలో విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఎడాపెడా బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో.. గాజా పౌరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఇప్పటికే వేలాదిమంది అక్కడ మృతి చెందారు. ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలోనే.. గాజాపై ఇజ్రాయెల్ దాడుల్ని తాత్కాలికంగా అయినా ఆపాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఇజ్రాయెల్ దాడుల్ని తాత్కాలికంగా ఆపాలని (సీజ్‌ఫైర్) ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఒక తీర్మానం ప్రవేశపెట్టగా.. అది ఆమోదం పొందింది.
ఇప్పుడు తాజాగా టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ పాలస్తీనాకు మద్దతుగా మరోసారి తన గళమెత్తాడు. ఈ యుద్ధంలో మొదటి నుంచి పాలస్తీనా పక్షం నిలిచిన ఆయన.. తాజాగా గాజాపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్ని ఆపాలని కోరారు. పాలస్తీనా భూభాగంపై ఇజ్రాయెల్ దళాలు తమ దాడులను తీవ్రతరం చేసిన తరుణంలో.. ఈ దాడుల్ని ముగించాల్సిందిగా ఎర్డోగాన్ పిలుపునిచ్చారు. ‘‘ఇజ్రాయెల్ వెంటనే ఈ మ్యాడ్‌నెస్‌ని, తన దాడుల్ని ఆపాలి’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘గాజాపై ఇజ్రాయెల్ బాంబు దాడులు తీవ్రమయ్యాయి. ఈ దాడులకు మరోసారి మహిళలు, పిల్లలు, అమాయక పౌరులు బలి అవుతున్నారు. ఇప్పటికే కొనసాగుతున్న మానవతా సంక్షోభాన్ని ఈ దాడులు మరింత దిగజార్చాయి’’ అని ట్విటర్ మాధ్యమంగా ఎర్డోగాన్ చెప్పుకొచ్చారు.
ఇదే సమయంలో.. ఇస్తాంబుల్‌లో పాలస్తీనియన్లకు మద్దతుగా తన ఇస్లామో-కన్సర్వేటివ్ ఏకేపీ పార్టీ నిర్వహించిన ర్యాలీని ప్రోత్సాహించారు. ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా పాలస్తీనా ప్రజలతో పాటు తామూ అండగా ఉంటామని ప్రకటించారు. కాగా.. గత రెండు దశాబ్దాల నుంచి అధికారంలో ఉన్న ఎర్డోగాన్, పాలస్తీనియన్లకు తమ మద్దతు తెలుపుతూనే ఉన్నాయి. అయితే.. ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలను పునరుద్ధిరించడం కోసం సెప్టెంబర్‌లో ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సమావేశం అయ్యాడు. ఇంతలో యుద్ధం ప్రారంభం అవ్వడంతో.. తమ భూమి కోసం పాలస్తీనియన్లను పోరాడుతున్నారని హమాస్‌కి మద్దతుగా ఎర్డోగాన్ వ్యాఖ్యానించారు. ఈ స్టేట్‌మెంట్‌ని ఇజ్రాయెల్ ఖండిస్తూ.. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది.