Turkey Syria earthquake: శిథిలాల కింద 17 గంటలు..తమ్ముడ్ని కాపాడుకున్న ఏడేళ్ల చిన్నారి

ABN , First Publish Date - 2023-02-08T15:32:25+05:30 IST

టర్కీ, సిరియాలో భూకంప విలయంతో ఎక్కడ చూసినా రోదనలే. బతికి బట్టకట్టినా సహాయం కోసం ఎదురుచూస్తూ కొందరు, కళ్లెదుటే ప్రాణాలు కోల్పోతున్న ..

Turkey Syria earthquake: శిథిలాల కింద 17 గంటలు..తమ్ముడ్ని కాపాడుకున్న ఏడేళ్ల చిన్నారి

న్యూఢిల్లీ: టర్కీ, సిరియాలో భూకంప విలయంతో ఎక్కడ చూసినా రోదనలే. బతికి బట్టకట్టినా సహాయం కోసం ఎదురుచూస్తూ కొందరు, కళ్లెదుటే ప్రాణాలు కోల్పోతున్న చిన్నారులు మరికొందరితో విషాద వాతావరణం నెలకొంది. ఇదే సమయంలో శిథిలాల కింద నుంచి చిక్కుకుని సహాయక బృందాల సాయంతో బయటపడుతున్న మృత్యుంజయలు కూడా కనిపిస్తున్నారు. ఓ గర్భిణి భూకంప శిథిలాల కిందే ఒక బిడ్డకు జన్మనిచ్చి ఆ తల్లి ప్రాణాలు కోల్పోయిన ఘటన చోటుచేసుకున్న కొద్ది సేపటికే, మరో అరుదైన ఘటన వెలుగుచూసింది. శిథిలాల కింద ఏడేళ్ల చిన్నారి తనకుంటే చిన్నవాడైన తమ్ముడి తలపై చేయి ఉంచి 12 గంటల పాటు కాపాడుకుంది. ఆ ఇద్దరు చిన్నారులను ప్రాణాలతో సహాయక సిబ్బంది బయటకు తీశారు. తమ్ముడి తలపై చేయి ఉంచి 'నేనున్నాను'అంటూ భరోసాగా నిలిచిన ఆ పాప, బోసినవ్వులు చిందిస్తున్న తమ్ముడి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐక్యరాజ్యసమితి ప్రతినిధి మొహమ్మద్ సఫా ఈ ఫోటోను షేర్ చేశారు.

''సురక్షితంగా చిన్నారులు ఇద్దరూ బయటపడటానికి ముందు 17 గంటల పాటు శిథిలాల కింద ఉండిపోయారు. ఏడేళ్ల పాప నేనున్నానంటూ తమ్ముడి తలపై చేయి ఉంచి కాపాడుకుంది. ఈ ఫోటోను ఎవరూ షేర్ చేయలేదు. పాప చనిపోయి ఉంటే ప్రతి ఒక్కరూ షేర్ చేసుండే వాళ్లు. షేర్ పాజిటివ్లీ..'' అని మొహమ్మద్ సఫా ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

కాగా, చిన్నారుల ఫోటో చూసి పలువురు నెటిజెన్లు చలించిపోయారు. పరిస్థితులకు ఎదురెడ్డి సాహసంగా నిలిచిన చిన్నారి బాలికను ప్రశంసలతో ముంచెత్తారు. ''భగవంతుడు ఈ ఇద్దరిని ఆశీర్వదించి, ఎప్పటికీ ఈ ప్రేమ చెక్కుచెదరకుండా ఉండాలి'' అని ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు. 'నా హృదయం ద్రవించిపోతోంది. టర్కీకి కొంత సాయం అందుతోంది. సిరియాలో మానవతాసాయం చాలా తక్కువగా అందుతోంది. సిరియన్ పౌరులకు ఏదోవిధంగా నేను సాయం చేయాలని ఆశిస్తున్నాను' అని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. ఇద్దరు చిన్నారులు ఆయురార్యోగాలతో సుదీర్ఘ కాలం జీవించాలని కోరుకుంటున్నట్టు మరో నెటిజన్ కామెంట్ చేశారు.

Updated Date - 2023-02-08T15:32:28+05:30 IST