United Airlines: పైలట్ చేసిన పెద్ద తప్పు.. విమానం రద్దు.. పైలట్ అరెస్ట్.. అసలేం జరిగిందంటే?
ABN , First Publish Date - 2023-07-29T15:33:59+05:30 IST
అది యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం. ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. విమాన సిబ్బందితో పాటు ప్రయాణికులు సైతం.. పైలట్ ఎప్పుడెప్పుడు వస్తాడా?
అది యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం. ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. విమాన సిబ్బందితో పాటు ప్రయాణికులు సైతం.. పైలట్ ఎప్పుడెప్పుడు వస్తాడా? విమానం ఎప్పుడు బయలుదేరుతుందా? అని వేచి చూస్తున్నారు. అయితే.. ఇంతలో పైలట్ ఒక పెద్ద తప్పు చేసి, అడ్డంగా దొరికిపోయాడు. దాంతో అతడ్ని అరెస్ట్ చేయడం, విమానం రద్దు కావడం జరిగింది. అసలేం జరిగింది? ఆ పైలట్ చేసిన తప్పేంటి? పదండి.. వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.
యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఒక విమానం పారిస్ నుంచి వాషింగ్టన్ డీసీకు వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ఈ విమానంలో మొత్తం 267 ప్యాసింజర్లు కూర్చుని ఉన్నారు. ఇక 63 ఏళ్ల హెన్రీ అనే పైలట్ కూడా తన విధులు నిర్వర్తించేందుకు బయలుదేరాడు. అయితే.. పైలట్ తీరుపై భద్రతాధికారులకు అనుమానం కలిగింది. ఆ పైలట్ కళ్లు ఎర్రగా ఉండటంతో పాటు తూలుతున్నట్టు గుర్తించారు. దీంతో.. మద్యం సేవించాడేమోనన్న అనుమానంతో ఆల్కహాల్ టెస్ట్ చేశారు. అందులో దిమ్మతిరిగే రిజల్ట్ వచ్చింది. నిబంధనల కంటే ఆరు రెట్లు మద్యం స్థాయిలు అధికంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో.. అతడ్ని అరెస్ట్ చేసి, విమానం రద్దు చేయాల్సి వచ్చింది.
విచారణలో భాగంగా.. విధుల్లో ఉన్నప్పుడు మద్యం సేవించకూడదన్న విషయం తెలీదా? అని పైలట్‌ని నిలదీస్తే, తాను రాత్రి కేవలం రెండు గ్లాసుల వైన్ మాత్రమేనని తాగానని బదులిచ్చాడు. కోర్టులోనూ అదే జవాబిచ్చాడు. ఏదేమైనా.. అతడు నిబంధనలకు విరుద్ధంగా నడుచుకోవడంతో ఆరు నెలల జైలు శిక్షతో పాటు 5 వేల డాలర్ల జరిమానా విధించారు. ఒకవేళ హెన్రీ ఆ మద్యం మత్తులోనే విమానం నడిపి ఉంటే.. 267 ప్రయాణికులకు ముప్పు వాటిల్లేదని జడ్జి అభిప్రాయపడ్డారు. అటు.. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఈ ఘటనపై స్పందిస్తూ, తాము అతడ్ని ఉద్యోగంలో నుంచి తొలగించామని చెప్పింది. ఇలాంటి చర్యల్ని సహించేది లేదని బదులిచ్చింది.