Influencer Zhanna D'Art: వద్దన్నా వినలేదు.. చివరికి బక్కచిక్కిపోయి.. ఆకలితో చనిపోయింది

ABN , First Publish Date - 2023-08-01T15:47:47+05:30 IST

కొందరు ఎల్లప్పుడూ ఫిట్‌గా ఉండాలన్న ఉద్దేశంతో.. స్ట్రిక్ట్ డైట్‌ని ఫాలో అవుతుంటారు. బలమైన ఆహార పదార్థాలను పూర్తిగా దూరం పెట్టి.. కేవలం పండ్లు ఫలాలతోనే లాగించేస్తుంటారు. ఎంత ఆకలి వేసినా, పొట్ట లాగేసినట్టు అనిపించినా సరే.. డైట్‌ని మాత్రం వీడరు.

Influencer Zhanna D'Art: వద్దన్నా వినలేదు.. చివరికి బక్కచిక్కిపోయి.. ఆకలితో చనిపోయింది

కొందరు ఎల్లప్పుడూ ఫిట్‌గా ఉండాలన్న ఉద్దేశంతో.. స్ట్రిక్ట్ డైట్‌ని ఫాలో అవుతుంటారు. బలమైన ఆహార పదార్థాలను పూర్తిగా దూరం పెట్టి.. కేవలం పండ్లు ఫలాలతోనే లాగించేస్తుంటారు. ఎంత ఆకలి వేసినా, పొట్ట లాగేసినట్టు అనిపించినా సరే.. డైట్‌ని మాత్రం వీడరు. తూ.చ. తప్పకుండా పాటిస్తారు. ఎక్కడ లావైపోతామోనన్న భయంతో.. భోజనం జోలికి వెళ్లరు. అప్పుడు అది వారి శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కొన్ని సంవత్సరాల పాటు భోజనానికి దూరంగా ఉంటే.. శరీరం బలహీనంగా తయారవుతుంది. తద్వారా బక్కచిక్కిపోయి.. తీవ్ర అనారోగ్యానికి గురవ్వడమో, లేక ఆకలితో మరణించడమో జరుగుతుంది. గతంలో కొందరు చనిపోయిన సందర్భాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా స్ట్రిక్ట్ డైట్ మోజులో పడి, మృత్యువాత పడింది. వద్దన్నా వినకుండా స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయ్యి, మృత్యువుని ఆహ్వానించింది.


ఆ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పేరు జానా గ్జానా సామ్‌సోనోవా (Zhanna Samsonova). ఈమె వయసు 39 సంవత్సరాలు. ఇన్‌స్టాగ్రామ్‌లో గ్జానా డీ'ఆర్ట్ పేరుతో పాపులారిటీ గడించిన ఈ మహిళ.. దాదాపు పది సంవత్సరాల నుంచి కేవలం పచ్చి శాకాహారం మాత్రమే తింటోంది. పండ్లు, వాటి జ్యూస్‌లు మాత్రమే తాగుతూ వస్తోంది. ఫిట్‌నెస్‌లో భాగంగా.. బలమైన ఆహార పదార్థాల్ని పూర్తిగా పక్కన పెట్టేసి, వీగన్ రా ఫుడ్ మాత్రమే తింటూ వచ్చింది. ఫలితంగా.. ఆమె పూర్తిగా బక్కచిక్కి పోయింది. ఒక్క ముఖం తప్పిస్తే.. మొత్తం శరీరం ఎముకులగూడులాగా తయారైంది. గ్జానా పరిస్థితిని చూసి భయపడిపోయిన ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితులు.. వీగన్ డైట్‌ని మానేయాలని, పోషకాహారాలు తినడం ప్రారంభించమని సూచించారు. బరువు పెంచడంపై దృష్టి పెట్టాలని కోరారు. కానీ.. ఆమె మాత్రం ఎవ్వరి మాట వినలేదు. తానొక వీగన్ ఇన్‌ఫ్లుయెన్సర్ అని, కేవలం వీగన్ రా ఫుడ్ మాత్రమే తింటానంటూ పట్టుబట్టింది.


అయితే.. ఒక దశలో గ్జానా పూర్తిగా బలహీనపడింది. సరిగ్గా లేచి నిలబడలేని దుస్థితికి వచ్చింది. దీంతో.. ఆసియా టూర్‌లో ఉన్నప్పుడు వైద్యుడ్ని సంప్రదించింది. చికిత్స తీసుకోవడం ప్రారంభించింది. కానీ.. అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఆమెని కాపాడ్డానికి వైద్యులు సాయశక్తులా ప్రయత్నించారు కానీ, శరీరం సహకరించకపోవడంతో ఏం చేయలేకపోయారు. చికిత్స పొందుతూ ఆమె ఆకలితో.. జులై 21వ తేదీన తుదిశ్వాస విడిచింది. గ్జానా మరణంపై తల్లి మాట్లాడుతూ.. తన కూతురు కలరా వంటి ఇన్ఫెక్షన్‌తో మృతి చెందిందని పేర్కొన్నారు. వీగన్ రా ఫుడ్ కారణంగా ఆమె శరీరం ఒత్తిడికి గురైందని, అదే ఆమె ప్రాణాలు తీసిందని భావోద్వేగానికి లోనైంది.

Updated Date - 2023-08-01T15:47:47+05:30 IST