Benjamin Netanyahu: హమాస్‌ని ముక్కలు ముక్కలు చేస్తాం.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ శపథం
ABN , First Publish Date - 2023-10-16T18:29:38+05:30 IST
హమాస్ తమపై మెరుపుదాడులు చేసి యుద్ధానికి శంఖం పూరించడం, తమ దేశ పౌరుల్ని అపహరించుకుపోవడంతో.. ఇజ్రాయెల్ హమాస్‌పై ప్రతీకారం తీర్చుకుంటోంది. హమాస్‌ని నామరూపాల్లేకుండా...
హమాస్ తమపై మెరుపుదాడులు చేసి యుద్ధానికి శంఖం పూరించడం, తమ దేశ పౌరుల్ని అపహరించుకుపోవడంతో.. ఇజ్రాయెల్ హమాస్‌పై ప్రతీకారం తీర్చుకుంటోంది. హమాస్‌ని నామరూపాల్లేకుండా తుడిచిపెట్టేయాలన్న ఉద్దేశంతో.. గాజా స్ట్రిప్‌లో వారి రహస్య స్థావరాలపై ఇప్పటికే బాంబుల వర్షం కురిపించింది. ఇప్పుడు గ్రౌండ్ ఆపరేషన్స్ సైతం నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమతో యుద్ధానికి దిగిన హమాస్‌ని ముక్కలు ముక్కలుగా చేసి, పూర్తిగా సర్వనాశనం చేస్తామని శపథం చేశారు.
హమాస్‌తో యుద్ధం ప్రారంభమైన తర్వాత అక్టోబర్ 15వ తేదీన తన అధ్యక్షతన అత్యవసర మంత్రివర్గ క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత దక్షిణ ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన దాడుల్లో మరణించిన వారికి మంత్రివర్గం ఒక నిమిషంపాటు మౌనం పాటించింది. అనంతరం ప్రధాని బెంజమిన్ మాట్లాడుతూ.. తాము 24 గంటలు ఐక్యంగా, టీమ్ వర్క్‌తో పని చేస్తున్నామన్నారు. మనలోని ఈ ఐక్యత.. ప్రజలకు, శత్రువులకు, ప్రపంచానికి స్పష్టమైన సందేశాన్ని ఇస్తుందన్నారు. ప్రస్తుతం తాను ముందు వరుసలో ఉన్న అద్భుతమైన యోధులను చూశానని.. దేశం మొత్తం వారి వెనుకే ఉందన్న విషయాన్ని వాళ్లకు తెలుసని అన్నారు.
రక్తం తాగే రాక్షసులను, మనకు నష్టం కలిగించే ఆ ఉగ్రవాదుల్ని అంతం చేసేందుకు మన ఇజ్రాయిలీ సైనికులు సిద్ధంగా ఉన్నారని బెంజిమన్ పేర్కొన్నారు. ఏ క్షణంలో ఎలాంటి పావులు కదపాలో, హమాస్‌ని నిర్మూలించేందుకు ఏ చర్యలు తీసుకోవాలని వారికి బాగా తెలుసన్నారు. తమ పనేంటో, దాని పరిణామాలేంటో వారికి అవగాహన ఉందన్నారు. హమాస్ చేసిన దాడులతో మేమంతా విచ్ఛిన్నం అయ్యామని ఆ ఉగ్రవాద సంస్థ భావిస్తోందని.. అలా అనుకుంటే ఆ సంస్థ పప్పులో కాలేసినట్టేనని అన్నారు. తాము హమాస్‌ని ముక్కలు ముక్కలుగా చేసేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. హమాస్‌ని పూర్తిగా నిర్మూలిస్తామని బల్లగుద్ది మరీ చెప్పారు.
ఇదిలావుండగా.. ఈ మంత్రివర్గ సమావేశంలో భాగంగా ఇజ్రాయెల్ మాజీ రక్షణ మంత్రి, మిలిటరీ చీఫ్ బెన్నీ గాంట్జ్ ప్రధాని నెతన్యాహుతో కలిసి ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఐదుగురు సభ్యులతో కూడిన యుద్ధ-నిర్వహణ మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. పోరాటం కొనసాగుతున్నంత కాలం.. యుద్ధంతో సంబంధం లేని ఏ చట్టాన్ని లేదా నిర్ణయాన్ని ప్రభుత్వం ఆమోదించదు. అంటే.. ప్రస్తుతం తమ దృష్టంతా యుద్ధం మీదే ఉందని ఈ ప్రకటన ద్వారా ఇజ్రాయెల్ స్పష్టం చేసిందని అర్థం చేసుకోవచ్చు.