Israel-Hamas War: రఫా బార్డర్ క్రాసింగ్ ఏంటి? ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో దాని ప్రాధాన్యమేంటి?
ABN , First Publish Date - 2023-10-17T16:24:01+05:30 IST
అక్టోబర్ 7వ తేదీన మొదలైన ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. హమాస్ మెరుపుదాడులు చేయడంతో పాటు తమ దేశ పౌరుల్ని కిడ్నాప్ చేయడంతో.. ఇజ్రాయెల్ ప్రతీకారం..
అక్టోబర్ 7వ తేదీన మొదలైన ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. హమాస్ మెరుపుదాడులు చేయడంతో పాటు తమ దేశ పౌరుల్ని కిడ్నాప్ చేయడంతో.. ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంటోంది. హమాస్‌ని నామరూపాల్లేకుండా తుడిచిపెట్టేయాలన్న లక్ష్యంతో ఇజ్రాయెల్ సైన్యం దూసుకెళ్లిపోతోంది. గాజా స్ట్రిప్‌లో దూరి మరీ తలదాచుకున్న హమాస్ ఉగ్రవాదుల్ని, వారి రహస్య స్థావరాల్ని ఖతం చేస్తోంది.
ఈ ఆపరేషన్‌లో భాగంగా.. గాజా స్ట్రిప్‌లో ఎన్నో ఆంక్షలు విధించింది. ఇంధన, ఆహార, విద్యుత్ సరఫరాలపై పూర్తిగా నిషేధం విధించింది. అంతేకాదు.. మానవతా సహాయం అందించేందుకు కూడా ఇజ్రాయెల్ నిరాకరించింది. దీంతో.. సామాన్యులు గాజా స్ట్రిప్ నుంచి సురక్షితంగా బయటపడేందుకు నానాతంటాలు పడుతున్నారు. ఇలాంటి సంక్షోభ సమయంలో.. పాలస్తీనా ప్రజలకు ‘రఫా సరిహద్దు క్రాసింగ్’ ఒక జీవనాధారంగా మారింది. సరిహద్దును దాటి ఈజిప్టులో ప్రవేశించేందుకు గాను.. ఆ ప్రాంతంలో ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడారు.
అసలేంటి రఫా బోర్డర్ క్రాసింగ్? దాని ప్రాముఖ్యత ఏంటి?
ఇది గాజా స్ట్రిప్‌కు దక్షిణాన ఉన్న బార్డర్ క్రాసింగ్. ఇది గాజా స్ట్రిప్, ఈజిప్ట్‌లోని సినాయ్ ఎడారి ప్రాంతాన్ని కలుపుతుంది. గాజా స్ట్రిప్ ప్రాంతంలో ఎరేజ్, కెరెమ్ షాలోమ్ అనే ఇతర సరిహద్దు పాయింట్లు కూడా ఉన్నాయి. అయితే.. అవి ఇజ్రాయెల్‌తో అనుసంధానించబడి, ఇజ్రాయెల్ నియంత్రణలో ఉన్నాయి. తన వాణిజ్య కార్యకలాపాల కోసం మాత్రమే ఇజ్రాయెల్ ఆ రెండింటిని తెరుస్తుంది. ఇప్పుడు హమాస్‌తో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో.. అక్టోబర్ 7వ తేదీ నుంచి ఈ రెండు బార్డర్లను ఇజ్రాయెల్ పూర్తిగా మూసేసింది.
ఇలాంటి పరిస్థితుల్లో గాజా పౌరులకు రఫా బార్డర్ ఒక్కటే ఏకైక జీవనాధారంగా మిగిలుంది. దీని ద్వారానే వాళ్లు గాజా స్ట్రిప్ లోపలికి, బయటకు రావొచ్చు. గాజా స్ట్రిప్‌కు మానవతా సహాయం అందించడంలో నిమగ్నమైన అంతర్జాతీయ ఏజెన్సీలు.. తమ ట్రక్కులను ఈ సరిహద్దు నుండి గాజా స్ట్రిప్‌కు తీసుకెళ్లే అవకాశం ఉంది. సహాయ సామాగ్రి, పెట్రోల్, డీజిల్‌తో నిండిన డజన్ల కొద్దీ ట్రక్కులు.. రఫా బార్డర్ క్రాసింగ్ వద్ద ఆగి ఉన్నాయి. సరిహద్దు తెరవగానే.. అవి లోనికి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నాయి.
రఫా బార్డర్ ఎందుకు మూసివేశారు?
గాజా పౌరులకు జీవనాధారంగా మారిన ఈ రఫా బార్డర్ క్రాసింగ్‌ను ప్రస్తుతానికి మూసివేశారు. హమాస్ ఉగ్రవాదులు గాజా నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని ఇజ్రాయెల్ కోరుతోంది. మరోవైపు.. ఈ రఫా బార్డర్‌పై నియంత్రణ కలిగిన ఈజిప్ట్ సైతం దీన్ని తెరిచేందుకు ఇష్టపడట్లేదు. పాలస్తీనా పౌరులు గాజా స్ట్రిప్ నుంచి సినాయ్ ఎడారిలో వచ్చి స్థిరపడతారేమోనని ఈజిప్ట్ చింతిస్తోంది. ఇదే సమయంలో.. ఇస్లామిక్ తీవ్రవాదులు కూడా తమ దేశంలోకి వస్తారని ఈజిప్ట్ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.