Share News

Israel Document Leak: ఇజ్రాయెల్ డాక్యుమెంట్ లీక్.. గాజాపై పెద్ద స్కెచ్చే వేశారుగా.. మొత్తం ప్రజలనే..?

ABN , First Publish Date - 2023-11-01T18:54:47+05:30 IST

హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) చేసిన మెరుపుదాడులకు ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ దండయాత్ర చేస్తోంది. హమాస్‌ని నాశనం చేయాలన్న లక్ష్యంతో.. ఇప్పటికే ఆహార, ఇంధన, నీరు, విద్యుత్ సరఫరాలపై నిషేధం విధించి గాజాను...

Israel Document Leak: ఇజ్రాయెల్ డాక్యుమెంట్ లీక్.. గాజాపై పెద్ద స్కెచ్చే వేశారుగా.. మొత్తం ప్రజలనే..?

హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) చేసిన మెరుపుదాడులకు ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ దండయాత్ర చేస్తోంది. హమాస్‌ని నాశనం చేయాలన్న లక్ష్యంతో.. ఇప్పటికే ఆహార, ఇంధన, నీరు, విద్యుత్ సరఫరాలపై నిషేధం విధించి గాజాను దిగ్బంధించడంతో పాటు వైమానిక దాడులు, గ్రౌండ్ ఆపరేషన్స్ నిర్వహిస్తోంది. ఈ దాడుల కారణంగా గాజా ఇప్పటికే శవాలదిబ్బగా మారింది. ఈ యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటించాలని అభ్యర్థనలు వస్తున్నా.. ఇజ్రాయెల్ వాటిని పట్టించుకోకుండా తన దాడుల్ని కొనసాగిస్తూనే ఉంది.

ఇలాంటి తరుణంలో.. ఇజ్రాయెల్‌కు చెందిన ఒక సంచలన డాక్యుమెంట్ లీక్ అయ్యిందని నివేదికలు పేర్కొంటున్నాయి. పది పేజీలు కలిగిన ఆ డాక్యుమెంట్‌ని ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ మంత్రిత్వ శాఖ సిద్ధం చేసిందని వికీలీక్స్ Xలో పోస్ట్ చేసింది. గాజాపై ఎలాంటి ప్రణాళికలు రచించాలన్న రహస్యాలన్నీ అందులో ఉన్నట్టు వెల్లడైంది. గాజాలో నివసిస్తున్న పాలస్తీనియన్లను ఈజిప్టులోని సినాయ్‌కు పంపాలని ఇజ్రాయెల్ ప్రణాళికల్లో ఒకటిగా ఆ డాక్యుమెంట్‌ ద్వారా బయటపడింది. గాజాలో భూతల దాడులు ప్రారంభించడానికి ముందు.. ఉత్తర గాజాలో ఉన్న ప్రజల్ని దక్షిణ గాజాకు వెళ్లమని ఆదేశాలు జారీ చేయాలన్నట్టు అందులో పేర్కొని ఉంది. ఈ ప్లాన్ ఆల్రెడీ వర్కౌట్ అయ్యింది కూడా.


మొదట్లో ఇదొక ఒక కాన్సెప్ట్ డాక్యుమెంట్ మాత్రమేనని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం తెలిపింది. కానీ.. అసలు విషయం వెలుగులోకొచ్చాక పాలస్తీనా, ఈజిప్టు ప్రభుత్వాలు తీవ్రంగా విమర్శించాయి. గాజా సమస్యను ఈజిప్ట్ సమస్యగా మార్చాలని ఇజ్రాయెల్ యోచిస్తోందని, అక్కడి జనాభా ఈజిప్టులోకి ప్రవేశిస్తే కొత్త సమస్యలకు దారి తీస్తుందని ఈజిప్ట్ ఆందోళన చెందుతోంది. అటు.. ఈ పథకం ద్వారా గాజాను ఆక్రమించి, తమను తరిమికొట్టాలని ఇజ్రాయెల్ ప్రణాళికలు రచిస్తున్నట్టు పాలస్తీనా భావిస్తోంది. దీంతో.. పాలస్తీనా ప్రజల్ని ఎక్కడికైనా పంపడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్ ప్రతినిధి నబిల్ అబు హెచ్చరించారు.

ఇజ్రాయెల్ ఆర్మీ ప్లాన్ ఏంటి?

ఉత్తర, దక్షిణ గాజాలను విభజించడం ద్వారా మొత్తం పాలస్తీనా జనాభాను దక్షిణ గాజాకు పరిమితం చేయాలని ఇజ్రాయెల్ సైన్యం భావిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఉత్తర ప్రాంతంలోనే హమాస్ ప్రధాన కేంద్రాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) హమాస్‌ను పూర్తిగా తుదముట్టించాలని యోచిస్తోంది. ఉత్తర గాజాలోని 11 లక్షల ఉండగా.. యుద్ధం కారణంగా దాదాపు 8 లక్షల మంది ప్రజలు దక్షిణ గాజాకు వెళ్లవలసి వచ్చింది. ఒకవేళ నెతన్యాహూ ‘సినాయ్’ ప్రణాళిక నిజంగానే అమలు చేయబడితే.. అప్పుడు అరబ్ దేశాల ఆగ్రహాన్ని చవిచూడక తప్పదు.

Updated Date - 2023-11-01T18:54:47+05:30 IST