Israel Hamas War: ఇజ్రాయెల్‌పై దాడుల వెనుక మాస్టర్‌మైండ్ ఎవరు? ఇస్మాయిల్ చరిత్ర ఏంటి?

ABN , First Publish Date - 2023-10-12T16:15:51+05:30 IST

ప్రస్తుతం హమాస్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తొలుత హమాస్ మెరుపుదాడులు చేసి ఈ యుద్ధానికి బీజం వేసింది. దీంతో ఇజ్రాయెల్ కూడా ఎదురుదాడులకు దిగి...

Israel Hamas War: ఇజ్రాయెల్‌పై దాడుల వెనుక మాస్టర్‌మైండ్ ఎవరు? ఇస్మాయిల్ చరిత్ర ఏంటి?

ప్రస్తుతం హమాస్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తొలుత హమాస్ మెరుపుదాడులు చేసి ఈ యుద్ధానికి బీజం వేసింది. దీంతో ఇజ్రాయెల్ కూడా ఎదురుదాడులకు దిగి ప్రతీకారం తీర్చుకుంటోంది. ఇజ్రాయెల్ కురిపిస్తున్న బాంబుల వర్షానికి గాజాలోని భవనాలన్నీ కుప్పకూలిపోయాయి. అదొక చెత్త దిబ్బలాగా మారింది. హమాస్‌ని పూర్తిగా అంతం చేసి, గాజాని స్వాధీనం చేసుకునేందుకు గాను ఇజ్రాయెల్ 3 లక్షల రిజర్వ్ బలగాల్ని మోహరించింది కూడా! అయినప్పటికీ.. ఇస్మాయిల్ హనియే ఆచూకీని ఇంతవరకూ కనుగొనలేకపోయింది.

అసలు ఎవరు ఈ ఇస్మాయిల్ హనియే?

పాలస్తీనా మిలిటెంట్ సంస్థ అయిన ‘హమాస్’కు ఇస్మాయిల్ అధ్యక్షుడు. అతని పర్యవేక్షణలోనే ఇజ్రాయెల్‌పై హమాస్ గత 50 ఏళ్లలో మునుపెన్నడూ లేని విధంగా తాజాగా అత్యంత క్రూరమైన దాడులు చేసింది. హమాస్ రాజకీయ విభాగానికి ఇస్మాయిల్ చీఫ్‌గా ఉండగా.. మిలిటరీ వింగ్‌కి మహమ్మద్ డేఫ్ చీఫ్‌గా ఉన్నాడు. శనివారం ఉదయం ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసిన తర్వాత ఇస్మాయిల్ ఒక వీడియోని విడుదల చేశాడు. అందులో అతడు ‘సజ్దా’ (సాష్టాంగ నమస్కారం) చేస్తూ కనిపించాడు. ఇజ్రాయెల్ నివేదికల ప్రకారం.. ఇస్మాయిల్ ప్రస్తుతం ఖతార్‌లో ఉన్నాడు. అక్కడి నుండే అతడు ఈ మొత్తం ఆపరేషన్‌ని నడిపిస్తున్నాడు. అయితే.. ఖతార్‌లో పక్కాగా ఎక్కడున్నాడన్న లొకేషన్ మాత్రం ఇంకా దొరకలేదు.


ఇస్మాయిల్ చరిత్ర ఏంటి?

1962లో గాజా ప్రాంతంలోని శరణార్థి శిబిరంలో ఇస్మాయిల్ జన్మించాడు. గాజాలోని యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్ ఏజెన్సీలో అతని విద్యాభ్యాసం కొనసాగింది. 1981లో అరబిక్ సాహిత్యాన్ని అభ్యసించాడు. 1988లో ఇజ్రాయెల్ నియంత్రణకు వ్యతిరేకంగా జరిగిన మొదటి తిరుగుబాటులో ఇస్మాయిల్ పాల్గొన్నాడు. అప్పుడు ఇజ్రాయెల్ అధికారులు అతడ్ని అరెస్ట్ చేశాడు. ఆరు నెలలపాటు జైల్లో గడిపిన అతగాడు.. మళ్లీ 1989లో అరెస్టయ్యాడు. 1992 వరకు జైలు శిక్ష అనుభవించాడు. అనంతరం ఇస్మాయిల్‌తో పాటు మరో 400 మంది తిరుగుబాటుదారులను ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్‌కు పంపించారు. అక్కడి నుంచి అతడు క్రమంగా ఎదుగుతూ.. 2006 నుండి 2007 వరకు పాలస్తీనియన్ అథారిటీ (PA) ప్రధాన మంత్రిగా పని చేశాడు.

2006లో పాలస్తీనా లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికలు జరగ్గా.. ఆ పోటీలో ‘హమాస్’ అత్యధిక మెజారిటీ సాధించింది. దాంతో.. హమాస్ ప్రభుత్వం ఏర్పడింది. అప్పుడు వెస్ట్ బ్యాంక్, గాజాలోని ప్రాతినిధ్యం వహించే విషయంపై ఫతా పార్టీతో ఇస్మాయిల్ హనియేకు అంతర్గత విభేదాలు ఏర్పడ్డాయి. ఫైనల్‌గా ఫతా పార్టీ వెస్ట్ బ్యాంక్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. గాజాలో హమాస్ తన ప్రభుత్వాన్ని నెలకొల్పింది. 2007 నుండి 2014 వరకు ఇస్మాయిల్ హనియే గాజాలోని హమాస్ తరపున ప్రభుత్వ నాయకత్వ పాత్రను పోషించాడు. పతా పార్టీతో ఉన్న ఉద్రిక్తల కారణంగా.. గాజాలో హమాస్ స్వతంత్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా ఇజ్రాయెల్‌పై జరిగిన దాడుల వెనుక ఇస్మాయిల్ హనియేనే మాస్టర్‌మైండ్‌.

Updated Date - 2023-10-12T16:15:51+05:30 IST