USA: మరణం అంచున ఉన్న భర్తను తుపాకీతో కాల్చి చంపిన మహిళ.. ఎందుకో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-01-22T19:43:39+05:30 IST

మరణం అంచున ఉన్న ఓ వృద్ధుడిని ఆయన భార్య తుపాకీతో కాల్చి చంపేశారు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో గల ఓ ఆస్పత్రిలో శనివారం ఈ దారుణం చోటుచేసుకుంది.

USA: మరణం అంచున ఉన్న భర్తను తుపాకీతో కాల్చి చంపిన మహిళ.. ఎందుకో తెలిస్తే..

డేటోనా బీచ్(ఫ్లోరిడా): మరణం అంచున ఉన్న ఓ వృద్ధుడిని ఆయన భార్య తుపాకీతో కాల్చి చంపేశారు. అమెరికాలోని ఫ్లోరిడా(Florida) రాష్ట్రంలో గల ఓ ఆస్పత్రిలో శనివారం ఈ దారుణం చోటుచేసుకుంది. సుదీర్ఘంగా అనారోగ్యంతో బాధపడుతున్న భర్త తనను చంపేయాలని భార్యను కోరడంతోనే ఆమె ఈ హత్య చేసింది. ఈ మేరకు డేటోనా బీచ్(Daytona Beach) పోలీస్ చీఫ్ జాకరీ యంగ్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఈ కేసులో నిందితురాలు ఎలెన్ గిలార్డ్‌పై ఫస్ట్ డిగ్రీ హత్యా నేరం మోపే అవకాశం ఉన్నట్టు తెలిపారు. అడ్వెంట్ హెల్త్ ఆస్పత్రిలో ఆమె భర్త జెర్రీ గిలార్డ్‌(77) చికిత్స తీసుకున్నారు.

భార్యాభర్తలు ఈ విషయమై మూడు వారాల క్రితమే చర్చించుకున్నారని జాకరీ యంగ్ తెలిపారు. ‘‘అనారోగ్యం మరింత ముదిరి మరణం తప్పదన్న సందర్భంలో జెర్రీ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. అయితే.. చివరి నిమిషంలో అతడికి ధైర్యం చాలకపోవడంతో తనను చంపాలని భార్యకు చెప్పాడు’’ అని వాంగ్ చెప్పారు. ఆస్పత్రిలో కాల్పుల కలకలం రేగగానే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. భర్తను కాల్చి చంపాక జెర్రీ గిలార్డ్ గది తలుపులు వేసుకుని బయటకు వచ్చేందుకు నిరాకరించారు. అయితే పోలీసులు ఆమెపై రబ్బర్ బుల్లెట్స్ ప్రయోగించి చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. భర్తను చంపాక ఆత్మహత్య చేసుకునేందుకు ఎలెన్ యత్నించారని, కానీ ధైర్యం చాలక చివరి నిమిషంలో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారని చెప్పారు. ఆస్పత్రిలోకి ఎలెన్ తుపాకీ ఎలా తేగలిగిందనే దానిపై ఆరా తీస్తున్నారు.

Updated Date - 2023-01-22T19:43:40+05:30 IST