Uttarakashi: ఉత్తర కాశీ టన్నెల్ వద్ద 3 అంబులెన్స్‌లు.. కొనసాగుతున్న సహాయక చర్యలు
ABN , First Publish Date - 2023-11-22T14:04:26+05:30 IST
ఉత్తర కాశీ టన్నెల్(Uttarakhashi Tunnel Collapse) లో చిక్కుకున్న 41 మంది కార్మికులను కాపడటానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 3 అంబులెన్స్ లు ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి.
డెహ్రడూన్: ఉత్తర కాశీ టన్నెల్(Uttarakhashi Tunnel Collapse) లో చిక్కుకున్న 41 మంది కార్మికులను కాపడటానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 3 అంబులెన్స్ లు ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి. మరో 35 అంబులెన్స్ లు త్వరలో టన్నెల్ చెంతకు చేరుకోనున్నట్లు అధికారులు చెప్పారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. సిల్క్యారా సొరంగం కుప్పకూలిన ప్రదేశంలో 10వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
ఉత్తరాఖండ్(Uttarakhand) రాష్ట్రం ఉత్తర కాశీ జిల్లా సిల్క్యారా వద్ద నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిన ఘటనలో చిక్కుకున్న 41 మంది కూలీలు క్షేమంగా ఉన్నారన్న సమాచారం అధికారులకు, కుటుంబ సభ్యలకు ఊరటనిచ్చింది. శిథిలాల నుంచి 53 మీటర్ల మేర చొప్పించిన 6 అంగుళాల పైప్‌లో.. వాకీటాకీలు జత చేసిన ఎండోస్కోపీ కెమెరాతో రికార్డు చేసిన వీడియోను అధికారులు నిన్న విడుదల చేశారు.
మంగళవారం తెల్లవారుజామున తీసిన ఈ వీడియోలో కూలీలు పసుపు-తెలుపు రంగులోని హెల్మెట్లు ధరించి, ఒకరికొరు మాట్లాడుకుంటూ పైప్ నుంచి వచ్చిన ఆహార పదార్థాలను అందుకోవడం కనిపించింది. తామంతా క్షేమంగానే ఉన్నట్లు వాకీటాకీలో సమాచారం అందించారు. ప్రధాని మోదీ(PM Modi) ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ ధామికి ఫోన్ చేసి సహాయక చర్యల పురోగతిని తెలుసుకున్నారు. మరోవైపు.. అధికారులు సొరంగంపై నిలువునా డ్రిల్లింగ్ చేయడంపై దృష్టిసారించారు.
సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు కొనసాగుతున్న మిషన్‌లో, వారి భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ కార్మికులందరినీ వేగంగా తరలించడానికి కృషి చేస్తున్నామని పుష్కర్ సింగ్ ధామితెలిపారు.సిల్క్యారా టన్నెల్ సైట్‌లో ఆక్సిజన్ సిలిండర్లు, మాస్క్‌లు, స్ట్రెచర్ నుండి BP పరికరాల వరకు అన్ని మెడికల్ సపోర్ట్ మెషీన్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.మొత్తంగా 40కి పైగా అంబులెన్సులు కావాలని రాష్ట్ర ఆరోగ్య శాఖకు సమాచారం అందించినట్లు వివరించారు.