Share News

Covid JN1 Subvariat: మళ్లీ కోరలు చాచుతున్న కరోనా.. భారీగా పెరిగిన జెఎన్1 సబ్‌వేరియంట్ కేసులు

ABN , Publish Date - Dec 25 , 2023 | 07:18 PM

నిన్న మొన్నటిదాకా కేసులు పెద్దగా నమోదవ్వని తరుణంలో.. కరోనా వైరస్ నుంచి దాదాపు విముక్తి లభించిందని అంతా అనుకున్నారు. కానీ.. ఇంతలోనే ఈ వైరస్ మరోసారి కోరలు చాచడం మొదలుపెట్టింది. గతకొన్ని రోజుల నుంచి మన భారతదేశంలో...

Covid JN1 Subvariat: మళ్లీ కోరలు చాచుతున్న కరోనా.. భారీగా పెరిగిన జెఎన్1 సబ్‌వేరియంట్ కేసులు

JN1 Subvariat Cases: నిన్న మొన్నటిదాకా కేసులు పెద్దగా నమోదవ్వని తరుణంలో.. కరోనా వైరస్ నుంచి దాదాపు విముక్తి లభించిందని అంతా అనుకున్నారు. కానీ.. ఇంతలోనే ఈ వైరస్ మరోసారి కోరలు చాచడం మొదలుపెట్టింది. గతకొన్ని రోజుల నుంచి మన భారతదేశంలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే యాక్టివ్‌గా ఉన్న కరోనా కేసుల సంఖ్య 4,058కి చేరింది. దీనికితోడు.. జేఎన్1 సబ్‌వేరియంట్ కూడా విజృంభిస్తోంది. ఇప్పటిదాకా ఈ కొత్త వేరియంట్ కేసులు 63కి పెరిగాయని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది. ఒక్క గోవాలో మాత్రమే 34 కేసులు వెలుగు చూశాయి. ఇక మహారాష్ట్రలో 9, కర్ణాటకలో 8, కేరళలో 6, తమిళనాడులో 4, తెలంగాణలో 2 కేసులో బయటపడ్డాయి.


దేశవ్యాప్తంగా చూసుకుంటే.. గడచిన 24 గంటల్లో 628 కరోనా కేసులు నమోదు అవ్వగా, కేరళలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో.. కరోనావైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,33,334కి చేరింది. మరోవైపు.. కొత్తగా వచ్చిన సబ్‌వేరియంట్ జేఎన్1 గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది ఇంకా పరిశీలనలో ఉందని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఈ జేఎన్1 వేరియంట్ సోకిర వారిలో స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయని.. బాధితులు త్వరగా కోలుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ కొత్త వేరియంట్ బారిన పడిన 79 ఏళ్ల మహిళ.. ఇంట్లోనే ఉండి పూర్తిగా కోలుకున్నారని, ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారని గుర్తు చేశారు. ఈ కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న మాట వాస్తవమే కానీ.. మరీ ప్రమాదకరమైనది కాదని పేర్కొంటున్నారు.

మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో పలురకాల వేరియంట్లు బయటపడ్డాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. అమెరికా, చైనా, సింగపూర్‌లతో పాటు భారత్‌లో కూడా ఎన్నో కేసులు నమోదు అయ్యాయని.. అయితే ఈ వేరియంట్లు పెద్దగా ప్రభావం చూపలేదని పేర్కొంది. తాజాగా వచ్చిన జేఎన్1 వేరియంట్ కూడా ప్రజల ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపదని స్పష్టం చేసింది. అయితే.. ప్రజలు ముందుజాగ్రత్త చర్యలు తప్పకుండా తీసుకోవాలని సూచించింది. అటు.. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వాల్ని అప్రమత్తం చేసింది. కొవిడ్ నియంత్రణ చర్యలపై దృష్టి సారించాలని ఆదేశించింది. రాష్ట్రాలకు సహకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు.

Updated Date - Dec 25 , 2023 | 07:18 PM